'భ్రమయుగం' - మూవీ రివ్యూ!

  • మమ్ముట్టి తాజా చిత్రంగా వచ్చిన 'భ్రమయుగం' 
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • సినిమా మొత్తంలో కనిపించేవి ఐదు పాత్రలే  
  • బ్లాక్ అండ్ వైట్ లో చేసిన ప్రయోగం 
  • ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలు

మమ్ముట్టి ప్రధానమైన పాత్రగా 'భ్రమయుగం' సినిమా రూపొందింది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ - వైనాట్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన మలయాళంలో విడుదలైంది. తెలుగులో ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 17వ శతాబ్దంలో .. దక్షిణ మలబార్ ప్రాంతంలో మొదలవుతుంది. తేవన్ (అర్జున్ అశోకన్) అతని స్నేహితుడు కోరన్ (మణికందన్ ఆచారి) తాము అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే, అడవిలోని ఒక 'నది'ని దాటవలసి వస్తుంది. అప్పటికే చీకటి పడటంతో, మరునాడు ఉదయాన్నే 'నది'ని దాటాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి వాళ్లు ఆ అడవిలో ఒక 'యక్షి'ని చూస్తారు. కోరన్ ఆమె మాయలో పడగా, తేవాన్ అక్కడి నుంచి పారిపోతాడు. 

అలా అక్కడి నుంచి తప్పించుకున్న తేవాన్, తనకి తెలియకుండానే ఒక పాడుబడిన భవంతిలోకి అడుగుపెడతాడు. ఆ ఇంట్లో కొడుమోన్ పోట్టి (మమ్ముట్టి) అతనికి వండిపెట్టేవాడు (సిద్ధార్థ్ భరతన్) కనిపిస్తారు. కొడుమోన్ ఆదేశం మేరకు ఆ వంటవాడు తేవాన్ ఆకలి తీరుస్తాడు. తేవాన్ గాయకుడని తెలుసుకున్న కొడుమోన్, అతనితో పాటలు పాడించుకుంటాడు. కొడుమోన్ మంచి మనిషనీ, తనలాంటివారికి ఆశ్రయం కల్పించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని తేవాన్ అనుకుంటాడు. 

తేవాన్ ఆ ఇంట్లో ఉండటానికి వంటవాడు ఒక గదిని చూపిస్తాడు. రాత్రి వేళలో వేరే గదుల్లోకి వెళ్లడానికి ప్రయత్నించవద్దని హెచ్చరిస్తాడు. ఆ రాత్రంతా ఏవో శబ్దాలు అతణ్ణి భయపెడుతూనే ఉంటాయి. ఆ ఇంటి చుట్టూ అనేక మంది శవాలను పాతిపెట్టిన ఆనవాళ్లు చూసి అతను భయపడిపోతాడు. అంతకుముందు రాత్రి అడవిలో తాను చూసిన 'యక్షి' నేరుగా వచ్చి కొడుమోన్ ను కలవడం రహస్యంగా గమనించిన తేవాన్ ఆందోళన చెందుతాడు. 

ఆ రోజు రాత్రి అక్కడి నుంచి బయటపడటానికి అతను ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతోంది. దాంతో అతను ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుందని వంటవాడిని అడుగుతాడు. కొడుమోన్ ఎవరో చెప్పమని కోరతాడు. ఒకసారి ఆ ఇంటి సింహద్వారం దాటి లోపలికి వచ్చినవారు, ఇక అక్కడ నుంచి బయటపడలేరని వంటవాడు చెబుతాడు. ఇక కొడుమోన్ గురించి అతను ఏం చెబుతాడు? అసలు కొడుమోన్ ఎవరు? అది తెలుసుకున్న తేవాన్ ఏం చేస్తాడు? ఆ ఇంట్లో నుంచి బయటపడటానికి అతను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? .. లేదా? అనేదే కథ.

రాహుల్ సదాశివన్ రాసుకున్న హారర్ థ్రిల్లర్ కథ ఇది. ఈ సినిమా మొత్తం మీద ఐదు పాత్రలే తెరపై కనిపిస్తాయి. రెండు పాత్రలు తెరపై ఇలా కనిపించి అలా వెళ్లిపోతే, మిగతా మూడు పాత్రల మధ్యనే మిగతా కథంతా నడిపించడం ఒక విశేషం. ఇక ఈ సినిమాను పూర్తిస్థాయి బ్లాక్ అండ్ వైట్ లో అందించడం మరో విశేషం. మూడే పాత్రలతో దాదాపు రెండు గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టే కంటెంట్ ఉందా అంటే, ఉందనే చెప్పాలి.

దర్శకుడు ఫస్టు సీన్ తోనే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తాడు. అడవి నేపథ్యం .. నదీ ప్రవాహం .. పాడుబడిన ఇంటిని ఎంచుకున్న విధానం .. ఆ ఇంట్లో మూడు పాత్రల మధ్య నడిపించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మూడు పాత్రలను డిజైన్ చేసిన విధానమే ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. స్క్రీన్ ప్లే ... మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి మరో హైలైట్ గా చెప్పుకోవాలి. ఫ్లాష్ బ్యాక్ .. క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. 

ఈ కథను బ్లాక్ అండ్ వైట్ లో చెప్పవలసిన అవసరం ఉందా అనే సందేహం చాలామందిలో తలెత్త వచ్చు. అలా చెప్పడం వల్లనే ఈ కథ మరింత ఉత్కంఠభరితంగా అనిపించిందని భావించవచ్చు. మమ్ముట్టి కెరియర్లో తప్పకుండా ఇది ఒక ప్రత్యేకమైన పాత్ర అనేది మనం ఒప్పుకోవాలి. మమ్ముట్టితో పాటు ప్రధాన పాత్రలను పోషించినవారంతా, సహజమైన నటనను కనబరచడంలో మెప్పించారు. 

షెహనాద్ జలాల్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలం అనే చెప్పాలి. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను .. వర్షం సీన్స్ ను గొప్పగా చిత్రీకరించాడు. ఇక క్రిష్టో జేవియర్ నేపథ్య సంగీతం హైలైట్ అనే చెప్పాలి. కథలో నుంచి ప్రేక్షకుడు బయటికి రాకుండా చూసుకున్నాడు. షఫీక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. 

17వ శతాబ్దంలో నడిచే కథ .. అడవిలో ఒక పాడుబడిన ఇల్లు .. ఆ ఇంట్లో మూడు ప్రధానమైన పాత్రలు .. బ్లాక్ అండ్ వైట్ సినిమా .. అందునా గుడ్డి దీపాల వెలుగులో నడిచే సన్నివేశాలు .. అలా ఎక్కడికక్కడ లాక్ చేసుకుంటూ వెళ్లి, ఆడియన్స్ ను కూర్చోబెట్టేంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందించడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. కచ్చితంగా ఇది ఒక ప్రయోగం అనే చెప్పుకోవాలి. ఒక సినిమా నుంచి రొటీన్ గా ఆశించే అంశాలను గురించి ఆలోచించకుండా వెళితే, సాధారణంగా ఆస్వాదించే వినోదపరమైన అంశాలను పక్కన పెట్టేస్తే, ఈ సినిమా కొత్త ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందనే చెప్పాలి.

Movie Name: Bramayugam

Release Date: 2024-02-23
Cast: Mammootty, Arjun Ashokan, Sidharth Bharathan, Amalda Liz as Yakshi, Manikandan R Achari
Director: Rahul Sadasivan
Producer: Chakravarthy - Ramachandra
Music: Christo Xavier
Banner: Night Shift Studios

Bramayugam Rating: 3.25 out of 5

Trailer

More Movie Reviews