'ఊరు పేరు భైరవకోన' - మూవీ రివ్యూ!

  • ఫాంటసీ థ్రిల్లర్ జోనర్లో 'ఊరు పేరు భైరవకోన'
  • మోతాదు మించిన హారర్ .. యాక్షన్ సీన్స్  
  • ఎక్కడా కనిపించని రొమాన్స్ పాళ్లు
  • కాస్త ఊరట కలిగించే వెన్నెల కిశోర్ ట్రాక్
  • హీరోకి బలమైన విలనిజం ఎదురుపడకపోవడమే లోపం

సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు వీఐ ఆనంద్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాను రూపొందించాడు. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా హారర్ టచ్  ఫాంటసీని కలుపుకుంటూ కొనసాగుతుంది. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కావ్య థాపర్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ ను మెప్పించిందనేది ఇప్పుడు చూద్దాం.

బసవ (సందీప్ కిషన్) సినిమాల్లో స్టంట్ మాస్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను భూమి ( వర్ష బొల్లమ్మ)ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె దూరమైనందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. అదే పనిగా ఆమెను తలచుకుంటూ ఉంటాడు. అతను .. స్నేహితుడు జాన్ ( వైవా హర్ష) ఇద్దరూ కలిసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఓ పెళ్లి కూతురు నగలను కాజేస్తారు. అక్కడి నుంచి వస్తుండగా వారికి అగ్రహారం గీత (కావ్య థాపర్) తారసపడుతుంది.

అగ్రహారం గీత మంచి అందగత్తె ..  రోడ్ పై వెళ్లేవారికి మస్కా కొట్టేసి వాళ్ల దగ్గరున్న వాటిని కాజేస్తూ ఉంటుంది. నగలు కొట్టుకొస్తున్న బసవ - జాన్ లకు ఆమె తారసపడుతుంది. ప్రమాదం జరిగినట్టుగా ఆమె నటించడంతో, అది నమ్మేసిన వాళ్లిద్దరూ ఆమెను తమ కార్లో హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. అదే సమయంలో దొంగిలించబడిన డబ్బు కోసం పోలీస్ లు అన్ని దారుల్లోను సోదాలు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బసవ - జాన్ ఇద్దరూ 'భైరవకోన' అనే ఒక గ్రామంలోకి అడుగుపెడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చీకట్లోనే వాళ్లను గీత అనుసరిస్తుంది.

'భైరవకోన'లో మనుషులు చాలా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ల ధోరణి అంతా కూడా అనుమానాస్పదంగా ఉంటుంది. ఆ రాత్రి బసవ - జాన్ కళ్లు గప్పి నగల బ్యాగుతో అక్కడి నుంచి బయటపడటానికి గీత ప్రయత్నిస్తుంది. అయితే ఒక చిత్రమైన గ్యాంగ్ ఆమె దగ్గర నుంచి ఆ బ్యాగును కాజేస్తుంది. గీతను వెతుక్కుంటూ వచ్చిన బసవ, జరిగిన సంఘటన గురించి ఆమె ద్వారా తెలుసుకుంటాడు. ఆ నగల బ్యాగును ఎవరు తీసుకుని వెళ్లారా అని వెదకడం మొదలెడతారు. 

చీకటిపడగానే ఆ గ్రామంలో కాగడాలు వాటంతట అవి వెలుగుతూ ఉంటాయి. కృష్ణదేవరాయల వారి కాలంలో 'గరుడ పురాణం' నుంచి మిస్సయిన నాలుగు పేజీల గురించిన ప్రస్తావన వినిపిస్తూ ఉంటుంది. అక్కడే వారికి రాజప్ప (రవి శంకర్) పెద్దమ్మ (వడి ఉక్కరసు) తారసపడతారు. ఆ గ్రామంలోని వాళ్లంతా దెయ్యాలనీ, లోపలికి అడుగుపెట్టినవాళ్లు ప్రాణాలతో బయటపడటం కష్టమనే సంగతి వాళ్లకి అర్థమవుతుంది. అయినా నగల బ్యాగును తీసుకునే అక్కడి నుంచి వెనుదిరగాలని బసవ నిర్ణయించుకుంటాడు. జాన్ - గీత వారిస్తున్నా అతను వినిపించుకోకుండా ప్రాణాలకు తెగిస్తాడు.

బసవ ప్రేమించిన భూమి ఏమౌతుంది? అతనికి డబ్బుతో ఉన్న అత్యవసరం ఏమిటి? రాజప్ప ఎవరు? అక్కడ పెద్దమ్మ చేస్తున్న పనేమిటి? బసవ దగ్గర బంగారు నగల బ్యాగును కొట్టేసిన వారెవరు? ఎందుకని 'భైరవకోన' గ్రామంలోని వాళ్లంతా దెయ్యాలుగా మారిపోతారు? వాళ్ల బారి నుంచి బయటపడటానికి బసవ - జాన్ - గీత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? 'గరుడపురాణం'లో నుంచి మిస్సయిన ఆ నాలుగు పేజీలలో ఏముంది? అనేది కథ.

 దర్శకుడిగా వీఐ ఆనంద్ ఎంచుకునే కథలు విభిన్నంగా ఉంటాయి. ఫాంటసీ టచ్ తో కొనసాగుతూ ఉంటాయి. ఈ కథ కూడా అలాంటి లక్షణాలతోనే ముందుకు వెళుతుంది. ఒక వైపున లవ్ .. మరో వైపున హారర్ .. ఇంకో వైపున ఫాంటసీ ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ ఈ కథను తయారు చేసుకున్నారు. 'భైరవకోన'లో అందరూ దెయ్యాలేనని నిర్ధారణ కావడమే ఇంటర్వెల్ బ్యాంగ్. అయినా అక్కడే ఉంటూ అనుకున్నది సాధించాలని హీరో టీమ్ నిర్ణయించుకోవడం సెకండ్ పార్టుపై ఆసక్తిని పెంచుతుంది. 
 
కథ మొత్తంగా చూసుకుంటే .. హీరో - హీరోయిన్ పాత్రలను ఆదిలోనే విడగొట్టడం వలన, రొమాంటిక్ సీన్స్ కి .. సాంగ్స్ కి అవకాశం లేకుండా పోయింది. ఇక కావ్య థాపర్ వైపు నుంచి ఆమె కోణంలో ఆ లోటును ఏమైనా భర్తీ చేస్తారా అంటూ ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశనే మిగులుతుంది. రొమాంటిక్ యాంగిల్ లో ఉపయోగించుకునే అవకాశం లేనప్పుడు కావ్య థాపర్ ను ఎందుకు పెట్టినట్టు అనే ఆలోచన సాధారణ ప్రేక్షకుడికి తప్పకుండా కలుగుతుంది.

సినిమా మొత్తంలో ఛేజింగ్స్ ఎక్కువగా పలకరిస్తాయి. అవి కూడా ఒక యాక్షన్ సినిమాకి మించి కనిపిస్తాయి. హీరోయిన్ హీరోకి ఎందుకు దూరమైంది? హీరో దొంగతనం ఎందుకు చేశాడు? అనే సందేహాలకు చివరివరకూ ఎదురుచూడవలసి రావడం ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. దెయ్యాల చేష్టలు .. ఛేజింగ్స్ కాస్త మోతాదు మించినట్టుగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల హాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా కనిపిస్తుంది. 

 ఇక ఒక విలన్ గా మైమ్ గోపి కనిపిస్తాడు. కానీ ఆ విలనిజం అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. యాక్షన్ సీన్స్ పక్కన పెడితే, ఒక చందమామ కథను చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్టిస్టులంతా ఎవరి పాత్రకి వారు న్యాయం చేశారు. సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర బాణీలలో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సన్నివేశాల స్థాయిని దాటి వెళ్లింది. రాజ్ తోట కెమెరా పనితనం బాగుంది. నైట్ ఎఫెక్ట్ లోని సీన్స్ ను చిత్రీకరించిన విధానం బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. 

Movie Name: OoruPeru Bhairavakona

Release Date: 2024-02-16
Cast: Sundeep Kishan, Kavya Thapar, Varsha Bollamma,Vennela Kishore,Vennela Kishore as Doctor Narappa Harsha Chemudu
Director: Vi Anand[1]
Producer: Razesh Danda
Music: Shekar Chandra
Banner: AK Entertainments

OoruPeru Bhairavakona Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews