'ఈగల్' - మూవీ రివ్యూ

  • రవితేజ హీరోగా రూపొందిన 'ఈగల్' 
  • ఆయన మార్క్ కి దూరంగా నడిచే కథ 
  • ఏ అంశంలోను కనిపించని కొత్తదనం 
  • లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ కి దూరంగా నడిచే కంటెంట్
  • పాత్రల స్థాయికి మించిన డైలాగ్స్

రవితేజ నుంచి ఏడాదికి మూడు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఆ మధ్య  కొన్ని ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా ఆ రికార్డు కాస్త సడలినా, గత రెండేళ్లుగా మళ్లీ ఆయన దానిని లైన్లో పెట్టేశాడు. ఈ ఏడాదిలో ఆయన చేసిన మొదటి సినిమాగా 'ఈగల్' కనిపిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.  యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ ఢిల్లీకి .. తలకోనకి మధ్య జరుగుతుంది. ఢిల్లీలోని ఒక దినపత్రికలో నళిని ( అనుపమా  పరమేశ్వరన్) జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటుంది. తలకోనలో మాత్రమే పండించే ఒక ప్రత్యేకమైన 'ప్రత్తి'ని గురించి ఆమె ఆ పత్రికలో ఒక న్యూస్ ఐటమ్ రాస్తుంది. తలకోన ప్రత్తిని ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసిన ఒక వ్యక్తి, ఏడాది నుంచి కనిపించకుండా పోవడం గురించి ఆ వార్తలో ఆమె ప్రస్తావిస్తుంది. పేపర్లో చిన్న కాలంలో ఆ వార్తను వేస్తారు. 

ఆ వార్త చదవగానే నేరుగా ప్రధానమంత్రి ఆదేశాలతో ప్రత్యేకమైన ఫోర్స్ రంగంలోకి దిగిపోతుంది. ఆ పేపర్ ఆఫీసును తమ అధీనంలోకి తీసుకోవడమే కాకుండా, విచారణ పేరుతో నళినిని సీబీఐవారు తీసుకుని వెళతారు. ఆమె రాసిన ఆ వార్త వెనుక ఉన్న వాస్తవ సంఘటనలను గురించి 16 గంటలపాటు ప్రశ్నిస్తారు. ఒక చిన్న వార్త ఇంతటి కదలికను తీసుకుని రావడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాను సాధారణమైన విషయం అనుకున్న ఆ న్యూస్ వెనుక ఏదో బలమైన శక్తి ఉందని ఆమెకి అర్థమవుతుంది. 

ఆ న్యూస్ రాసిన కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయిన నళిని, తలకోనకు వెళ్లి ఆ వ్యక్తిని గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నదే తడవుగా అక్కడికి వెళుతుంది. అక్కడి తూరుపుకొండపై ఆ వ్యక్తి ఉండేవాడని తెలుసుకుంటుంది. ఆ కొండంతా తగలబడిపోయినట్టుగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. అక్కడ ఆ వ్యక్తి విగ్రహం ఉండటం చూస్తుంది. ఆ వ్యక్తి గురించి మాట్లాడటానికి ఎస్.ఐ. .. ఎమ్మెల్యే సోమేశ్వర్ రెడ్డి (అజయ్ ఘోష్) ఇద్దరూ భయపడతారు. 

ఆ వ్యక్తి పేరు సహదేవ్ (రవితేజ) అనీ, రైతులచే ప్రత్తిని పండించి ప్రపంచ మార్కెట్ దానిని చేరవేసేవాడని నళిని తెలుసుకుంటుంది. రెండు గిరిజన తెగలవారు అతని దగ్గర పనిచేసేవారనే సమాచారాన్ని సేకరిస్తుంది. అదే సమయంలో అక్కడ ఆమె 'ఈగల్' పేరు కూడా వింటుంది.  సహదేవ్ ఏమైపోయాడు? ఆయన జీవితం ఎలాంటిది? ఈగల్ .. సహదేవ్ ఇద్దరుగా కనిపిస్తున్నది ఒకరేనా? అతని పేరు వినగానే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడింది? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

కార్తిక్ ఘట్టమనేని తయారు చేసుకున్న కథ ఇది. దర్శకుడిగా ఇది ఆయనకి రెండో సినిమా. రవితేజతో చేసిన సినిమా. సాధారణంగా ఒక హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఆ హీరోకి ఉన్న అభిమానులకి కంటెంట్ ఇలా ఉండొచ్చుననే ఒక అంచనా ఉంటుంది. తమ హీరో బాడీ లాంగ్వేజ్ .. ఆయన క్రేజ్ కి తగినట్టుగా ఆ కంటెంట్ ఉంటుందని వాళ్లు భావిస్తారు. అలా చూసుకుంటే రవితేజ మార్క్ కి దూరంగా కనిపించే కంటెంట్ ఇది. ఆయనలోని జోరు .. హుషారు చూపించడానికి అవకాశం లేని కథ ఇది. 

 జర్నలిస్టు నళినిగా ఈ సినిమాలో అనుపమ కనిపిస్తుంది. రవితేజ జోడీగా ఆమెను ఎవరూ అనుకునే అవకాశం లేదు. కావ్య థాపర్ హీరోయిన్ అయ్యుంటుందని ముందుగానే ఊహిస్తారు. అయితే ఆమెను విశ్రాంతి తరువాత నిదానంగా .. నింపాదిగా రంగంలోకి దింపుతారు. హమ్మయ్య ఇప్పటికైనా కథకి కాస్త గ్లామర్ కోటింగ్ వచ్చిందనే సంతోషం కలుగుతుంది .. కానీ అది ఎక్కువసేపు నిలబడదు. హీరో - హీరోయిన్ ప్రేమాయణం కృతకంగా అనిపిస్తుంది. ఆమె ఆశయాన్ని నెరవేర్చడమే తన ధ్యేయమని హీరో భావించేంత బలమైన సన్నివేశాలు పడలేదు. 

నాయకుడుగా రవితేజ కనిపిస్తూనే ఉంటాడు. మరి ప్రతి నాయకుడు ఎవరు? అని ఆడియన్స్ విలన్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. తూరుపుకొండపై బాక్సయిట్ ఉంది .. అది నాకు కావాలంటూ ఒక పాత్ర ఊడిపడుతుంది. బహుశా ఈయనే విలనేమో అనుకునేలోగా ఆ పాత్ర జారిపోతుంది. ఆ తరువాత బాక్సయిట్ ఊసు కూడా ఎక్కడా కనిపించదు. అజయ్ ఘోష్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగినదే అయినా కామెడీకి వాడుకున్నారు. వినయ్ రాయ్ పాత్రకి గల ప్రయోజనమేమిటో మనకి అర్థం కాదు. 

హీరో కోసం ఒకేసారి సెంట్రల్ ఫోర్స్ .. తీవ్రవాదులు .. నక్సలైట్లు రంగంలోకి దిగడం కాస్త అతిగా అనిపిస్తుంది. ఆ సమయంలో చోటుచేసుకునే యాక్షన్ దృశ్యాలు మోతాదు మించినట్టుగా అనిపిస్తుంది. ఇక రవితేజ లుక్ ఈ కథకి ప్లస్ అయిందా .. మైనస్ అయిందా అంటే, మైనస్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా హీరో ఇంట్రడక్షన్ కి ముందు ఆ పాత్రకి బిల్డప్ ఇస్తూ మిగతా పాత్రలు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. కానీ సినిమా అయిపోతున్న సమయంలో కూడా హీరో గురించి గొప్పగా డైలాగులు చెప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

--- రవితేజ ఎనర్జిటిక్ గా కాకుండా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. ఇక హీరోయిన్ గా తెరపై కావ్యథాఫర్ కొంతసేపే కనిపించినప్పటికీ, కాస్త గ్లామర్ టచ్ ఇవ్వగలిగింది. అజయ్ ఘోష్ పాత్ర ద్వారా కాస్త కామెడీ టచ్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డిని ఇంకాస్త ఉపయోగించుకుని ఉంటే బాగుండేది. జర్నలిస్టు పాత్రలో అనుపమ ఓకే. నవదీప్ పాత్ర నామ మాత్రం.  దేవ్ జాంద్ నేపథ్య సంగీతం .. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఫరవాలేదు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, యాక్షన్ సీన్స్ ను ట్రిమ్ చేసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.

యాక్షన్ పాళ్లు ఎక్కువైపోవడం, ఉన్న కాస్త ఎమోషన్ కనెక్ట్ కాకపోవడం, లవ్ .. రొమాన్స్ .. సాంగ్స్ గురించి పట్టించుకోకపోవడం ఈ సినిమాకి మైనస్ గా అనిపిస్తుంది. ఒక్క రవితేజ పాత్ర మినహా మిగతా పాత్రలను డిజైన్ చేసే విషయంపై శ్రద్ధ పెట్టకపోవడం మరో వెలితిగా చెప్పుకోవచ్చు. తుపాకుల మోత .. బుల్లెట్ల వర్షం .. అనవసరమైన బిల్డప్ డైలాగులు .. జోనర్ కి సంబంధం లేని చాప్టర్ పేర్లు కాస్త అసహనాన్ని .. అసంతృప్తిని కలిగిస్తాయి.

Movie Name: Eagle

Release Date: 2024-02-09
Cast: Ravi Teja, Kavya Thapar, Anupama Parameswaran, Navdeep, Srinivas Avasarala
Director: Karthik Ghattamaneni
Producer: Vishwa Prasad - Vivek Kuchibhotla
Music: Davzand
Banner: People Media Factory

Eagle Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews