'నా సామిరంగ' - మూవీ రివ్యూ

  • నాగార్జున నుంచి వచ్చిన పండగ సినిమా
  • భోగి .. సంక్రాంతి .. కనుమ రోజుల్లో సాగే కథ
  • యాక్షన్ .. ఎమోషన్ .. రొమాంటిక్ కామెడీనే ప్రధానం 
  • ఆషిక రంగనాథ్ అందమే ప్రత్యేకమైన ఆకర్షణ 
  • నాగ్ అభిమానులను నిరాశపరచని సినిమా  

గ్రామీణ నేపథ్యంలో  నాగార్జున ఇంతకుముందు చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనా' .. ' బంగార్రాజు' సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండగ సందర్భంలోనే వచ్చాయి. నాగార్జునకి సక్సెస్ ను ఇచ్చాయి. అందువలన నాగార్జునకి సంక్రాంతి పండగ సెంటిమెంట్ గా నిలిచింది. ఈ కారణంగానే ఆయన తాజా చిత్రమైన ' నా సామిరంగ' ఈ రోజున థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 1963లో అంబాజీపేటలో మొదలై 1988 వరకూ కొనసాగుతుంది. అనాథ అయిన కిష్టయ్య( నాగార్జున)ను .. అంజి ( అల్లరి నరేశ్) తల్లి చేరదీస్తుంది. ఆమె చనిపోవడంతో అంజి కూడా అనాథ అవుతాడు. ఆ ఊళ్లోని వాళ్లంతా గౌరవించే పెద్దయ్య (నాజర్) .. కిష్టయ్యను .. అంజిని చేరదీస్తాడు. ఇక అప్పటి నుంచి 'పెద్దయ్య' మాటనే వేదంగా కిష్టయ్య భావిస్తుంటాడు ... ఆచరణలో పెడుతుంటాడు. పెద్దయ్య తన కొడుకైన దాసు (షబ్బీర్)తో సమానంగా వాళ్లను చూసుకుంటాడు. 


ఆ ఊళ్లో వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు ( రావు రమేశ్) కూతురే వరలక్ష్మి ( ఆషిక రంగనాథ్). ఆ ఊరికి వచ్చిన కొత్తలోనే ఆమెను చూడగానే కిష్టయ్య ఆకర్షణకి లోనవుతాడు. కానీ తల్లిలేని వరలక్ష్మి అమ్మమ్మ దగ్గర చదువుకోవడానికి వేరే ఊరు వెళుతుంది. వయసులోకి అడుగుపెట్టిన తరువాతనే ఆమె మళ్లీ తిరిగొస్తుంది. అంజి పెళ్లి సమయంలోనే ఆమెను కిష్టయ్య మళ్లీ చూస్తాడు.  ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాడు. 

 ఈ నేపథ్యంలోనే ఆ ఊరికి చెందిన భాస్కర్ ( రాజ్ తరుణ్) పక్క ఊరు ప్రెసిడెంట్ వీరభద్రం (మధు సూదన్) కూతురు కుమారి (రుక్సార్ థిల్లాన్)ను ప్రేమిస్తాడు. ఆ ఊరుకి ... ఈ ఊరుకి పడకపోవడం వలన, ఈ ప్రేమకథ మరింత రచ్చ అవుతుంది. భాస్కర్ ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో అతణ్ణి కిష్టయ్య చేరదీస్తాడు. అది వీరభద్రం మనసులో పెట్టుకుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల వలన, కిష్టయ్య ప్రేమను వరలక్ష్మి అంగీకరిస్తుంది. 

వరలక్ష్మి తనని ప్రేమిస్తుందనీ .. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని పెద్దయ్యతో కిష్టయ్య చెబుతాడు. పెద్దయ్య తన కొడుకు దాసుతో ఆమె పెళ్లి జరిపించాలని అనుకుంటున్నట్టు ఆ సమయంలోనే కిష్టయ్యకి తెలుస్తుంది. అయినా పెద్దయ్య లైట్ తీసుకుంటాడు. కానీ వరలక్ష్మి తనకి మాత్రమే దక్కాలనే కసితో దుబాయ్ నుంచి పెద్దయ్య కొడుకు దాసు ఆ ఊరుకి చేరుకుంటాడు. అతని రాకతో  ఆ గ్రామంలోని పరిస్థితులు ఎలా మారిపోతాయి? అనేదే కథ. 

ఓ మలయాళ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇంతవరకూ కొరియోగ్రఫర్ గా పనిచేస్తూ వచ్చిన విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయినా ఎక్కడా తడబడినట్టుగా కనిపించదు. విలేజ్ నేపథ్యంలో భోగి .. సంక్రాంతి .. కనుమ పండుగ రోజులను ప్రధానంగా చేసుకునే ఈ కథను నడిపించాడు. అందువల్లనే ఈ సినిమాను సంక్రాంతికి తప్పకుండా విడుదల చేయాలనే పట్టుదలతో పనిచేశారు.

నాగార్జున .. అల్లరి నరేశ్ .. ఆషిక రంగనాథ్ చిన్నప్పటి ఎపిసోడ్ నుంచి ఈ కథ మొదలవుతుంది. హీరోయిన్ గా ఆషిక ఎంట్రీ ఇవ్వడానికి ఓ అరగంట పడుతుంది. ఈ సమయంలో కథ కాస్త నిదానంగానే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆషిక రంగనాథ్ ఎంటరవుతోందో అప్పటి నుంచి కథకి కాస్త 'కళ' వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆషిక - నాగ్ కాంబినేషన్ లోని సీన్స్ కాస్త రొమాంటిక్ కామెడీ టచ్ తో సాగుతూ సందడి చేస్తుంటాయి. ఎప్పుడైతే విలన్ గా దాసు ఎంట్రీ ఇస్తాడో, అప్పటి నుంచి కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. 

ఫస్టాఫ్ లో ఒక అరగంట తరువాత పుంజుకున్న కథ, ఇంటర్వెల్ సమయానికి ఇంట్రెస్టింగ్ బ్యాంగ్ తో అందరిలో ఉత్కంఠను పెంచుతుంది. ఈ పార్టులో జాతర ఫైట్ ...  'ఎత్తుకెళ్లి పోవాలని' .. 'ఇంకా ఇంకా' పాటలు .. హీరో - హీరోయిన్ మధ్య రొమాంటిక్ కామెడీ సీన్స్ హైలైట్ గా అనిపిస్తాయి. సెకండాఫ్ కి వచ్చేసరికి, 'దుమ్ముదుకాణం' అనే పాటతో పాటు, సినిమా థియేటర్లో అంజితో ఫైట్ .. క్లైమాక్స్ లో నాగ్ ఫైట్ ప్రేక్షకుల నుంచి మరిన్ని మార్కులు కొట్టేస్తాయి.

ఇంతకుముందు గ్రామీణ నేపథ్యంలో మనం చూస్తూ వచ్చిన అంశాలే ఈ కథలోను కనిపిస్తాయి. అలాగని చెప్పి ఎక్కడా బోర్ కొట్టదు. 'ఓహో' అనిపించకపోయినా, సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాకి వెళ్లినవారు అసంతృప్తితో మాత్రం బయటికి రారు. అలాంటి కథాకథనాలతోనే ఈ సినిమా నడుస్తుంది. నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆ తరువాత గ్లామర్ పరంగా ఆషిక రంగనాథ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. ఓణీల్లోను .. చీరకట్టులోను ఆమె యూత్ ను కట్టిపడేస్తుంది. 

ఇక ఈ సినిమాతో విలన్ గా పరిచయమైన 'షబ్బీర్' నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సైకో తరహా పాత్రలో ఆయన నటన సహజత్వానికి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఆయన ఎంట్రీ తరువాతనే కథ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. మిగతా వాళ్లంతా పాత్ర పరిధిలో న్యాయం చేశారు. కీరవాణి బాణీలలో  'ఎత్తుకెళ్లి పోవాలని' .. 'ఇంకా ఇంకా' పాటలు ఆకట్టుకుంటాయి. 'ఎత్తుకెళ్లి పోవాలని' గాయకుడి వాయిస్ మాత్రం నాగార్జునకి సెట్ కాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. దాశరథి ఫొటోగ్రఫీ .. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కథకి బలమైన సపోర్టుగా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సంక్రాంతికి ఈ సినిమాను చూడొచ్చు.

Movie Name: Naa Saamiranga

Release Date: 2024-01-14
Cast: Nagarjuna, Ashika Ranganath,Allari Naresh, Mirnaa Menon, Raj Tarun, Rukshar Dhillon,Shabeer Kallarakkal
Director: Vijay Binni
Producer: Srinivasa Chitturi
Music: Keeravani
Banner: Srinivasa Silver Screen

Naa Saamiranga Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews