'కర్రీ అండ్ సైనేడ్' (నెట్ ఫ్లిక్స్) డాక్యుమెంటరీ సిరీస్!

  • యథార్థ సంఘటన ఆధారంగా 'కర్రీ అండ్ సైనేడ్'
  • కేరళ ప్రాంతంలో జరిగిన వరుస హత్యల మిస్టరీ
  • 1997 - 2016కి మధ్య జరిగిన సంఘటనలు  
  • హంతకురాలిని పట్టించిన ఆడపడుచు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ మధ్య కాలంలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరహా కంటెంట్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా ఈ జోనర్ కి సంబంధించిన డాక్యుమెంటరీల సంఖ్య కూడా పెరుగుతోంది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీల పట్ల కూడా ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అలా కేరళలో జరిగిన ఒక యథార్థ సంఘటనకు సంబంధించిన డాక్యుమెంటరీనే 'కర్రీ అండ్ సైనేడ్'. ఈ సిరీస్ కి 'క్రిష్టో టోమి' దర్శకుడు.  

'కర్రీ అండ్ సైనేడ్' .. 'ది జూలీ జోసెఫ్ కేస్' అనేది ట్యాగ్ లైన్. ఎవరీ జూలీ జోసెఫ్ .. అంటే 1997 ప్రాంతంలో .. కేరళలోని 'కూడతాయి' అనే ప్రాంతానికి వెళ్లవలసిందే. ఆ ఊళ్లో టామ్ థామస్ - అన్నమా థామస్ అనే దంపతులు ఉంటారు. టామ్ థామస్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటులో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆయన భార్య అన్నమా స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. వారి సంతానమే రాయ్ థామస్ ... రేంజి థామస్ .. రోజో థామస్. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందిలేని కుటుంబమేవారిది.

ఇక జూలి జోసెఫ్ అనే యువతి ... 'కట్టప్పన్న' అనే కొండ ప్రాంతంలో పెరుగుతుంది.  వాళ్లది వ్యవసాయ కుటుంబం. మొదటి నుంచి కూడా కాస్త విలాసంగా తనకి నచ్చినట్టుగా బ్రతకాలనే ఆలోచనతోనే జూలికి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఆమె రాయ్ థామస్ కి చేరువవుతుంది. తాను డిగ్రీ పూర్తి చేశానని జూలి చెప్పడం వల్లనే, ఆ కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకుంటారు. 1997లో వారి వివాహం జరుగుతుంది. కోడలిగా జూలీ ఆ ఇంట్లో అడుగుపెడుతుంది. 

 అన్నమా థామస్ టీచర్ కావడం వలన ఊళ్లో వాళ్లంతా ఆమెను గౌరవిస్తూ ఉంటారు. ఇక ఇంటి పెత్తనం అంతా కూడా ఆమెదే. జూలీ జోసెఫ్ అది సహించలేకపోతుంది. 2002లో ఒక రోజున అన్నమా థామస్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. హాస్పిటల్ కి తీసుకుని వెళ్లేలోగా ఆమె చనిపోతుంది. వయసు పైబడటం అందుకు కారణమని అందరూ భావిస్తారు.  అత్తగారు చనిపోగానే ఆ కుటుంబ సభ్యులపై జూలీ పెత్తనం చేయడం మొదలుపెడుతుంది. 

ఆ తరువాత టామ్ థామస్ కూతురు రేంజి థామస్ వివాహమై ఆమె కొలంబో వెళ్లిపోతుంది. సెలవుల్లో టామ్ థామస్ తన కూతురు దగ్గరికి వెళ్లి వస్తుంటాడు. జూలీ భర్త ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి మ్యాథ్యు అనే యువకుడు వచ్చి వెళుతుంటాడు. ఈ విషయంపై ఆమెను మామగారైన టామ్ థామస్ నిలదీస్తాడు. 2008లో అతను చనిపోతాడు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన చనిపోయాడని జూలీ అందరినీ నమ్మిస్తుంది.  ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత .. బిజినెస్ దెబ్బతినడం వలన రాయ్ థామస్ కీ .. జూలీకి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 

ఆ తరువాత కొన్ని రోజులకే రాయ్ థామస్ చనిపోతాడు. అయితే అతని మేనమామ మంచాడియిల్, పోస్టుమార్టం జరపవలసిందేనని పట్టుబడతాడు. సైనేడ్ కారణంగా అతను చనిపోయాడనే రిపోర్టు వస్తుంది. అప్పులు ఎక్కువ కావడం వలన అతను అలా చేశాడని జూలి అందరినీ నమ్మిస్తుంది. ఆ తరువాత ఆమె తన భర్తకి దగ్గర చుట్టమైన 'షాజు' అనే వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఈ లోగానే మంచాడియిల్ తో పాటు, షాజు భార్య  సిలి .. కూతురు ఆల్ఫెన్ కూడా చనిపోతారు.

 హఠాత్తుగా 'సిలి' చనిపోవడం రేంజి థామస్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సిలిని చివరి చూపు చూడటానికి వెళుతుంది. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జూలీనే చూసుకుంటూ ఉంటుంది. ఆమె ప్రవర్తనపైనే రేంజి థామస్ తన దృష్టి పెడుతుంది. ఆ సమయంలోనే జూలిపై రేంజి థామస్ కి మొదటిసారిగా అనుమానం వస్తుంది. ఆమెకి అనుమానం కలిగించే ఆ అంశం ఏమిటి? ఆ తరువాత ఆమె ఏం చేస్తుంది? అనే అంశాల చుట్టూ తిరుగుతూ ఈ డాక్యుమెంటరీ నడుస్తుంది.

జూలి భర్త రాయ్ థామస్ కి రేంజి థామస్ చెల్లెలు అవుతుంది. రోజో థామస్ తమ్ముడు అవుతాడు. ఈ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరుగా జూలి గురించి మాట్లాడుతూ ఉండగా, అందుకు సంబంధించిన ఒరిజినల్ క్లిప్పింగ్స్ ను చూపించారు. ఇక ఈ కేస్ ను డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ .. లాయర్ మాట్లాడుతూ ఉండగా, మరికొన్ని ఒరిజినల్ విజువల్స్ వాడారు. జూలీ ఎవరెవరిని ఎలా హత్యచేసింది? అందుకోసం ఉపయోగించిన సైనేడ్ ఆమెకి ఎక్కడిది? అనేవి ఈ యథార్థ సంఘటనలోని ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.  

పెత్తనం కోసం అత్తగారినీ .. ప్రశ్నించాడని మామగారిని .. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను .. ఆ విషయంలో ఆమెను అనుమానించిన మంచాడియిల్ ను .. షాజును పెళ్లి చేసుకోవడం కోసం సిలీనీ .. ఆమె కూతురును జూలీ పకడ్బందీగా ప్లాన్ చేసి చంపుతుంది. అలాంటి ఆమెను చట్టానికి అప్పగించడానికి రేంజి థామస్ చేసిన ప్రయత్నం ... చివర్లో ఆమె తీసుకున్న నిర్ణయం .. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం కళ్లను తడి చేస్తాయి. 

Movie Name: Curry & Cyanide

Release Date: 2023-12-22
Cast: -
Director: Christo Tomy
Producer: India Today Originals
Music: -
Banner: India Today Originals

Curry & Cyanide Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews