'ఫలిమీ' (హాట్ స్టార్) మూవీ రివ్యూ

  • మలయాళ మూవీగా రూపొందిన 'ఫలిమీ'
  • థియేటర్ల నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ 
  • ఈ నెల 18 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
  • సహజత్వానికి దగ్గరగా నడిచిన కథాకథనాలు
  • ప్రధానమైన బలంగా ఎమోషన్స్ - కామెడీ   
  • ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై మలయాళ కథల రీమేకుల జోరు పెరుగుతూ ఉంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కూడా మలయాళ సినిమాల సందడి కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మలయాళ కథల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి ప్రేక్షకుల కోసం తెలుగు వెర్షన్ తో కలుపుకుని, ఈ నెల 18వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న మరో మలయాళ మూవీనే 'ఫలిమీ'. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
 
కేరళలోని 'తిరువనంతపురం'లో అనూప్ (బాసిల్ జోసెఫ్) డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటాడు. తండ్రి  చంద్రన్ (జగదీశ్) తల్లి రేమా ( మంజు పిళ్లై) తమ్ముడు అభి ( సందీప్ ప్రదీప్) తాతయ్య జనార్ధన్ (మీన్ రాజ్) ఇదీ అనూప్ కుటుంబం. మధ్యతరగతికి చెందిన ఆ కుటుంబాన్ని అనూప్ అతి కష్టం మీద లాగుతుంటాడు. బ్యాంకు లోన్లు కట్టలేక సతమతమవుతూ ఉంటాడు. పాత ప్రింటింగ్ ప్రెస్ ను అమ్మేస్తే ఊరటగా ఉంటుందని అనూప్ భావిస్తాడుగానీ, అందుకు తండ్రి ఒప్పుకోడు. 

అనూప్ తాతయ్య జనార్దన్ కి చాలా కాలంగా 'కాశీ' వెళ్లాలని ఉంటుంది. ఎవరితో చెప్పకుండా అతను రైల్వే స్టేషన్ వరకూ వెళుతూ ఉంటాడుగానీ, ఎవరో ఒకరు చూసి అతణ్ణి తిరిగి ఇంటికి తీసుకుని వస్తుంటారు. ఇంటి పక్కనే 'వీల్ ఛైర్' కి పరిమితమైన స్నేహితుడితోనే ఆయన తరచూ కిటికీలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. కాశీ వెళ్లాలనే తన తాపత్రయాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోతున్నందుకు జనార్దన్ బాధపడుతూ ఉంటాడు. 

ఈ నేపథ్యంలోనే అనూప్ కి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. అనఘ (రైనా రాధాకృష్ణన్)తో అతని ఎంగేజ్ మెంట్ కి డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ వేడుక జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చి, అనఘను తాను కొంతకాలంగా లవ్ చేస్తున్నట్టుగా చెబుతూ, అక్కడ గొడవ చేస్తాడు. 'నన్ను మోసం చేస్తావా?' అంటూ ఆమెను చెంపదెబ్బ కొట్టి మరీ వెళతాడు. ఆ సంఘటనతో అనూప్ బిత్తరపోతాడు. జరిగిన దాంట్లో అనఘ ప్రమేయం కూడా ఉండే ఉంటుందని అతను భావిస్తాడు. 

 ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఊళ్లో వాళ్లంతా అతని వైపు అదోలా చూస్తుంటారు. అది అతనికి చాలా అవమానకరంగా ... ఇబ్బందిగా అనిపిస్తుంది. అతని ఉద్దేశం అనఘకి అర్థమవుతుంది. ఆమె నేరుగా వచ్చి అతని ఎంగేజ్ మెంట్ రింగ్ ను వెనక్కి ఇచ్చేసి వెళుతుంది. ఆమె అలా ప్రవర్తించడం కూడా అతని మనసుకి కష్టం కలిగిస్తుంది. ఆ బాధను మరిచిపోవడం కోసం అతను తాతయ్యను వెంటబెట్టుకుని కాశీ బయల్దేరతాడు. వాళ్లతో పాటు మిగతా వాళ్లు కూడా తయారవుతారు. 

అందరూ కలిసి కాశీ వెళ్లే ట్రైన్ ఎక్కుతారు. మార్గమధ్యంలో ఓ రాత్రివేళ ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుతుంది. ఆ సమయంలో జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన కారణంగా, జనార్దన్ తప్ప మిగతా కుటుంబ సభ్యులంతా ట్రైన్ దిగిపోతారు. జనార్దన్ తో పాటు .. మిగతావారి లగేజ్ తో పాటు ట్రైన్ వెళ్లిపోతుంది. అప్పుడు అనూప్ వాళ్లు ఏం చేస్తారు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన సన్నివేశాలు ఈ కథలో చోటుచేసుకుంటాయి. 

 నితీశ్ సహదేవ్ - సంజో జోసెఫ్ కలిసి తయారు చేసుకున్న కథ ఇది. ఈ కథకు నితీశ్ సహదేవ్ దృశ్యరూపాన్ని ఇచ్చాడు. ఈ కథ ఐదుగురు కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతుంది. కథ ఎంత సింపుల్ గా మొదలవుతుందో .. అంతే సింపుల్ గా చివరి వరకూ నడుస్తుంది. కథలోని సహజత్వం .. ప్రధానమైన పాత్రలను వాస్తవానికి దగ్గరగా మలచిన తీరు ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తుంది. ఆ కుటుంబంలో ప్రేక్షకుడిని కూడా ఒక సభ్యుడిగా మార్చేస్తుంది.

మధ్య తరగతి కుటుంబాలకి చెందినవారిలో కొన్ని బలహీనతలు .. అభద్రతా భావాలు ఉంటాయి. అలాగే కొన్ని సున్నితమైన ఎమోషన్స్ ఉంటాయి. అలాంటి వాటిని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటం ఎంత అవసరమో .. కుటుంబంలోని పెద్దవాళ్లకి ఒంటరితనం లేకుండా చూడటం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది. ఇంత చిన్న బడ్జెట్ లో ..  ఇంత మంచి సినిమా తీయవచ్చునా అనిపిస్తుంది. 

ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలుగా కనిపించే ఐదుగురు మధ్య తరగతి కుటుంబ సభ్యులుగా ఇబ్బందులు పడుతుంటారు. సమస్యలతో సతమతమైపోతూనే ఉంటారు. ఒకరి పద్ధతి మరొకరికి నచ్చక చిటపటలాడుతూ ఉంటారు. అందులోనే సున్నితమైన హాస్యం ఉండేలా దర్శకుడు డిజైన్ చేశాడు. అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేస్తూనే, చివరివరకూ హాయిగా నవ్వించాడు. క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగానే అనిపిస్తుంది. 

ఎక్కడా అనవసరమైన సన్నివేశాలుగానీ .. అభ్యంతరకరమైన సంభాషణలుగాని లేవు. మధ్య తరగతి కుటుంబం చేసే ఈ కాశీ ప్రయాణం చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. బబ్లూ అజూ ఫొటోగ్రఫీ .. విష్ణు విజయ్ నేపథ్య సంగీతం కథకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. నిజంగానే వీళ్లంతా ఒక కుటుంబ సభ్యులేమో అనిపించేలా పాత్రధారులు నటించారు. సరదాగా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ సినిమాను చూడొచ్చు. 

Movie Name: Falimy

Release Date: 2023-12-18
Cast: Basil Joseph, Jagadish, Manju Pillai, Sandeep Pradeep, Meenaraj Palluruthy, Raina Radhakrishnan
Director: Nithish Sahadev
Producer: Lakshmi Warrier
Music: Vishnu Vijay
Banner: Cheers Entertainments

Falimy Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews