'ఆదికేశవ' - మూవీ రివ్యూ

  • 'ఆదికేశవ'గా వైష్ణవ్ తేజ్ 
  • ప్రతినాయకుడిగా జోజు జార్జ్ పరిచయం 
  • రొటీన్ కి భిన్నంగా కనిపించని కథ
  • హుషారెత్తించే పాటలు 
  • మోతాదు మించిన ఫైట్లు .. రక్తపాతం

వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంతవరకూ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చాడు. అవసరాన్ని బట్టి ఆ సినిమాల్లో యాక్షన్ కూడా చేశాడు. అయితే ఈ సారి ఆయన యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కథను ఎంచుకున్నాడు. మాస్ యాక్షన్ హీరోగా తన జోరు చూపించడానికి ట్రై చేశాడు. అలా ఆయన నుంచి వచ్చిన సినిమానే 'ఆదికేశవ'. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా, ఆ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం.

బాలూ (వైష్ణవ్ తేజ్) తన కళ్లముందు ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా సహించని స్వభావం కలిగినవాడు. ఒకరికి మంచి చేసే ప్రయత్నంలో మరొకరితో ఎప్పుడూ ఏదో ఒక గొడవపడుతూనే ఉంటాడు. ఆయన తల్లిదండ్రులు సుందరమూర్తి దంపతులు (జేపీ .. రాధిక), ఏదైనా జాబ్ చూసుకోమని పోరుతూ ఉంటారు. తన స్నేహితుడు సుదర్శన్ (సుదర్శన్)తో కలిసి కాలక్షేపం చేసే బాలూ,  తల్లిమాట కాదనలేక ఒక సంస్థల్లోకి ఇంటర్వ్యూకి వెళతాడు. ఆ సంస్థలో మార్కెటింగ్ హెడ్ గా జాబ్ సంపాదిస్తాడు. 

ఆ సంస్థ యజమాని చిత్ర (శ్రీలీల) ఆమె ఓ శ్రీమంతుడి (ఆనంద్) కూతురు. తండ్రి సంపాదనపై ఆధారపడకుండా తాను ఆ సంస్థను రన్ చేస్తూ ఉంటుంది .. ఆ సంస్థకి ఆమెనే సీఈఓ. బాలూని ఇంటర్వ్యూ చేసిన ఆమె, అతనితో లవ్ లో పడిపోతుంది. ఇదిలా ఉండగా 'బ్రహ్మ సముద్రం'లో అక్రమంగా క్వారీ పనులు నిర్వహించే చెంగారెడ్డి (జోజు జార్జ్) ఒక అరాచక శక్తిగా ఎదుగుతాడు. తన దారికి అడ్డొచ్చినవారి ప్రాణాలు తీయడం అతనికి చాలా తేలిక. 

బాలూని చిత్ర ప్రేమిస్తుందని తెలిసిన ఆమె తండ్రి, రాహుల్ అనే వ్యక్తితో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. ఆమె బర్త్ డే ఫంక్షన్ లో ఆ విషయాన్ని ఎనౌన్స్ చేస్తాడు. తన బిడ్డ జోలికి రావొద్దని బాలూని హెచ్చరిస్తాడు. అదే సమయంలో తాను అప్పటివరకూ ఉన్నది పెంపుడు తల్లి దండ్రుల దగ్గర అనీ, తన పేరెంట్స్ బ్రహ్మ సముద్రానికి చెందినవారని బాలూకి తెలుస్తుంది. అతని తండ్రి చనిపోయాడనీ .. అంత్య క్రియలు చేయాలని కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకుని వెళతారు. 

బ్రహ్మ సముద్రం ఊరు వెళ్లిన బాలూ, తన అసలు పేరు 'రుద్రకాళేశ్వర రెడ్డి' అని తెలుసుకుంటాడు. తాను 'మహా కాళేశ్వర రెడ్డి' (సుమన్) కొడుకుననే విషయం ఆయనకి అర్థమవుతుంది. తన తండ్రి డెడ్ బాడీని చూడగానే, గతంలో ఒక సందర్భంలో ఆయనను కలవడం .. బ్రహ్మసముద్రం విషయంలో ఒక మాట ఇవ్వడం అతనికి గుర్తుకు వస్తుంది. కొడుకుననే విషయం తెలియకుండానే తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన అప్పుడే నిర్ణయించుకుంటాడు. 

తాను పసికందుగా ఉన్నప్పుడే తన తల్లి చనిపోయిందని బాలూ తెలుసుకుంటాడు. తన తండ్రి యాక్సిడెంట్ లో పోయాడనీ, అయితే ఈ విషయంలో చెంగారెడ్డిపై అనుమానం ఉందని చెబుతారు. తాను ఏ ఇంటికి వారసుడిగా వచ్చాడో .. ఆ ఇంటికి చెంగారెడ్డి అల్లుడు అనే విషయం కూడా అతనికి అప్పుడే తెలుస్తుంది. తన తల్లి జ్ఞాపకార్థం తండ్రి కట్టించిన శివాలయాన్ని, 'క్వారీ' కోసం పడగొట్టడానికి చెంగారెడ్డి ప్రయత్నిస్తున్నాడని అతనికి అర్థమవుతుంది. అప్పుడు బాలూ ఏం చేస్తాడు? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు.          
  
దర్శకుడు శ్రీకాంత్ ఎన్.రెడ్డి తయారు చేసుకున్న ఈ కథ కొత్తదేమీ కాదు. అలాగే స్క్రీన్ ప్లే పరంగా ఆయన అద్భుతాలు కూడా ఏమీ చేయలేదు. శ్రీమంతురాలు .. ఒక సంస్థకి యజమానురాలు .. సీఈఓగా వ్యవహరించే చిత్ర, హీరోను అలా ఇంటర్వ్యూ చేసి .. ఇలా అతని ప్రేమలో పడిపోవడం అనేది సినిమా కాబట్టే అనుకోవాలి. ఏదో కుర్రాడు లవ్ లో పడ్డాడని అనుకుంటే, అతని అసలు ఫ్యామిలీ నేపథ్యం ఇదేనంటూ దర్శకుడు చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. దాంతో బాలూ అనేవాడు 'రుద్రకాళేశ్వర రెడ్డి'గా మారిపోతాడు. కాకపోతే ఆ పేరు వైష్ణవ్ కి అతకలేదు.

  తాను 'మైల'లో ఉన్నానని హీరో చెబుతున్నా, 'శివుడికి మైల ఏంటి నాయనా'? అంటూ అతనితో శివలింగానికి అభిషేకం చేయిస్తారు. ఇక శివాలయంలో హీరోకి .. విలన్ గ్యాంగ్ కి ఫైట్ ఉంది. రౌడీలంతా చెప్పులతోనే ఆలయంలోకి వచ్చి ఫైటింగ్ చేశారు. ఆ సీన్ లో వాళ్ల కాళ్లకి ఉన్న చెప్పులపై 'మాస్క్' వేయడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ఇలాంటి పొరపాట్లు కథలో అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి.

ఇక యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే, హీరోలో ఇంత క్రూరత్వం ఉందా అని ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. బోర్ వాటర్ పంప్ తో విలన్ గ్యాంగ్ పై హీరో విరుచుకు పడతాడు. ఒక రౌడీ బాడీని డ్రిల్లింగ్ మెషిన్ తో ఛిద్రం చేస్తాడు. మరో రౌడీ శరీరంపై బుల్డోజర్ బ్లేడ్ దింపేస్తాడు. పగిలిపోయిన ట్యూబులైట్ ను నోట్లోకి తోసేస్తాడు. కాలుతున్న గుణపాన్ని గొంతులోకి దింపేస్తాడు.  ఒక రౌడీకి నిప్పటించి .. వాడు తగలబడిపోతుంటే, ఆ మంటలో సిగరెట్ వెలిగించుకుంటాడు. ఈ సీన్స్ లో  హీరోయిజం కంటే .. శాడిజం ఎక్కువగా కనిపిస్తుంది. 

ఈ కథ రొటీన్ గా ముందుకు వెళుతున్నా ప్రేక్షకులను కూర్చోబెట్టింది పాటలేనని చెప్పాలి. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన పాటలు ఆకట్టుకుంటాయి. 'హే బుజ్జి బంగారం' .. 'సిత్రాల సిత్రావతి' .. 'లీలమ్మో' వంటి పాటలు బీట్ పరంగా మెప్పిస్తాయి. కలర్ ఫుల్ గా కనువిందు చేస్తాయి. పాటలన్నీ కూడా ఫారిన్ లోనే చిత్రీకరించారు. చిత్రీకరణ .. కొరియోగ్రఫీ కూడా మంచి హెల్ప్ అయ్యాయి. డడ్లీ ఫొటోగ్రఫీకి మంచి మార్కులు ఇవ్వొచ్చు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. 

పాత్రల విషయానికి వస్తే .. మంచి మంచి ఆర్టిస్టులను తీసుకున్నారు. కానీ ఆ పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోలేదనిపిస్తుంది. సుమన్ .. ఆనంద్ .. తనికెళ్ల భరణి .. సుధ .. సదా ఆ జాబితాలో కనిపిస్తారు. ఫస్టాఫ్ వరకూ ఫరవాలేదనిపించిన ఈ కథ, అక్కడి నుంచి నాటకీయంగా .. కాస్త ఓవర్ డోస్ తోనే ముందుకు వెళుతుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన 'జోజు జార్జ్' మలయాళంలో సీనియర్ స్టార్. ఆయన పేరును రోలింగ్ టైటిల్స్ లో ఎక్కడో వేయడం చిత్రంగా అనిపించక మానదు. 

అంతా బాగానే ఉంది .. మరి ఈ కథలో 'ఆదికేశవ' ఎవరు? ఈ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అనే డౌట్ రావడం సహజం. అందుకు సమాధానం ఈ సినిమాలో రాధిక పాత్ర చెబుతుంది .. ఒకరకంగా చెప్పాలంటే అదో పెద్ద ట్విస్టు.   

ప్లస్ పాయింట్స్:
శ్రీలీల గ్లామర్ .. సంగీతం .. ఫొటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: రొటీన్ కథ .. మితిమీరిన యాక్షన్ .. రక్తపాతం 


Movie Name: Adikeshava

Release Date: 2023-11-24
Cast: Vaishnav Tej, Sreeleela, Joju George, Suman, Jaya Prakash, Sudarshan, Thanikella Bharani, Sadah
Director: Srikanth N Reddy
Producer: Nagavamsi
Music: G V Prakash Kumar
Banner: Sithara Entertainments

Adikeshava Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews