'ఇరుగపట్రు' - (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

  • తమిళంలో అక్టోబర్లో వచ్చిన సినిమా 
  • నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • ఆలుమగల మధ్య తలెత్తే సమస్యనే ప్రధాన ఇతివృత్తం
  • ఆకట్టుకునే కథాకథనాలు 
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్

ఈ ఏడాది అక్టోబర్లో తమిళంలో విజయవంతమైన సినిమాల జాబితాలో 'ఇరుగపట్రు' ఒకటిగా కనిపిస్తుంది. అక్టోబర్ 6వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ ను అందించిన సినిమాగా నిలిచింది.  అలాంటి ఈ సినిమా ఈ నెల 6వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

మిత్ర (శ్రద్ధ శ్రీనాథ్) .. మనోహర్ (విక్రమ్ ప్రభు) భార్యాభర్తలు. మిత్ర సైకాలజిస్టుగా .. మ్యారేజ్ కౌన్సిలర్ గా పనిచేస్తూ ఉంటుంది. వివాహ సంబంధమైన సమస్యల కారణంగా ఆమెను చాలామంది సంప్రదిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంఫండటం .. విడిపోవడానికి సిద్ధపడుతూ ఉండటం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఆ జంటలను కాపాడటానికి 'మిత్ర' ప్రయత్నిస్తూ ఉంటుంది. 

అర్జున్ (శ్రీ) .. దివ్య (సానియా) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొంతకాలం పాటు బాగానే ఉన్నప్పటికీ, ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రతి విషయంలోను దివ్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ అర్జున్ మాట్లాడటం ఆమెకి బాధను కలిగిస్తుంది. పిల్లలను కనాలనే నిర్ణయాన్ని దివ్య వాయిదా వేసుకోవడం .. ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తుండటం అర్జున్ కోపంలోకి ఆజ్యం పోస్తుంది. దాంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.

ఇక మరో జంట పవిత్ర ( అబర్నతి) .. రంగేశ్ (విధార్థ్) మధ్య తరగతి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ జంటకు ఒక చంటిపిల్ల ఉంటుంది. తన భార్య లావుగా ఉండటం పట్ల రంగేశ్ పూర్తి అసంతృప్తితో ఉంటాడు. తాను లావు తగ్గడానికి ట్రై చేస్తానని పవిత్ర చెప్పినా వినిపించుకోకుండా, విడాకులు ఇవ్వమంటూ ఆమెను ఒత్తిడి చేస్తుంటాడు. దాంతో ఆమె మానసికంగా కుంగిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జంటలు కూడా కౌన్సిలింగ్ కోసం 'మిత్ర'ను కలుసుకుంటారు. 

ఆ రెండు జంటలను కలపడానికి మిత్ర తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన సంసారం విషయంలో మాత్రం ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఆమె కంగారుపడినట్టుగానే ఊహించని విధంగా మిత్ర కాపురంలోను కల్లోలం బయల్దేరుతుంది. అందుకు కారణం ఏమిటి? మిత్ర వైవాహిక జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.

ఈ సినిమాకి యువరాజ్ దయాళన్ రచయితగా .. దర్శకుడిగా వ్యవహరించాడు. భార్య భర్తల మధ్య అపార్థాలు .. అలకలు అనే అంశాలను కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. చాలా తక్కువ పాత్రలతో దర్శకుడు ఈ కథను రెడీ చేసుకున్నాడు. అరడజను ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. ప్రతి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సహజత్వానికి దగ్గరగా వెళుతూ, ప్రేక్షకులను కూడా కథలో భాగం చేస్తుంది. 

కొత్తగా పెళ్లి అయిన జంట .. పెళ్లై కొంతకాలమైన జంట .. ఒక సంతానాన్ని కలిగిన దంపతులను తీసుకుని, వాళ్ల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఒక్కో జంట ఒక్కో నేపథ్యంలో ఉండటం .. వాళ్ల వైపు నుంచి ఉన్న సమస్య విభిన్నంగా ఉండటం వలన కథ ఆసక్తికరంగా ముందుకు వెళుతూ ఉంటుంది. ఎక్కడా కూడా అనవసరమైన సన్నివేశాలు కనిపించవు.  

భార్యాభర్తల మధ్య గొడవలు వాళ్ల కెరియర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఇద్దరూ కూడా సహనంతో వ్యవహరించకపోవడం వలన వాళ్ల మధ్య గ్యాప్ ఎలా పెరిగిపోతూ ఉంటుంది? పంతా లకుపోయి విడాకుల  దిశగా మొగ్గు చూపినా, అది ఎంతటి బాధను కలిస్తుందనే విషయాలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. చాలా తక్కువ ఖర్చుతో దర్శకుడు ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లిన విధానం మెప్పిస్తుంది. 

జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక పెద్దగా అవుట్ డోర్ కి వెళ్లకపోయినా, గోకుల్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. మణికంద బాలాజీ ఎడిటింగ్ వర్క్ చాలా నీట్ గా అనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ నటనను అభినందించకుండా ఉండలేం. ఈ సినిమాలో ఆమె మరింత గ్లామరస్ గా మెరిసింది. మిగిలిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. 

భార్యాభర్తలు గొడవ పడటానికి ఏ కారణం అవసరం లేదు .. భార్యాభర్తలై ఉంటే చాలు అనే అంశంతో ఈ కథ మొదలవుతుంది. భార్యాభర్తలు కాస్త ఓపికతో వ్యవహరించకపోవడమే సమస్యలకు ప్రధానమైన కారణం. సర్దుకుపోవడంలోనే సంతోషం ఉంది .. అనే సందేశం ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. పాటలు .. ఫైట్లు లేకపోయినా, విలనిజం హడావిడిలేకపోయినా ఆ లోటు తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. 

Movie Name: Irugapatru

Release Date: 2023-11-06
Cast: Shraddha Srinath, Vikram Prabhu, Sri, Saniya Iyappan, Abarnathi, Vidharth
Director: Yuvaraj Dhayalan
Producer: S.R. Prakash Babu - S.R. Prabhu
Music: Justin Prabhakaran
Banner: Potential Studios

Irugapatru Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews