'ఆర్య' సీజన్ 3 (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • అందుబాటులోకి 'ఆర్య' సీజన్ 3
  • కీలకమైన నాలుగు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ 
  • ఉత్కంఠను పెంచుతూ సాగిన స్క్రీన్ ప్లే  
  • హైలైట్ గా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • నిర్మాణ విలువల పరంగా మంచి మార్కులు 

సుస్మితా సేన్ ప్రధానమైన పాత్రను పోషించిన 'ఆర్య' వెబ్ సిరీస్ నుంచి ఇంతవరకూ రెండు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫస్టు సీజన్ లో 9 ఎపిసోడ్స్ .. సెకండ్ సీజన్ లో 8 ఎపిసోడ్స్ ను వదలగా విశేషమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సీజన్ 3లో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి 4 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన ఈ 4 ఎపిసోడ్స్  ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.
 
ఆర్య (సుస్మితా సేన్) తన భర్త తేజ్ (చంద్రచూర్ సింగ్) ను కోల్పోతుంది. అప్పటి నుంచి ముగ్గురు పిల్లల విషయంలో ఆమె బాధ్యత మరింత పెరుగుతుంది. ఒక వైపున తన వ్యాపార వ్యవహారాలను చక్కబెడుతూనే, మరో వైపున వ్యాపారపరమైన శత్రువులను ఆమె ఫేస్ చేస్తూ ఉంటుంది. వ్యాపారం పరంగా కొత్తగా ఆమె తీసుకున్న నిర్ణయం వలన అదనంగా ఆమెపై 100 కోట్ల భారం పడుతుంది. ఆ డబ్బు కోసం ఆమె అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. 

ఆర్య వ్యాపారం పరంగా తమకి పోటీగా నిలవడానికి ట్రై చేస్తుందనే విషయం నళిని సాహెబా (ఇళా అరుణ్)కి తెలుస్తుంది. దాంతో ఆర్యను కట్టడి చేయడానికి ఆమె తన వైపు నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తమకి పోటీగా వస్తే ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుందని హెచ్చరిస్తుంది. ఇక ఆర్య ను ఆధారాలతో సహా పట్టుకోవడానికి ఏసీపీ ఖాన్ (వికాస్ కుమార్) గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన బారి నుంచి తప్పించుకుంటూ ఉండటం ఆర్యకి తలనొప్పిగా తయారవుతుంది. 

 ఇక మరో వైపు నుంచి ఆర్యకి సూరజ్ (ఇంద్రనీల్ సేన్ గుప్తా) ప్రధానమైన శత్రువుగా మారతాడు. తన భార్య నందిని తనకి శాశ్వతంగా దూరం కావడానికి ఆర్య కారణమని భావించిన ఆయన, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడతాడు. ఆమె వ్యాపారాలను దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆర్యకి వ్యాపార భాగస్వామిగా రూప్ (శ్వేత) వ్యవహరిస్తూ ఉంటుంది. ఆర్య కొడుకు వీర్ (వీరేన్) .. రూప్ ప్రేమించుకుంటారు. వీర్ కారణంగా ఆమె గర్భవతి అవుతుంది.

అయితే ఈ విషయం ఆర్యకి తెలియదు. ఆ సంగతి ఆమె దృష్టికి వచ్చేసరికి, రూప్ ను సూరజ్ కిడ్నాప్ చేస్తాడు. ఆమె ద్వారా ఆర్యకి సంబంధించిన ఒక కంటెయినర్ నెంబర్ తెలుసుకోవడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు. ఆ కంటెయినర్లో వెయ్యికోట్ల సరుకు ఉంటుంది. తాను కంటెయినర్ నెంబర్ చెబితే వెయ్యికోట్ల సరుకు చేజారిపోతుంది. చెప్పకపోతే తన కొడుకు ప్రేమిస్తున్న రూప్ ప్రాణాలు కోల్పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్య ఏం చేస్తుంది? ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ.

కపిల్ శర్మ .. శ్రద్ధ .. రామ్ మధ్వాని ఈ ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించారు. ఇంతవరకూ స్ట్రీమింగ్ అయిన అన్ని ఎపిసోడ్స్  ఒక ఎత్తయితే ... ఈ నాలుగు ఎపిసోడ్స్ ఒక ఎత్తని చెప్పాలి. ఎందుకంటే కథ ఈ 4 ఎపిసోడ్స్ లో అనూహ్యమైన మలుపులు తీసుకుంటుంది. మొదటి నుంచి నడుస్తూ వస్తున్న ట్రాకులన్నీ ఈ నాలుగు ఎపిసోడ్స్ లో చివరికి వచ్చేస్తాయి. అందువలన ప్రేక్షకులలో మరింత ఉత్కంఠ పెరగడం జరుగుతుంది.

ముఖ్యంగా ఈ నాలుగు ఎపిసోడ్స్ కి సంబంధించిన స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా వెళుతుంది.
ఒక వైపున ఆర్య .. ఒక వైపున ఏసీపీ ఖాన్ .. మరో వైపున సూరజ్ .. ఇంకో వైపున నళిని సాహెబా ట్రాకులను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. వీర్ - రూప్ లవ్ ట్రాక్ టెన్షన్ పెట్టేస్తుంది. ఒక వామోపిన యాక్షన్ .. మరో వైపున ఎమోషన్ ను టచ్ చేస్తూ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ కథ నడుస్తుంది. 

కథాకథనాల పరంగా ... నిర్మాణ విలువల  పరంగా ఈ సిరీస్ ఎంతమాత్రం తగ్గలేదు. సందర్భానికి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలను తలపించే చిత్రీకరణ .. ఎక్కడా పట్టుసడలని స్క్రీన్ ప్లే .. ఎడిటింగ్ వర్క్ ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పాలి. సుస్మిత సేన్ నటన ఈ  సిరీస్ కి హైలైట్. ఇక మిగతా పాత్రధారులంతా తమ పాత్రలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు.

బడ్జెట్ పరంగా ... భారీతారాగణం పరంగా .. కథాకథనాల పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఇలా ఎలా చూసుకున్నా, ఈ సిరీస్ ఒక ప్రత్యేకమైన స్థానంలోనే కనిపిస్తుంది. అక్రమ లావాదేవీలు .. ఎత్తులు .. పై ఎత్తులు .. పగలు .. ప్రతీకారాలు .. నమ్మక ద్రోహాలు .. ఇలాంటి ఒక వాతావరణంలో సాగే జీవితం ఎలా ఉంటుంది? అలాంటివారికి అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయి? అనేది గొప్పగా ఆవిష్కరించిన సిరీస్ గా 'ఆర్య' గురించి చెప్పుకోవచ్చు. 

ప్లస్ పాయింట్స్: కథా కథనాలు .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. నిర్మాణ విలువలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం .. లొకేషన్స్. 

Movie Name: Aarya

Release Date: 2023-11-03
Cast: Susmitha Sen, Ila Arun, Sikandar Kher, Vikas Kumar, Indraneilsen Gupta  
Director: Kapil Sharma- Ram Madhvani
Producer: Ram Madhvani
Music: -
Banner: Ram Madhvani Films

Aarya Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews