'మాన్షన్ 24' - (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

  • ఓంకార్ నుంచి వచ్చిన 'మాన్షన్ 24' 
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన భారీ సిరీస్
  • వరలక్ష్మి శరత్ కుమార్ - రావు రమేశ్ పాత్రలే ప్రధానం 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఫొటోగ్రఫీ ఓకే 
  • అంతగా భయపెట్టని కంటెంట్ 
  • 6 ఎపిసోడ్స్ లో ఫరవాలేదనిపించేవి 3 మాత్రమే
హారర్ థ్రిల్లర్ జోనర్ కి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మంచి క్రేజ్ ఉంది. అందువలన తెలుగు వైపు నుంచి కూడా ఈ తరహా సిరీస్ లు వస్తున్నాయి. అలా తాజాగా 'హాట్ స్టార్' సెంటర్ కి వచ్చిన సిరీస్ గా 'మాన్షన్ 24' కనిపిస్తుంది. భారీ తారాగణంతో ట్రైలర్ తోనే ఆసక్తిని పెంచిన సిరీస్ ఇది. గతంలో 'రాజుగారి గది' వంటి హారర్ థ్రిల్లర్ చిత్రాలను అందించిన ఓంకార్, ఇప్పుడు అదే జోనర్ లో ఈ సిరీస్ ను అందించాడు. ఈ సిరీస్ ప్రధానమైన కథాంశం ఏమిటి? అది ఎంతవరకూ భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం. 

కాళిదాసు (సత్యరాజ్) ఆర్కియాలజీ డిపార్టుమెంటులో పనిచేస్తూ ఉంటాడు. భార్య (తులసి) .. కూతురు అమృత (వరలక్ష్మి శరత్ కుమార్) ఇది అతని కుటుంబం. అమృత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటుంది. ఒక రోజున ఆఫీసుకి వెళ్లిన కాళిదాసు కనిపించకుండాపోతాడు. తవ్వకాల్లో బయటపడిన జాతీయ సంపదను తీసుకుని అతను పారిపోయాడనే వార్త గుప్పుమంటుంది. మీడియాలోను .. జనంలోను అదే విషయానికి సంబంధించిన టాక్ నడుస్తూ ఉంటుంది. తన తండ్రిలాంటి నిజాయితీపరుడిపై అలాంటి నిందపడటం అమృతకి చాలా బాధకలిగిస్తుంది.  

కాళిదాసుపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన భార్య తట్టుకోలేక, అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతుంది. తన తల్లి కోలుకోవాలంటే .. తన తండ్రి తిరిగిరావలసిందేననే విషయం అమృతకి అర్థమవుతుంది.  ఆర్కియాలజి డిపార్టుమెంటువారినీ .. పోలీస్ డిపార్టుమెంటువారిని కలిసి, పరిస్థితిని వివరిస్తుంది. తన తండ్రి నిజాయితీపరుడని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయినా వాళ్లు వినిపించుకోరు. తన తండ్రి చివరగా పాడుబడిన 'మాన్షన్'కి వెళ్లాడని తెలుసుకున్న అమృత, అక్కడికి బయల్దేరుతుంది. 

'మాన్షన్' సమీపంలో ఒక చిన్న ఇల్లు ఉండటం గమనించి అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమెకి ఆ 'మాన్షన్' వాచ్ మెన్ (రావు రమేశ్) కనిపిస్తాడు. ఆ మాన్షన్ లోకి ఎవరూ వెళ్లకుండా చూడటం కోసమే తాను అక్కడ ఉంటున్నట్టుగా చెబుతాడు. ఆ మాన్షన్ పై ఒక ఆర్టికల్ రాయడానికి వచ్చినట్టుగా అమృత చెబుతుంది. దాంతో ఆ మాన్షన్ లో దెయ్యాలు ఉన్నాయని అంటూ, గతంలో ఆ మాన్షన్ లోని ఏయే రూమ్ లో ఎవరెవరు చనిపోయారో, ఆ మరణాల వెనుక దెయ్యాలు ఉండటానికి కారణమేమిటో చెబుతాడు.

 శిథిలావస్థలో ఉన్న ఆ మాన్షన్ లోకి వెళ్లొద్దనీ, అలా వెళ్లినవారెవరూ తిరిగిరాలేదని అమృతతో వాచ్ మెన్ చెబుతాడు. అయినా అతని మాటలను పట్టించుకోకుండా అమృత లోపలికి వెళుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఎలాంటి అనుభవాలు అమృతకి ఎదురవుతాయి?  కాళిదాసు ప్రాణాలతోనే ఉంటాడా? అక్కడి నుంచి అమృత బయటపడగలుతుందా? మాన్షన్ చుట్టూ అల్లుకున్న చీకటి రహస్యాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. 

ఈ సిరీస్ కి మయూఖ్ ఆదిత్య కథను అందించాడు. ఆ కథకి ఓంకార్ దృశ్య రూపాన్ని ఇచ్చాడు. ఒక పాడుబడిన బంగ్లా .. ఆ వైపు వెళ్లడానికి కూడా జనాలు భయపడేంత చరిత్ర ఆ మాన్షన్ కి ఉంది.  కనిపించకుండాపోయిన తన తండ్రిని వెతుకుతూ ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన ఒక అందమైన యువతికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే విషయాన్ని ట్రైలర్ తో చెబుతూ అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. అప్పటి నుంచి ఈ సిరీస్ కోసం అంతా వెయిట్ చేస్తూ వచ్చారు. 

ఈ రోజునే ఈ సిరీస్ కి సంబంధించిన 6 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఆశించిన స్థాయిని అందుకోగలిగిందా? హారర్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడే ఆడియన్స్  అంచనాలను చేరుకోగలిగిందా? అంటే .. లేదనే చెప్పాలి. 'రైటర్ చతుర్వేది' ఎపిసోడ్ పెద్దగా భయపెట్టలేకపోయింది. దానితో ఫస్టు ఎపిసోడ్ నే నిరాశపరిచినట్టుగా అనిపిస్తుంది. 

ఇక స్వప్న - బేబి (అవికా గోర్ - మానస్) ఎపిసోడ్, దేవుడమ్మ (నళిని) ఎపిసోడ్ ఫరవాలేదు. మళ్లీ రాజు (అమర్) ఎపిసోడ్ .. లిల్లీ ( నందూ) ఎపిసోడ్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. నందూ ఎపిసోడ్స్ చూస్తుంటే, హారర్ థ్రిల్లర్ జోనర్ దాటేసి .. హాలీవుడ్ సైకో థ్రిల్లర్ సినిమాను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ లోను దెయ్యాల పాత్ర ఉంటున్నప్పటికీ, సైకలాజికల్ గా అమృత రీజన్ చెబుతూ ఉంటుంది.

సాధారణంగా హారర్ థ్రిల్లర్ జోనర్ అనగానే, అక్కడ కథాకథనాల కంటే కూడా, కెమెరా వర్క్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. కానీ ఇక్కడ ఇవి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. వికాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. రాజశేఖర్ ఫొటోగ్రఫీ  ఫరవాలేదు .. ఎడిటింగ్ పరంగా కూడా ఓకే. అయితే తెల్లని కనుగుడ్లతో హాలీవుడ్ మార్క్ దెయ్యాలను చూపించడం .. మాన్షన్ ఎంపిక కూడా అదే ఫీలింగును కలిగిస్తూ ఉంటుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. రావు రమేశ్ .. తన మార్క్ నటన చూపించాడు. నళిని పాత్ర కాస్త అతిగా అనిపిస్తుంది. సత్యరాజ్ .. తులసి . జయప్రకాశ్ .. సూర్య వంటి మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నారుగానీ, ఆ స్థాయికి తగినట్టుగా పాత్రలను డిజైన్ చేయలేకపోయారు. అవికా .. అభినయ .. బిందుమాధవి నటన ఓకే.  విద్యుల్లేఖను పెట్టుకుని కూడా కామెడీని వర్కౌట్ చేయలేకపోయారు. అయ్యప్ప పి. శర్మ పాత్రకి గల ప్రయోజనం ఏమిటనేది అర్థం కాదు. 

 ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో దెయ్యం కథను చూపించడమనే ఆలోచన బాగుంది. కానీ ఆ దెయ్యాల కథలను అంతే ఎఫెక్టివ్ గా తయారు చేసుకుని ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల లాజిక్ మిస్సయ్యారు. 'మాన్షన్'కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లోను, ఈ కథలోని పాత్రలు తప్ప మరెవరూ అక్కడ  కనిపించకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. నరమానవుడు కనిపించని హోటల్లో ఫ్యామిలీతో వచ్చి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

 ఒక సాధారణ పాత్రలో బాగా క్రేజ్ ఉన్న సీనియర్ ఆర్టిస్టును చూపించినప్పుడే, ఆ పాత్ర వెనుక ఏదో ఉంటుందనే విషయాన్ని ప్రేక్షకులు ఈజీగా గెస్ చేస్తారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ సుత్తితో గోడను బద్దలు కొట్టినప్పుడు కూడా లాజిక్ మిస్సయింది. ఇలాంటివే మరొకొన్ని కనిపిస్తాయి. నిర్మాణ విలువల పరంగా .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గౌండ్ స్కోర్ పరంగా ఈ సిరీస్ కి కాస్త ఎక్కువ మార్కులు దక్కుతాయి. మొత్తం 6 ఎపిసోడ్స్ లో 3 ఎపిసోడ్స్ మాత్రమే ఫరవాలేదనిపిస్తాయంతే. 

Movie Name: Mansion 24

Release Date: 2023-10-17
Cast: Varalaxmi Sarathkumar,Rao Ramesh, Sathyaraj, Tulasi, Bindu Madhavi, Avika Gor, Abhinaya
Director: Ohmkar
Producer: Ashwin Babu
Music: Vikas Badisha
Banner: Oak Entertainment

Mansion 24 Rating: 2.50 out of 5


More Movie Reviews