'మట్టికథ' - (ఆహా) మూవీ రివ్యూ!

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • సరిగ్గా డిజైన్ చేయని పాత్రలు
  • సహజత్వానికి దూరంగా సాగిన సన్నివేశాలు  
  • ఎమోషన్స్ పరంగా కనెక్ట్ కాని కంటెంట్
తెలంగాణ గ్రామీణ జీవన విధానం .. మావన సంబంధాలు .. మట్టిపై ఇక్కడి మనుషులు పెంచుకునే అనుబంధం నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తెలంగాణ సంస్కృతిని అందంగా .. హృద్యంగా ఆవిష్కరించిన కొన్ని సినిమాలు విశేషమైన ఆదరణ పొందాయి. అలాంటి కంటెంట్ తో రూపొందిన సినిమానే 'మట్టికథ'. సెప్టెంబర్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. కానీ సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ కథ 2003లో హైదరాబాద్ సమీపంలోని ఒక గ్రామంలో మొదలవుతుంది. ఆ గ్రామంలో భూమయ్య ( అజయ్ వేద్) శ్రీను (అక్షయ్ సాయి) రాజు (బత్తుల తేజ) యాదగిరి (రాజు ఆలూరి) ఈ నలుగురూ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఈ నలుగురూ కలిసి పెరుగుతారు .. కలిసి తిరుగుతారు. ఆర్ధికంగా అందరి కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే. అయితే అందరిలోకి యాదగిరి బాగా చదువుతాడు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా కాలేజ్ లో చేరలేకపోతాడు. తన స్నేహితుల మాదిరిగా కాలేజ్ కి వెళ్లలేకపోయినందుకు బాధపడుతూ ఉంటాడు.

భూమయ్య .. శ్రీను .. రాజు మాత్రం కాలేజ్ కి వెళ్లి వస్తుంటారుగానీ, వాళ్ల ధ్యాస చదువుపై ఉండదు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి శేఖర్ వస్తాడు. హైదరాబాద్ లైఫ్ స్టైల్ గురించి శేఖర్ గొప్పలు చెబుతూ ఉండటంతో, హైదరాబాద్ పోయి లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే నిర్ణయానికి వస్తారు. తమకి ఉన్న కొద్దిపాటి భూమిని అమ్ముకుని హైదరాబాద్ పోతే, అక్కడ హ్యాపీగా ఉండొచ్చని కలలు కంటూ ఉంటారు. ఇంట్లోని వారు పొలం పనులు చెబితే విసుక్కుంటూ ఉంటారు. 

ఇదే సమయంలో ఆ ఊరు పట్వారి (నంద కిశోర్) కన్ను భూమయ్య పొలంపై పడుతుంది. ఎలాంటి అవసరాలు వచ్చినా ఆ పొలం అమ్మకుండా భూమయ్య తండ్రి దానిని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఆ పట్వారి కూతురు రాజ్యలక్ష్మి (మాయ) కూడా భూమయ్య కాలేజ్ లోనే చదువుతూ ఉంటుంది. ఆ కాలేజ్ లో పీఈటీ సార్ గా పనిచేసే నర్సయ్య ... వాసవి అనే అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు భూమయ్య మిత్ర బృందం అతణ్ణి హెచ్చరించి వదిలేస్తారు. దాంతో ఆ కోపాన్ని అతను మనసులో దాచుకుంటాడు. 

ఇక భూమయ్య .. రాజ్యలక్ష్మి ప్రేమించుకుంటున్నారనే విషయం పట్వారికి తెలుస్తుంది. దాంతో సమయం వచ్చినప్పుడు భూమయ్య సంగతి చూడాలనే ఉద్దేశంతో ఆయన ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే భూమయ్య మిత్రబృందం వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ కావడానికి కారకులు అవుతారు .. డిబార్ అవుతారు. ఆ కోపంతో వాళ్లు నర్సయ్య సార్ ను గాయపరుస్తారు. అది కూడా మరో కేసుగా పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. ఈ కేసుల నుంచి బయటపడటానికి భూమయ్య ఏం చేస్తాడు? అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేదే కథ. 

'మట్టికథ' అనే టైటిల్ తోనే .. కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందనే విషయం ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. తెలంగాణలో ప్రధానమైన జీవనాధారం వ్యవసాయమే. ఇక్కడ పెద్దవాళ్ల దగ్గర నుంచి పిల్లల వరకూ అందరూ పొలాల్లో పనిచేస్తారు. పొలం గట్ల పైనే వాళ్ల జీవితంలోని చాలా భాగం గడిచిపోతుంది. తమ పూర్వీకులు తిరిగిన నేలగా భావించి, ఆ పొలం పట్ల వాళ్లు మమకారాన్ని పెంచుకుంటారు. అలాంటి పొలం చేజారిపోతుందంటే, అంతకంటే తమ ప్రాణం పోవడాన్నే సుఖంగా భావిస్తారు. ఈ కథ ద్వారా దర్శకుడు చెప్పిన విషయం ఇదే.

ఈ కథలో పల్లె జీవితం పట్ల అసహనం .. సిటీ లైఫ్ పట్ల ఆకర్షణ కలిగిన యువకుడిగా భూమయ్య కనిపిస్తాడు. అలాగే భూమిని నమ్ముకున్నవాడెప్పుడూ చెడిపోడు అనేది ఒక సిద్ధంతంగా పెట్టుకున్న అతని తండ్రి పాత్ర .. భూములను తక్కువ రేటుకు దక్కించుకోవాలని చూసే పట్వారి పాత్ర .. ఆర్థికపరమైన ఇబ్బందుల వలన చదువుకు దూరమైన యాదగిరి పాత్ర ప్రధానంగా కనిపిస్తాయి. 

భూమయ్య పాత్ర ద్వారా లవ్ ట్రాక్ ను టచ్ చేసిన దర్శకుడు అక్కడి నుంచి ముందుకు వెళ్లలేదు. హైదరాబాద్ పక్కనే ఉన్న గ్రామం అంటూనే కథను మొదలుపెట్టారు. కానీ హైదరాబాద్ అనేది తనకి అందనంత దూరంలో ఉందన్నట్టుగా హీరో కలలు కనడం .. హైదరాబాద్ గురించి ఎవరేం చెప్పినా నమ్మేయడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. 'సిగరెట్ తాగితే పొగ వస్తుంది .. పొగను ఏం చేయాలి?' అనే డైలాగ్ వింటే, 2003లో విలేజ్ విద్యార్థులు ఇంత అమాయకంగా ఉన్నారా? అనిపిస్తుంది. 

 అలాగే పట్వారి పాత్రలోని నెగెటివ్ షేడ్స్ ను కూడా బలంగా చెప్పలేదు. పొలంతో భూమయ్య తండ్రికి ఉన్న అనుబంధాన్ని చూపించిన తీరు కూడా చాలా బలహీనంగా అనిపిస్తుంది. యాదగిరి లైఫ్ నుంచి కూడా ఒక మెసేజ్ ఇవ్వొచ్చు .. కానీ ఆ పాత్రను కూడా దర్శకుడు మధ్యలోనే వదిలేశాడు. ఇక పల్లెటూరు అనగానే రచ్చబండ .. రకరకాల వ్యక్తులు .. వాళ్ల మేనరిజమ్స్ .. పలకరింపులు .. ఈత చెట్లు .. కల్లు ముంతలు .. ఎడ్ల బండ్లు .. కోళ్ల గంపలు .. ఇలాంటి ఒక వాతావరణం మిస్సయిందనే చెప్పాలి.

గ్రామీణ నేపథ్యం ... అక్కడి మట్టితో పెనవేసుకుపోయిన మనుషుల జీవితాలను హృద్యంగా ఆవిష్కరించాలనే ప్రయత్నం అభినందనీయమే. తెరపై పల్లెటూరును చూసి .. పైరగాలిని పీల్చి మురిసిపోయేవాళ్లు సిటీల్లోను చాలామంది ఉన్నారు. అలాంటి గ్రామీణ నేపథ్యంలోని ఈ కథను బలంగా .. దృఢంగా చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆర్టిస్టులు చాలామంది కొత్తవాళ్లు కావడం వలన, నటన పరంగా ఆశించిన స్థాయి అవుట్ పుట్ ను రాబట్టలేకపోయారు.

సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఓకే.  లవ్ .. కామెడీ .. యాక్షన్ ను వదిలేసి, ఒక్క ఎమోషన్ ను మాత్రమే పట్టుకుని దర్శకుడు ముందుకు వెళ్లడం,  క్లైమాక్స్ ను ఒక ఆర్టు ఫిలిమ్ మాదిరిగా వదిలేయడం అసంతృప్తిని కలిగిస్తుంది. కథలోకి ఆత్మను ప్రవేశపెట్టి .. ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ .. వాటిని ఒక గమ్యానికి చేర్చినట్టయితే, మట్టి పరిమళం మనసుకు మరింత పట్టేదేమో. 

Movie Name: Mattikatha

Release Date: 2023-10-13
Cast: Ajay Ved, Maya, Akshy Sai, Aluri Raju, Mallesh, Kanakavva, Battula Teja
Director: Pavan Kadiyala
Producer: Appi Reddy
Music: Smaran Sai
Banner: Mic Movies

Mattikatha Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews