'కాసర్ గోల్డ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ
- మలయాళ సినిమాగా 'కాసర్ గోల్డ్'
- క్రితం నెల 15న విడుదలైన సినిమా
- బంగారం చుట్టూ తిరిగే కథ
- కథ .. స్క్రీన్ ప్లే .. ప్రధానమైన బలం
- ఫొటోగ్రఫీ .. కెమెరా వర్క్ అదనపు బలం
- ఆలోచింపజేసే సందేశం
మలయాళ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఒక సింపుల్ పాయింటును పట్టుకుని, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా కథను నడిపించడం .. చివర్లో ట్విస్టుతో పాటు మంచి సందేశం కూడా ఇవ్వడం మలయాళ సినిమాల్లో కనిపిస్తుంది. అలాంటి ఒక కంటెంట్ తో సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమానే 'కాసర్ గోల్డ్'. థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫైజల్ (సన్నీ) ఓ మధ్య తరగతి యువకుడు. తల్లి .. భార్య దివ్య .. చిన్న పాప .. ఇది అతని కుటుంబం. కులాంతర వివాహం చేసుకున్న ఫైజల్ ఆర్ధికపరమైన ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటాడు. అతని కూతురు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అందువలన అతనికి డబ్బు అత్యవసరమవుతుంది. ఆ ఆపద నుంచి బయటపడే మార్గం కోసం అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓ ముఖ్యమైన పనిపై పక్క ఊరుకి వెళ్లి వస్తానని చెప్పి, స్నేహితులతో కలిసి కారులో బయల్దేరతాడు.
ఇక ఆ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న మూసా (సిద్ధికీ) .. ఆ పార్టీకి జిల్లా సెక్రెటరీగా ఉన్న నారాయణ కలిసి బంగారం స్మగ్లింగును నడిపిస్తూ ఉంటారు. వాళ్ల మనుషుల ద్వారా 'దుబాయ్' నుంచి భారీగా ఇక్కడికి బంగారం చేరిపోతూ ఉంటుంది. ఈ వ్యవహారమంతా కూడా అల్బీ (అసిఫ్ అలీ) పర్యవేక్షణలో నడుస్తూ ఉంటుంది. అతని లవర్ నాన్సీ (మాళవిక శ్రీనాథ్) పాత్ర కూడా ఇందులో ఉంటుంది. దుబాయ్ నుంచి రెండున్నర కోట్ల ఖరీదు చేసే బంగారాన్ని ఆమె అక్రమంగా తీసుకుని వస్తుంది.
అల్బీ - నాన్సీ ఇద్దరూ కూడా ఆ బంగారంతో ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా, అదే రోడ్ లో వారికి ఎదురుగా ఫైజల్ ప్రయాణిస్తున్న కారు వస్తుంది. రెండు కార్లు ఢీ కొట్టుకోవడం .. అల్బీ - ఫైజల్ ఫ్రెండ్స్ గొడవపడటం జరుగుతుంది. ఆ గొడవ సద్దుమణిగాక తమ కారులో బంగారం లేకపోవడం చూసి అల్బీ - నాన్సీ ఆశ్చర్యపోతారు. ప్రమాదం జరిగిన సమయంలో .. ఫైజల్ బ్యాచ్ ఆ బంగారం లేపేసి ఉంటుందని భావిస్తారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి చెబుతారు.
కోట్ల రూపాయల ఖరీదు చేసే బంగారం మాయం కావడం పట్ల ఎమ్మెల్యే తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. ఫైజల్ ను పట్టుకోవడానికి ఒక వైపున తన రౌడీ గ్యాంగును .. మరో వైపున సస్పెండ్ చేయబడిన పోలీస్ ఆఫీసర్ 'అలెక్స్' (వినాయకన్)ను నియమిస్తాడు. అయితే ఎమ్మెల్యేకి అల్బీ పై కూడా అనుమానం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఫైజల్ ఆ బంగారం కాజేశాడా? తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి అల్బీ ఆ బంగారాన్ని నొక్కేశాడా? ఆ బంగారం ఎవరి జీవితాలతో ఎలా ఆడుకుంది? అనేదే కథ.
ఒక రాజకీయనాయకుడు స్మగ్లింగ్ చేయిస్తున్న బంగారం పోవడం .. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నించడం .. ఆ బంగారం ఎవరి దగ్గర ఉంది? చివరికి ఎవరి దగ్గరికి చేరుతుంది? అనేవి ఆసక్తికరమైన అంశాలు. మొత్తంగా చెప్పాలంటే కథ ఇంతే. ఈ రెండు లైన్లు చదివితే .. ఇంతేనా? అనిపిస్తుంది. కానీ దర్శకుడు మృదుల్ నాయర్ ఈ కథను ఓ పిట్టకథతో మొదలుపెట్టిన విధానం, అక్కడి నుంచి అసలు కథను నడిపించిన తీరు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
ఒక వైపున తన లవర్ తో కలిసి అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ స్మగ్లింగ్ చేసే అల్బీ .. మరో వైపున తన ఫ్యామిలీని బాగా చూసుకోవడం కోసం ఏమైనా చేయాలనే ఫైజల్ .. తన బంగారం తనకి దక్కాలనే ఎమ్మెల్యే పట్టుదల. ఈ విషయంలో ఆయనకి హెల్ప్ చేస్తే తన ఖాకీ డ్రెస్ తనకి వచ్చేలా చేస్తాడనే ఆశతో, పోయిన బంగారం కోసం బయల్దేరిన సస్పెండ్ చేయబడిన పోలీస్ ఆఫీసర్. ఈ నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
మధ్య మధ్యలో ఎమోషన్స్ ను .. యాక్షన్ ను టచ్ చేస్తూ, నెక్స్ట్ ఏం జరగనుందా? అనే ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. డీప్ లవ్ .. రొమాన్స్ .. కామెడీ లేకపోయినా, ఎక్కడా కూడా ఆ వెలితి తెలియదు. కథ ఎప్పటికప్పుడు మలుపులు తీసుకుంటూ .. లొకేషన్స్ ను మార్చుకుంటూ నెక్స్ట్ లెవెల్ కి వెళుతూ ఉంటుంది. అయితే కథలో కొంతదూరం వెళ్లాక, ఆ ట్రాక్ ఏ వైపుకు వెళుతుందనేది ప్రేక్షకుడు కొంతవరకూ గెస్ చేయగలుగుతాడు. ఆ డౌట్ రాకుండా చూసుకుని ఉంటే వేరే లెవెల్ లో ఉండేది.
అయినా ఈ సంఘటన నుంచి ఈ పాత్రలు ఎలా బయటపడతాయా? అనే ఒక టెన్షన్ ను ఆడియన్స్ లో పెంచడంలో దర్శకుడి టాలెంటును కొట్టిపారేయలేం. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ .. క్లైమాక్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా చేశారు. ఎక్కడా 'అతి' అనిపించదు. కృతకంగా అనిపించే నాటకీయత కనిపించదు. 'జైలర్' సినిమాలో విలన్ గా మెప్పించిన వినాయకన్, రాజకీయనాయకుడికి కొమ్ముగాసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు.
విష్ణు విజయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి. జేబిన్ జాకబ్ కెమెరా పనితనం బాగుంది. ఫారెస్టు నేపథ్యంలో సన్నివేశాలను గొప్పగా చిత్రీకరించాడు. ఇక మనోజ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. 'దురాశ దుఃఖానికి చేటు' .. 'విలాసవంతమైన జీవితం కోసం తప్పుదారిలో వెళితే విషాదమే మిగులుతుంది' అనే నీతి .. సందేశం ఈ కథలో కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీస్ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వినాయకన్ నటన .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. లొకేషన్స్ .. క్లైమాక్స్ .. సందేశం.
Movie Name: Kasargold
Release Date: 2023-10-13
Cast: Asif Ali,Sunny Wayne, Vinayakan,Siddique,Sampath Ram,Deepak Parambol,
Director: Mridul Nair
Producer: Vikram Mehra- Siddharth Anand
Music: Vishnu Vijay
Banner: Yoodlee Films
Review By: Peddinti
Kasargold Rating: 3.00 out of 5
Trailer