'స్కామ్ 2003'- (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ

  • అబ్దుల్ కరీమ్ తెల్గీ బయోగ్రఫీగా 'స్కామ్ 2003'
  • ఈ నెల 1వ తేదీ నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్
  • సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు
  • గగన్ దేవ్ రియార్ నటన హైలైట్
  • సీజన్ 2లోనే దాగిన అసలైన కథ  

2003లో వేలకోట్లలో జరిగిన స్టాంప్ పేపర్ కుంభకోణం ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ స్కామ్ తో 'అబ్దుల్ కరీమ్ తెల్గీ' పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఈ స్థాయి మోసానికి పాల్పడిన ఆ వ్యక్తి పేరు అందరి నోళ్లలో చాలా కాలం పాటు నానింది. అతని జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ నే 'స్కామ్ 2003'. హన్సల్ మెహతా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, తుషార్ హీరానందని దర్శకత్వం వహించాడు. సీజన్ 1లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 5 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది చూద్దాం.

అబ్దుల్ కరీమ్ తెల్గీ (గగన్ దేవ్) కర్ణాటక ప్రాంతంలోని 'ఖానాపూర్' గ్రామానికి చెందిన ఒక సాధారణ యువకుడు. అతను మంచి తెలివైనవాడు .. మాటకారి కూడా. సాధ్యమైనంత త్వరగా .. వీలైనంత ఎక్కువగా సంపాదించాలనేది అతని కోరిక. 'డబ్బును సంపాదించడం కాదు .. సృష్టిస్తాను' అనే పట్టుదలతో అతను ముందుకు వెళుతూ ఉంటాడు. తాను ఎంచుకున్న మార్గం గురించిన తప్పు ఒప్పులకంటే కూడా, తన కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉంటున్నారనే విషయంపైనే అతని దృష్టి ఉంటుంది. 

ఒక రోజున రైల్లో పండ్లు అమ్ముతూ ఉన్న అబ్దుల్ ను షౌకత్ గమనిస్తాడు. అబ్దుల్ మాటకారితనం నచ్చడంతో, ముంబై వచ్చి తనని కలిస్తే పని ఇస్తానని చెబుతాడు. ఆ తరువాత ఆయనను వెతుక్కుంటూ అబ్దుల్ ముంబైకి వెళతాడు. అతనికి షౌకత్ ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా, తన కూతురు నఫీసా (సన అమిన్ షేక్) నిచ్చి వివాహం చేస్తాడు .. వారి సంతానమే 'జియా'. అబ్దుల్ మొదటి నుంచి ప్రతి పనికి ఒక దగ్గర దారి వెతుకుతూ ఉంటాడు. ఈ విషయంలో షౌకత్ ఎంతగా చెప్పినా వినిపించుకోడు. 


నకిలీ పాస్ పార్టులు .. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అబ్దుల్ పోలీసులకు దొరికిపోతాడు. ఆ తరువాత షేర్ మార్కెట్ వ్యవహారాలలోను మోసాలకు పాల్పడి జైలుకు వెళతాడు. జైల్లో అయిన పరిచయాల కారణంగా అతను తన దృష్టిని నకిలీ స్టాంప్ పేపర్స్ పై పెడతాడు. చాపక్రింద నీరులా సంపాదించుకోవడానికి ఇంతకుమించిన మంచి మార్గం లేదని భావిస్తాడు. పోలీస్ అధికారులను .. అవినీతి రాజకీయ నాయకులను తన వైపుకు తిప్పుకుని, తన అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెడతాడు. 

అయితే ఈ విషయంలో ఒకసారి అతను నిందితుడిగా పట్టుపడతాడు. మిగతా అధికారులు .. రాజకీయనాయకులు తప్పించుకుంటారు. దాంతో ఈ సారి ఆయన మిగతావారి ఆధారాలు తన దగ్గర తప్పకుండా ఉంచాలనే ఒక నిర్ణయానికి వస్తాడు. మునుపటి కంటే వేగంగా తన అక్రమాలను కొనసాగిస్తూ ఉంటాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ .. ఎంతో పకడ్బందీగా మోసాలకు పాల్పడుతూ వెళుతున్న అబ్దుల్ ఒక చిన్న పొరపాటు చేస్తాడు. అదేమిటి? అది అతని జీవితాన్ని ఏ స్థాయిలో కదిలిస్తుంది? అనేదే మిగతా కథ. 

ఈ స్కామ్ బయటపడింది 2003లో. ఈ స్కామ్ చేసిన తెల్గీ జీవితాన్ని దర్శకుడు 1982 నుంచి ఎత్తుకున్నాడు. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. ఇది యథార్థ సంఘటనల సమాహారం కావడం వలన, దర్శకుడు ఎక్కడా కూడా అదనపు ఆకర్షణలు జోడించడానికి ప్రయత్నించలేదు. జరిగిన దానిని జరిగినట్టుగా చూపించడానికే ట్రై చేశాడు తప్ప, స్క్రీన్ ప్లే పరంగా సినిమా టిక్ గా చెప్పాలనే ఆలోచన కూడా చేయలేదు. ఆ కాలం నాటి వాతావరణాన్ని సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించడం వలన కనెక్ట్ అవుతుంది.

'తెల్గీ' పాత్రను ప్రధానంగా చేసుకుని .. ముంబై నేపథ్యంలో నడిచే కథ ఇది. తెల్గీ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. నిజానికి స్టాంప్ పేపర్ స్కామ్ గురించిన విషయంపై కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. మిగతావారికి ఆ స్కామ్ ఎలా జరిగి ఉంటుందనేది తెలియకపోయే అవకాశం ఎక్కువ. అయినా చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు ఆవిష్కరించిన తీరు నచ్చుతుంది. 

డబ్బు కోసం పోలీస్ అధికారులు .. పదవుల వ్యామోహంలో పడి రాజకీయనాయకులు .. ఓ మాదిరి హోదాతో సంతృప్తి చెందకుండా ఉన్నత పదవులను ఆశించి అవినీతి బురదలోకి మేధావులు సైతం ఎలా జారిపోతారు? అందులో నుంచి బయటపడలేక, మోసగాళ్లతో కలిసి తమ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తారు? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ లేవు. కథ అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు పరిగెడుతూనే ఉంటుంది. 

'తెల్గీ' పాత్రలో గగన్ దేవ్ రియార్ జీవించాడు. ఈ సిరీస్ హైలైట్స్ లో ఆయన యాక్టింగ్ ఒకటిగా చెప్పుకోవలసిందే. మిగతా  నటీనటులంతా కూడా తమ పాత్ర పరిధిలో చాలా సహజంగా నటించారు. ఇషాన్ ఛబ్రా  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. స్టాన్లీ ముద్ద కెమెరా పనితనం కథలోని సహజత్వానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఎలాంటి హంగులు .. ఆర్భాటాలు .. అదనపు ఆకర్షణలను జోడించకుండా, సహజత్వానికి పెద్ద పీట వేయడం వలన, ఈ సిరీస్ మంచి మార్కులను దక్కించుకుందనే చెప్పాలి. 

మొదటి 5 ఎపిసోడ్స్ లో 2000 సంవత్సరం వరకూ ఏం జరిగిందనేది చూపించారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఏమిటనేవి నెక్స్ట్ సీజన్ లో చూపించనున్నారు. అంటే అసలైన కథ స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్స్ లోనే ఉందన్న మాట. నవంబర్ లో అన్ని ఎపిసోడ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు కూడా. బయోగ్రఫీ వైపు నుంచి వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. 

Movie Name: Scam 2003

Release Date: 2023-09-01
Cast: Gagan Dev Riar, Mukesh Tiwari, Sana Amin Sheikh, Bharat Jadhav, Shaad Randhawa, Sameer Dharmadhikari
Director: Tushar Hiranandani
Producer: Sameer Nair
Music: Ishaan Chhabra
Banner: Studio NEXT

Scam 2003 Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews