'పోర్ తోళిల్' (సోనీ లివ్) మూవీ రివ్యూ

  • జూన్ 9న థియేటర్లకు వచ్చిన 'పోర్ తోళిల్'
  •  క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ   
  • ఈ రోజు నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ 
  • అందుబాటులో ఉన్న తెలుగు వెర్షన్
  • తక్కువ బడ్జెట్ లో చెప్పిన ఆసక్తికరమైన కథ ఇది.

ఈ మధ్య కాలంలో తమిళంలో చాలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల జాబితాలో 'పోర్ తోళిల్' ఒకటిగా చెప్పుకోవాలి. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా అక్కడ 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది జూన్ 9వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ కే ఆదరణ  ఎక్కువ. మరి ఈ సినిమా ఎలా ఉందన్నది ఇప్పుడు చూద్దాం. 

ప్రకాశ్ (అశోక్ సెల్వన్) చాలా భయస్తుడు .. రాత్రివేళ ఒంటరిగా బయటికి వెళ్లడానికి కూడా భయపడుతూ ఉంటాడు. అలాంటి ఆయన పేరెంట్స్ ఒత్తిడి చేసిన కారణంగా డీఎస్ పీ అవుతాడు. ఫస్టు పోస్టింగ్ చెన్నైలో వస్తుంది .. దాంతో ఆయన డ్యూటీలో చేరతాడు. ఆ సమయంలోనే 'తిరుచ్చి'లో  20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతుల వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. డీజీపీ మహేంద్రన్ (నిళల్ గల్ రవి) ఆ కేసును ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) కి అప్పగిస్తాడు. 

కొత్తగా డ్యూటీలో చేరిన ప్రకాశ్ ను కూడా వెంట తీసుకుని వెళ్లమనీ .. అతనికి శిక్షణ ఇచ్చినట్టుగా ఉంటుందని మహేంద్రన్ అంటాడు. అందుకు అయిష్టంగానే లోకనాథన్ ఒప్పుకుంటాడు. వాళ్లతో పాటు టెక్నీకల్ అసిస్టెంట్ గా వీణ ( నిఖిల విమల్) కూడా బయల్దేరుతుంది. ముగ్గురూ కూడా 'తిరుచ్చి' చేరుకుంటారు. హత్య చేయబడిన యువతులను గురించి ఆరా తీస్తూ .. ఆధారాలను వెదుకుతూ ఉండగానే కొత్తగా వేరే కేసులు నమోదవుతూ ఉంటాయి. దాంతో లోకనాథన్ - ప్రకాశ్ అయోమయంలో పడిపోతారు.

యువతులంతా ఒకే రకమైన పద్ధతిలో చంపబడుతూ ఉండటంతో, హంతకుడు ఒకడే అనే నిర్ధారణకు వస్తారు. కొత్తలో కాస్త భయపడిన ప్రకాశ్, లోకనాథన్ మాటల కారణంగా ప్రభావితుడవుతాడు. తన తీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళుతుంటాడు. 30 ఏళ్ల క్రితం 'తిరుచ్చి'లో ఇలాంటి హత్యలే జరిగాయనీ, అప్పుడు పోలీస్ ఆఫీసర్ గా సెబాస్టియన్ ఉన్నాడని లోకనాథన్ తో ప్రకాశ్ చెబుతాడు. దాంతో ఆయన సెబాస్టియన్ ఇంటికి వెళతాడు.

సెబాస్టియన్ చనిపోయి చాలా కాలమైందని ఆయన కొడుకు కెనడీ (శరత్ బాబు) చెబుతాడు. కెనడీ ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం .. అతని మాట తీరు .. ప్రవర్తన కారణంగా, అతనిపై లోకనాథన్ కి అనుమానం వస్తుంది. ఆ పక్కనే ఉన్న ఇల్లు ఖాళీగా ఉండటంతో, అందులోకి ప్రకాశ్ ను అద్దెకి దింపుతాడు. అలా ప్రకాశ్ ను నిఘా పెట్టిన లోకనాథన్, ఎప్పటికప్పుడు కెనడీ కదలికలను తనకి చెబుతుండమని అంటాడు. ఆ పనిలో ఉన్న ప్రకాశ్ కి కెనడీ గురించి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? కెనడీ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? వరుస హత్యలకు కారణం అతనేనా? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

ఆల్ఫ్రెడ్ ప్రకాశ్ రాసిన కథ ఇది. ఈ కథ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది .. నెమ్మదిగా సస్పెన్స్ ను పెంచుతూ .. వేగాన్ని పెంచుతూ వెళుతుంది. వరుస హత్యలు జరుగుతుంటాయి .. హంతకుడు ఎవరనేది తెలియదు .. విచారణ ఒక కొలిక్కి వస్తుందని పోలీస్ వారు అనుకునే లోగా ట్విస్టుల పై ట్విస్టులు ఉత్కంఠను పెంచుతూ ఉంటాయి. రచయితతో కలిసి దర్శకుడు విఘ్నేశ్ రాజా వేసిన స్క్రీన్న్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం. చాలా తక్కువ పాత్రలతో దర్శకుడు ఈ కథను బలంగా చెప్పడం ఈ సినిమా ప్రత్యేకత. 

ఈ కేసు కోసం రంగంలోకి దిగిన లోకనాథన్ భయమనేది ఎరుగని సీనియర్ పోలీస్ ఆఫీసర్. అతని వెంట ట్రైనీగా వెళ్లిన ప్రకాశ్ మహా భయస్తుడు. డ్యూటీ నుంచి పారిపోవాలనుకున్న ప్రకాశ్, "ఒక్కసారి కూడా బుల్లెట్ పేల్చకుండా తమ సర్వీస్ ను పూర్తి చేసిన పోలీస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. వాళ్లు బుల్లెట్ పేల్చకపోవడానికి కారణం అలాంటి అవకాశం రాకపోవడం వలన కాదు .. ధైర్యం లేక" అనే లోకనాథన్ మాటతో, పౌరుషానికి ప్రకాశ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ప్రకాశ్ పిరికితనం కారణంగా అతనితో పాటు, లోకనాథన్ ఎక్కడ చిక్కుల్లో పడతాడో అనే టెన్షన్ ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటుంది. 

 ఈ కేసు విషయంలో ఇద్దరు ఆఫీసర్స్ కి తలెత్తే సందేహాలు .. ఎదురయ్యే సవాళ్లు .. వాళ్లకి తెలిసే విస్తుపోయే నిజాలు ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తాయి. బలమైన ఫ్లాష్ బ్యాకులు .. కథను మరింత ఇంట్రెస్టింగ్ గా పరుగులు తీస్తుంది. అసలు హంతకుడు ఎవరనేది తేల్చడం .. అతనిని ఎదుర్కోవడం అనే సన్నివేశాలు, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. కెమెరా .. ఎడిటింగ్ వర్క్ కూడా బాగున్నాయి. వీణతో ప్రకాశ్ లవ్ ట్రాక్ వైపు వెళితే కథకి అది అడ్డొచ్చేదే. దర్శకుడు సీరియస్ గా కథను నడిపించడం వల్లనే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. 

ఈ సినిమాలో శరత్ కుమార్ నటన హైలైట్ .. అశోక్ సెల్వన్ కూడా బాగానే చేశాడు. శరత్ బాబు తన చివరి రోజుల్లో చేసిన సినిమా ఇది. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. గతంలో ఇంతకంటే గొప్ప హారర్ థ్రిల్లర్ లు వచ్చి ఉండొచ్చు. కానీ తక్కువ ఖర్చుతో .. తక్కువ పాత్రలతో .. అందునా ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ పాత్రలే ప్రధానంగా ఈ కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడమీ ఈ సినిమా ప్రత్యేకత. 

కుటుంబంలో చోటుచేసుకునే కొన్ని సమస్యలు .. అవి కొంతమంది మనుషులను ఎలా మారుస్తాయి? ఎలాంటి విపరీతాలకు కారణమవుతాయి? అనే సందేశం కూడా ఇందులో అంతర్లీనంగా కనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ ను ఇష్టపడేవారికి, 'సోనీ లివ్'లో అందుబాటులో ఉన్న ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పచ్చు. 

Movie Name: Por Thozhil

Release Date: 2023-08-11
Cast: Sarathkumar, Ashok Selvan, Nikhila Vimal, Sarath Babu
Director: Vignesh Raja
Producer: Sameer Nair - Deepak Segal
Music: Jakes Bejoy
Banner: Applause - E4 Experiments

Por Thozhil Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews