'ఎవరు' మూవీ రివ్యూ

ఒక తప్పు అనేక తప్పులు చేయడానికి కారణమవుతుంది. విలాసవంతమైన జీవితంపట్ల ఆశ .. విషాదం వైపు నడిపిస్తుందనే రెండు సత్యాలను చాటిచెప్పే కథ ఇది. అనుక్షణం ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలతో .. అనూహ్యమైన మలుపులతో సాగిపోయే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆ తరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
తెరపై ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యకి కారకులు ఎవరు? ఆ హత్యకి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే విషయాల చుట్టూ తిరిగే కథలు గతంలో చాలానే వచ్చాయి. ఇదే తరహా కథ అయినప్పటికీ మరిన్ని ట్విస్టులతో .. మరింత ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఎవరు'. ఈ తరహా కాన్సెప్టు సినిమాలతో ఎక్కువ మార్కులు కొట్టేస్తూ వస్తోన్న అడివి శేష్, 'ఎవరు'తో ఏ స్థాయిలో మెప్పించాడనేది చూద్దాం.

ఈ కథ తమిళనాడులోని 'కూనూరు'లో జరిగే ఓ హత్యతో మొదలవుతుంది. హంతకురాలిగా సమీర (రెజీనా) పట్టుబడుతుంది. ఈ కేసుకి సంబంధించిన విచారణ నిమిత్తం పోలీస్ ఆఫీసర్ విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) రంగంలోకి దిగుతాడు. ఆయన ప్రశ్నలకి సమాధానంగా సమీర నోరు విప్పుతుంది. సమీర విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటుంది. రాహుల్ అనే శ్రీమంతుడైన వ్యాపారవేత్తతో ప్రేమలో పడుతుంది. రాహుల్ 'గే' అని తెలిసినా, ఆయన సంపదను చూసి పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత సమీరకి ఆమెతో పాటు కాలేజ్ లో చదువుకున్న అశోక్ (నవీన్ చంద్ర) తారసపడతాడు. పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న అతని సాన్నిహిత్యాన్ని సమీర కోరుకుంటుంది. ఇద్దరూ కలిసి ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకుంటారు. అక్కడే ఆమె అతణ్ణి హత్య చేస్తుంది. అందుకు గల కారణాలతో ఈ కథ అనేక మలుపులు తీసుకుంటుంది.

ఒక లైన్ గా చెప్పుకుంటే ఈ కథ చాలా సాధారణమైనదనే అనిపిస్తుంది. కానీ దర్శకుడు వెంకట్ రాంజీ ఈ కథను ఎంతో పకడ్బందీగా అల్లుకున్నాడు .. కథనాన్ని ఎంతో పట్టుగా నడిపించాడు. కథనాన్ని అనేక మలుపులు తిప్పుతూ ఆ మలుపులన్నిటిని కలిపిన తీరు ప్రేక్షకులను కదలకుండా చేస్తుంది. కథనానికి అడ్డుతగలకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఎక్కడా కామెడీకిగాని .. పాటలకి గాని చోటివ్వలేదు. అయినా సన్నివేశాల్లోని బలం కారణంగా అదో వెలితిగా అనిపించదు. ఎక్కడా అయోమయానికి .. గందరగోళానికి తావు లేకుండా, ఆసక్తికరంగా స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకోవడం ఆయన ప్రత్యేకతగా అనిపిస్తుంది. రెజీనా .. అడివి శేష్ .. నవీన్ చంద్ర పాత్రలను దర్శకుడు మలిచిన తీరు, వాటిని తెరపై సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన తీరు బాగుంది.

అడివి శేష్ ఈ సినిమాలో చేసిన పాత్ర విభిన్నంగా అనిపిస్తుంది. సమీర నుంచి నిజాలు రాబట్టే పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఆయన కెరియర్లో గుర్తుండిపోయేదే అవుతుంది. ఈ పాత్రను ఆయన చాలా డీసెంట్ గా .. నీట్ గా చేశాడు. ఇక సమీర పాత్రలో రెజీనా జీవించింది. పాత్ర స్వభావానికి తగినట్టుగా చకచకా హావభావాలు మార్చేస్తూ మెప్పించింది. గత చిత్రాల్లో కంటే ఈ సినిమాలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించింది. తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే పోలీస్ ఆఫీసర్ అశోక్ పాత్రలో నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంటుంది. ఇక వినయ్ వర్మ పాత్రలో మురళీశర్మ తెరపై కనిపించేది కొంతసేపే ఆయినా, ఆయన నటనలోని సహజత్వం మనసుకు హత్తుకుంటుంది.

రీ రికార్డింగ్ ఈ సినిమాకి మరింత బలాన్నిస్తూ మరోస్థాయికి తీసుకెళ్లింది. వంశీ పచ్చిపులుసు ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా మురళీశర్మ ఎపిసోడ్ కి సంబంధించిన వర్షం సన్నివేశాలను ఆయన చాలా ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. కథ .. కథనం .. సన్నివేశాల్లోని సహజత్వం ఈ సినిమాకి ప్రధానమైన బలమనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఇంటర్వెల్ కి ముందు వచ్చే రెండు ట్విస్టులు .. ఆ తరువాత వచ్చే నాలుగు ట్విస్టులను కూడా ప్రేక్షకులు ఎంతమాత్రం ఊహించరు. ఈ విధంగా కథను అల్లుకోవడంలోనే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫైనల్ గా ఇచ్చిన ట్విస్టుతో ఆయన ఈ కథను ఒక స్థాయిలో నిలబెట్టేశాడు. డ్యూయెట్లు .. కామెడీ వంటి వినోదంపాళ్లు లేకపోయినా, పెర్ఫెక్ట్ కంటెంట్ తో ఆకట్టుకునేదిగా 'ఎవరు' కనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారి నుంచి మరిన్ని మార్కులు కొట్టేస్తుంది.      

Movie Name: Evaru

Release Date: 2019-08-15
Cast: Adivi Sesh, Regina, Naveen Chandra, Murali Sharma, Pavitra Lokesh
Director: Venkat Ramji
Producer: Param V Potluri, Kaven Anne
Music: Sricharan Pakala
Banner: PVP Cinema

Evaru Rating: 3.00 out of 5


More Movie Reviews