'కాఫస్' - (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ

  • మారుతున్న సమాజానికి అద్దం పట్టే 'కఫస్'
  • కథ .. స్క్రీన్ ప్లే ప్రధానమైన బలంగా సాగే వెబ్ సిరీస్ 
  • పాత్రలను డిజైన్ చేసిన తీరే ప్రత్యేకమైన ఆకర్షణ 
  • సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు 
  • 2.. 3.. 5 ఎపిసోడ్స్ బ్యాంగ్స్ హైలైట్

ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన వెబ్ సిరీస్ లు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైన ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా సమాజం .. కుటుంబం .. బంధాలు .. ఎమోషన్స్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ లు చాలా అరుదుగా వస్తున్నాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఈ నెల 23వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది .. దాని పేరే 'కాఫస్'. సమీర్ నాయర్ .. దీపక్ .. సాహిల్ సంఘ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, సాహిల్ సంఘ దర్శకత్వం వహించాడు. సీజన్ 1లో భాగంగా 6 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ ముంబైలో మొదలవుతుంది .. రాఘవ (శర్మన్ జోషి) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఉద్యోగి. ఆయన భార్య 'సీమ' (మోనా సింగ్)  బ్యూటీ పార్లర్ లో పనిచేస్తూ ఉంటుంది. వారి సంతానమే సన్నీ (మిఖైల్ గాంధీ).. శ్రేయ (తేజస్వి) ఇద్దరూ కూడా టీనేజ్ లో ఉంటారు .. చదువుకుంటూ ఉంటారు. తమ ఆర్ధిక పరిస్థితులు దార్లో పడాలనే ఉద్దేశంతో, సన్నీని యాక్టింగ్ దిశగా సీమ ప్రోత్సహిస్తుంది. దాంతో అతనికి స్టార్ హీరో విక్రమ్ బజాజ్ (వివాన్ భాటేన)  కొడుకుగా నటించే అవకాశం వస్తుంది. శ్రీలంకలో షూటింగు గ్యాపులో సన్నీపట్ల ఆ హీరో అసభ్యంగా ప్రవర్తిస్తాడు.

ఆ హీరో 'గే' అని తెలుసుకున్న సన్నీ, తనని అతను ఇబ్బంది పెడుతున్న ఓ సంఘటనను సీక్రెట్ గా వీడియో రికార్డు చేస్తాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ వీడియోను పేరెంట్స్ కి చూపిస్తాడు. వాళ్లు విక్రమ్ బజాజ్ పై కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే, పెద్దవాళ్లతో గొడవపడి నెగ్గలేరని ఆ లాయర్ ఆపేస్తాడు. అప్పటి నుంచి సన్నీ .. రాఘవ .. సీమ మధ్యనే ఆ విషయం ఉంటుంది. ఈ కారణంగానే, యాక్టింగ్ పట్ల ఆసక్తితో ఉన్న శ్రేయను వాళ్లు వారిస్తూ ఉంటారు.

జరిగిన సంఘటనను 'ఇర్ఫాన్' అనే ఒక జర్నలిస్ట్ కి చెబుదామని రాఘవ అతనికి కాల్ చేస్తాడు. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకుంటాడు. అప్పటి నుంచి అసలు విషయమేమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాఘవను ఇర్ఫాన్ వెంటాడుతూనే ఉంటాడు. ఓ రోజున విక్రమ్ చేసిన పనిని గురించి ఆయన భార్యకి 'తాన్యా' (ప్రీతీ జింగానియా)కి సీమ చెబుతుంది. దాంతో సన్నీ పేరెంట్స్ కి విక్రమ్ 10 కోట్లు ఇచ్చేసి, ఇక పై ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడకుండా డబ్బు అనే 'పంజరం'లో వాళ్లను బంధిస్తాడు.

అలా వచ్చిన 10 కోట్లతో రాఘవ ఫ్యామిలీ ఆర్ధిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే రాఘవ మొదటి భార్య కొడుకు 'యశ్' కి సన్నీతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇదే సమయంలో 'కునాల్' అనే కుర్రాడితో శ్రేయ ప్రేమలో పడుతుంది. ఇక ఏ విక్రమ్ బజాజ్ కి తన కొడుకును దూరంగా ఉంచాలని రాఘవ అనుకున్నాడో, అతని కొడుకు అగస్త్యతోనే సన్నీకి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది.

ఇక సన్నీకి సంబంధించిన సీక్రెట్ ను తప్పనిసరి పరిస్థితుల్లో శ్రేయతో తల్లి చెబుతుంది. సన్నీ ఫోన్ ద్వారా ఆ సీక్రెట్ యశ్ కి తెలుస్తుంది. తాను ప్రేమిస్తున్న కునాల్ కి శ్రేయ ఈ విషయం చేరవేస్తుంది. జరిగిన సంఘటన గురించి ఎక్కడా ఎవరితోనూ చెప్పమని రాఘవ దంపతులు విక్రమ్ దగ్గర 10 కోట్లు తీసుకుంటే, వాళ్లకి తెలియకుండానే ఈ సంగతి ఒకరి నుంచి ఒకరికి వెళ్లిపోతుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? అది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? అనేదే కథ.

ఈ కథలో బలం ఉంది .. కథనంలో ఆసక్తి ఉంది .. కుటుంబ సభ్యుల మధ్య ఎమోషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులను మొదటి నుంచి చివరివరకూ తమతో తీసుకుని వెళతాయి. దర్శకుడు తాను అల్లుకున్న కథలో .. స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడా తడబడలేదు. ఆయనకి గల క్లారిటీ ఏమిటనేది పెర్ఫెక్ట్ గా ఉన్న ఈ కంటెంట్ చెబుతుంది. సంభాషణలు కూడా బాగున్నాయి. ఎక్కడా కూడా ఇది అనువాదమనే ఆలోచన రాదు. అంత పట్టుగా సన్నివేశాలు కలిసి సాగుతాయి. 

ఈ కథలో విక్రమ్ బజాజ్ ఫ్యామిలీ ఒక వైపు .. రాఘవ ఫ్యామిలీ ఒక వైపు ప్రధానంగా కనిపిస్తాయి. తాను చేసిన తప్పు బయటికి రాకుండా డబ్బుతో కవర్ చేయాలని విక్రమ్ అనుకుంటే, ఆ డబ్బుకు ఆశపడకుండా ముందుకు వెళ్లలేని స్థితిలో రాఘవ ఫ్యామిలీ ఉంటుంది. ఈ సమయంలో రాఘవ ఫ్యామిలీ అనుభవించే మానసిక సంఘర్షణను దర్శకుడు గొప్పగా ఆవిష్కరించాడు. అలాగే డబ్బుతో వాళ్లను విక్రమ్ బజాజ్ డీల్ చేసే ఎపిసోడ్ ను కూడా గొప్పగా డిజైన్ చేశాడు. 

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నడిపించడానికి పేరెంట్స్ ఎంత కష్టపడుతుంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతలా తపన పడుతుంటారు? పిల్లలు దారితప్పకుండా చూసుకోవడంలో వాళ్లు ఎంత టెన్షన్ పడుతుంటారు? అనే అంశాలను చాలా సహజత్వంతో కనెక్ట్ చేశారు. ఆర్టిస్టులంతా కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. నిర్మాణపరమైన విలువలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. టేకింగ్ .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం. 

*ఎక్కడ ఏ విషయాన్ని ఎంతవరకూ చెప్పాలో .. అంతవరకే చెప్పడం వలన, మైనస్ పాయింట్స్ చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ కనిపించవు. కథాకథనాలే ప్రధానమైన బలంగా సాగిన వెబ్ సిరీస్ ఇది. పాత్రలను మలిచిన తీరు .. సహజత్వంతో కూడిన సన్నివేశాలే ఈ వెబ్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పచ్చు. 

Movie Name: Kafas

Release Date: 2023-06-23
Cast: Sharman Joshi, Vivan Bhathena, Mikail Gandhi, Tejaswi, Preethi Jhangiani, Mona Singh
Director: Sahil Sangha
Producer: Sameer Nair- Deepak
Music: -
Banner: Madiba Entertainments

Kafas Rating: 3.25 out of 5

Trailer

More Movie Reviews