'అసుర్ 2' (జియో వెబ్ సిరీస్) రివ్యూ

  • ఆసక్తికరమైన కథాకథనాలు . ఆకట్టుకునే ప్రధానమైన పాత్రలు 
  • సీబీఐ వైపు నుంచి సాగే ఇన్వెస్టిగేషన్ హైలెట్
  • పాల్ పాత్ర ఎంట్రీ విషయంలో అనవసరమైన హడావిడి  
  • అదనపు బలంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ
  • లోతైన సంభాషణల అనువాదంలో కనిపించే కన్ఫ్యూజన్

ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో 'అసుర్ 2' ఒకటి. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్టు సీజన్ మూడేళ్ల క్రితం 'ఊట్' ఓటీటీలో వచ్చింది. ఇక సీజన్ 2కి సంబంధించిన 8 ఎపిసోడ్స్ ను జూన్ 1 నుంచి 7వ తేదీవరకూ ఒక్కో ఎపిసోడ్ ను 'జియో సినిమా'లో స్ట్రీమింగ్ చేస్తూ వచ్చారు. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలకి పైగా నిడివికలిగి ఉన్నాయి. ఫస్టు సీజన్ లో IMDB నుంచి 10కి 8.5 రేటింగ్ తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్, సీజన్ 2లో ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

శుభ్ జోషి( విశేషన్ బన్సాల్) చిన్నప్పటి నుంచి ఒక చిత్రమైన మానసిక ప్రవృత్తిని కలిగి ఉంటాడు. అసురులు మంచివారనీ .. వారిని ఈ సమాజం చెడ్డవారిగా భావిస్తోందని ఆవేదన చెందుతూ ఉంటాడు. అసురులను అర్థం చేసుకోవడానికి ఈ ప్రపంచం ప్రయత్నించడం లేదనీ, తన సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారికి తానే ముక్తిని (మరణాన్ని) ప్రసాదించాలనే నిర్ణయానికి వస్తాడు. జైలులో ఉన్న తాను ముగ్గురు సన్నిహితులతో కలిసి తప్పించుకుంటాడు. 

వయసుతో పాటు శుభ్ జోషి లోని అసుర ప్రవర్తన పెరుగుతూ పోతుంది. తన మాటల మాయతో బలహీనులను వశపరచుకుంటూ .. తన సిద్ధాంతం తప్పని చెప్పిన వారిని చాలా తేలికగా చంపేస్తూ ముందుకు వెళుతుంటాడు. తాను చెప్పదలచుకున్నది 'మాస్క్' ద్వారా చెబుతుంటాడు. ఆయన ఏ క్షణంలో ఎక్కడ ఎలాంటి హింసకు పాల్పడతాడోననే టెన్షన్ తో, అతణ్ణి పట్టుకునే పనిలో సీబీఐ తలమునకలవుతూ ఉంటుంది. శుభ్  కారణంగా తన కూతురు 'రియా'ను కోల్పోయిన సీబీఐ ఆఫీసర్ నిఖిల్ నాయర్ (బరున్ సోబ్తి) అతణ్ణి పట్టుకోవాలనే పట్టుదలతో ఉంటాడు.

ఇక శుభ్ కారణంగానే సస్పెండ్ చేయబడిన మరో సీబీఐ ఆఫీసర్ ధనుంజయ్ ( అర్షద్ వర్సి) కూడా అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి తన వైపు నుంచి పోరాటాన్ని మొదలుపెడతాడు. నిఖిల్ టీమ్ లో నుస్రత్ (నిధి) ఇషాని (అదితి), స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన పాల్ (మియాంగ్ ఛాంగ్)  సిన్సియర్ ఆఫీసర్స్ గా ఉంటారు. అదే టీమ్ లో పనిచేస్తున్న రసూల్ (అమేయ్) ధోరణి, 'ఇషాని'కి అనుమానాన్ని కలిగిస్తుంది. అతని ద్వారా శుభ్ జోషికి విషయాలు లీక్ అవుతూ ఉండొచ్చుననే సందేహాన్ని ఆమె నిఖిల్ దగ్గర వ్యక్తం చేస్తుంది. 

ఆ మరునాడు రసూల్ కి సంబంధించిన మరింత సమాచారం రాబట్టడానికి ఇషాని ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని రసూల్ పసిగట్టడం .. ఒక ప్లాన్ ప్రకారం ఆమెను అంతం చేయడం జరిగిపోతాయి. దాంతో  రసూల్ గురించిన  వివరాలను నిఖిల్ రహస్యంగా సేకరించడం మొదలుపెడతాడు. గతంలో శుభ్ జోషితో పాటు జైలు నుంచి తప్పించుకున్న ముగ్గురిలో ఒకరైన బల్వీర్ నే ఈ రసూల్ అని తెలుసుకుంటాడు. 

తన గురించి తెలిసిపోవడంతో రసూల్ తన నిజస్వరూపం చూపించడం మొదలుపెడతాడు. అప్పటివరకూ ముసుగులో ఉంటూ వచ్చిన శుభ్ జోషి, తన వికృత చేష్టలను పతాకస్థాయికి తీసుకుని వెళతాడు. అందులో భాగంగా ప్రాజెక్టు 'రుద్రాక్ష' .. 'అశ్వనీ నక్షత్ర' .. 'అశ్వద్ధామ' వంటి పేర్లతో శుభ్ జోషి ఎలాంటి హింసాయుత కార్యక్రమాలకు పాల్పడతాడు? ఆయన విసిరే సవాళ్లను సీబీఐ ఎలా ఎదుర్కొంటుంది? అనేదే మిగతా కథ. 

'అసుర' టైటిల్ కి తగినట్టుగానే దర్శకుడు ప్రధానమైన పాత్రను హింసవైపు నడిపించుకుంటూ వెళ్లాడు. అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రాణాలను .. కుటుంబాలను సైతం పణంగా పెట్టిన సీబీఐ ఆఫీసర్స్ అంకితభావాన్ని ఆవిష్కరించుకుంటూ వెళ్లాడు. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. నిడివి కాస్త ఎక్కువగా అనిపించినా, సీబీఐ ఎంక్వైరీలో భాగంగా కథ ఒక చోటు నుంచి మరో చోటికి వెళుతూ ఉంటుంది గనుక బోర్ కొట్టదు. కాకపోతే స్పెషల్ ఆఫీసర్ గా 'పాల్' పాత్ర ఎంట్రీ విషయంలో అనవసరమైన హడావిడి కనిపిస్తుంది. 

ఈ వెబ్ సిరీస్ కథాపరిథి ఎక్కువ ... అందువలన పాత్రల సంఖ్య ఎక్కువ. ప్రధానమైన పాత్రలలో, ఎవరికివారు న్యాయం చేశారు. బరున్ .. అదితి నటనకి ఎక్కువ మార్కులు పడతాయి. ఇక సాంకేతిక వర్గం విషయానికొస్తే, ధర్మరాజ్ భట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పాలి. ఆ తరువాత స్థానం ఫొటోగ్రఫీకి దక్కుతుంది. రామానుజ దత్త కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఫారెస్ట్ నేపథ్యంలో సీన్స్ ను .. సీబీఐ ఆఫీసర్స్ ఎటాక్ చేసే సీన్స్ ను చిత్రీకరించిన తీరు బాగుంది. చారు థక్కర్ ఎడిటింగ్ కూడా ఓకే.

ప్లస్ పాయింట్స్: కథాకథనాలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్:
  అసుర పాత్ర పోషించిన వ్యక్తి ఒక సైకో తరహాలోనే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ విషయం అతని ప్రవర్తన వలన అర్థమవుతూ ఉంటుంది. కానీ అతని సంభాషణలు మన ఆలోచనలకు అందవు. ఆయన ఉద్దేశం ఏమిటి? ఏం కోరుకుంటున్నాడు? అనే విషయంలో మరింత క్లారిటీ ఇస్తే బాగుండునని అనిపిస్తుంది. ఒకవేళ అనువాదం వలన ఆయన భావజాలం మనకు సరిగ్గా అందలేదా? అనేది అర్థంకాదు. 

Movie Name: Asur 2

Release Date: 2023-06-02
Cast: Arshad Warsi, Barun Sobti, Vishesh Bansal, Ridhi Dogra,Amey Wagh, Meiyang Chang, Adithi Kalkunte
Director: Oni Sen
Producer: Sejal Shah- Bhavesh
Music: Dharmaraj Bhat
Banner: Reliance Entertainment

Asur 2 Rating: 3.25 out of 5

Trailer

More Movie Reviews