'స్కూల్ ఆఫ్ లైస్' - (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

  • ఆసక్తికరమైన కథతో వచ్చిన 'స్కూల్ ఆఫ్ లైస్'
  • కథనాన్ని నడిపించిన తీరుకి మంచి మార్కులు
  • అసహనాన్ని కలిగించే అనవసరమైన సన్నివేశాలు
  • 6 ఎపిసోడ్స్ కథను 8 ఎపిసోడ్స్ వరకూ లాగిన తీరు 
  • షార్ప్ గా ట్రిమ్ చేసి ఉంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించే వెబ్ సిరీస్

సాధారణంగా వెబ్ సిరీస్ లకు కావలసిన కంటెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ల నుంచి ఎక్కువగా వస్తుంటుంది. కానీ ఒక స్కూల్ నేపథ్యంలో నడిచే కంటెంట్ తో వెబ్ సిరీస్ లు రావడమనేది చాలా తక్కువ. వెబ్ సిరీస్ లో నటించే పిల్లల నుంచి మంచి అవుట్ ఫుట్ ను రాబట్టాలి .. ఈ వెబ్ సిరీస్ పిల్లలతో పాటు పెద్దలు కూడా చూసేదిలా ఉండాలి. అలాంటి ఒక ప్రయత్నంగా .. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో  వచ్చిన వెబ్ సిరీస్ 'స్కూల్ ఆఫ్ లైస్'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో నిన్నటి నుంచి 8 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. 

కథలోకి వెళితే .. ఫారెస్టు ప్రాంతానికి సమీపంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా శ్రీమంతుల పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అనుమతి లేకుండా పిల్లలు గేటు దాటి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. పిల్లలందరికి సంబంధించిన వ్యవహారాలను శామ్యూల్ (ఆమీర్ బషీర్)- నమిత (నమ్రత కౌర్) చూసుకుంటూ ఉంటారు.  చిన్నపిల్లలకు సంబంధించిన బాధ్యతను స్టూడెంట్స్ లో సీనియర్స్ కు అప్పగిస్తాడు శామ్యూల్.

సీనియర్ స్టూడెంట్స్ లో విక్రమ్ (వరిణ్ రూపాని) .. తపన్ (ఆర్యన్ సింగ్) పట్ల శామ్యూల్ కి ఎక్కువ అభిమానం ఉంటుంది. ఆ ఇద్దరి పట్ల ఆయన ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతూ ఉంటాడు. అదే స్కూల్లో జూనియర్ బ్యాచ్ లో శక్తి  అనే కుర్రాడు చదువుకుంటూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు మనస్పర్థల వలన విడిపోతారు. అతని తల్లి ఆదిల్ అనే వ్యక్తితో చనువుగా ఉంటూ ఉంటుంది. ఆమెనే ఆ స్కూల్లో శక్తిని చేరుస్తుంది. 

ఓ రోజున అనుకోకుండా శక్తి కనిపించకుండాపోతాడు. దాంతో అందరూ ఆందోళనకి లోనవుతారు. తన కొడుకును వెతికి తనకి అప్పగించవలసిందేనని త్రిష పాండే (గీతికా వైద్య) పట్టుపడుతుంది. దాంతో  పోలీస్డ్ డిపార్టుమెంట్ నుంచి రావత్ - ప్రకాశ్ రంగప్రవేశం చేస్తారు. శక్తి గురించి అతనితో చనువుగా ఉండే పిల్లలందరినీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు . అదే కాలేజ్ లో భోలా (నితిన్ గోయెల్) తోటమాలిగా పనిచేస్తూ ఉంటాడు. అతను సీనియర్ స్టూడెంట్స్ కి రహస్యంగా గంజాయి అమ్ముతుంటాడు. 

బోలాకి విక్రమ్ - తపన్ చాలా భయపడుతూ ఉంటారు. అతను వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ తరచూ డబ్బు గుంజుతూ ఉంటాడు. ఇక స్కూల్ కి సంబంధం లేని ఒక కుర్రాడితో ఫారెస్టు వైపుకు శక్తి వెళ్లినట్టుగా పోలీసులకు తెలుస్తుంది. దాంతో వాళ్లు ఆ ప్రాంతంలో వెదకడం మొదలెడతారు. ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి చేదు నిజాలు తెలుస్తాయి? అప్పుడు వాళ్లు  ఏం చేస్తారు? అనేదే మిగతా కథ. 

దర్శకుడు అవినాశ్ అరుణ్ ఈ కథను అల్లుకున్న తీరు బాగుంది. ఒక వైపున స్టూడెంట్స్ .. మరో వైపున ఫారెస్టు వైపుగా వెళ్లిన స్టూడెంట్ జాడ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పోలీస్ డిపార్టుమెంట్ .. ఇంకో వైపున ఆ స్కూల్ నిర్వాహకులు .. పిల్లలకి చెందిన పేరెంట్స్. ఇలా నాలుగు వైపుల నుంచి ఈ కథ ప్రతి ట్రాక్ ను టచ్ చేస్తూ ఆసక్తికరమైన మలుపులతో ముందుకు వెళుతూ ఉంటుంది. కథను .. కథనాన్ని కూడా దర్శకుడు నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

స్క్రీన్ ప్లే పరంగా ఏ ఎపిసోడ్ లో ఏ ప్రధానమైన పాత్ర కూడా మిస్సవ్వదు. కాకపోతే మరీ డీటేల్డ్ గా చెప్పడం వలన కాస్త అసహనం కలుగుతుంది. శామ్యూల్ - అతని అన్నయ్యకి సంబంధించిన సీన్స్, నమిత - ఆమె తండ్రి నేపథ్యంలో సీన్స్ అనవసరం అనిపిస్తాయి. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వాటిని ఆవిష్కరించిన విధానం బాగుంది. ఆర్టిస్టులంతా కూడా సహజత్వానికి చాలా దగ్గరగా తమ పాత్రలను తీసుకుని వెళ్లగలిగారు. పరిధిని దాటి ఏ పాత్ర వెళ్లకపోవడం చూడొచ్చు.  

ఈ  కథాకథనాల తరువాత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి మరో రెండు బలమైన పిల్లర్స్ గా కనిపిస్తాయి. ఫారెస్టు నేపథ్యంలోని సీన్స్ ను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక మోనీషా ఎడిటింగ్ విషయానికి వస్తే, కొన్ని కాంబినేషన్స్ లోని సీన్స్ ను పక్కన పెట్టేయవచ్చు. అలా సెట్ చేసుకుంటే, 8 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ కథను 6 ఎపిసోడ్స్ లో చెప్పేయవచ్చు. అలా టైట్ కంటెంట్ తో వచ్చి ఉంటే మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. 

చిన్న పిల్లల స్వభావం .. వాళ్ల మాటతీరు .. అల్లరి పనులు .. అమాయకత్వంతో చేసే పనులు .. టీనేజ్ పిల్లల లవ్ .. వాళ్లు తీసుకునే నిర్ణయాలు .. తొందరపాటు ఆలోచనలు  .. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. అలాగే కథకి తగిన లొకేషన్స్ ఎంపిక కూడా సహజత్వానికి మరింత తోడైంది. ఎటొచ్చి నిదానంగా కథను నడిపించే విధానమే తెలుగు ఆడియన్స్ కి కాస్త చిరాకు తెప్పిస్తుంది తప్ప, కాస్త ఓపిక చేసుకుని చూస్తే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్:
కథ .. లొకేషన్స్ .. పాత్రలను మలచిన తీరు .. ఎమోషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .. ఫొటోగ్రఫీ .. ఆర్టిస్టుల సహజమైన నటన. 

మైనస్ పాయింట్స్: అనవసరమైన .. సాగదీసిన సన్నివేశాలు. రెండు మూడు చోట్ల డబ్బింగ్ చెప్పకుండానే వదిలేయడం. 

Movie Name: School Of Lies

Release Date: 2023-06-02
Cast: Nimrat Kaur, Aamir Bashir, Aryan Singh, Varin Roopani, Vir Pachisia, Geethika Vaidya
Director: Avinash Arun
Producer: Sameer Gogate
Music: -
Banner: BBC Studios

School Of Lies Rating: 3.00 out of 5


More Movie Reviews