'సిటీ ఆఫ్ డ్రీమ్స్' - వెబ్ సిరీస్ (సీజన్ 3) రివ్యూ

  • పొలిటికల్ డ్రామా నేపథ్యంలో 'సిటీ ఆఫ్ డ్రీమ్స్'
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన 'సీజన్ 3'
  • బలమైన కథ .. భారీ తారాగణం ప్రత్యేక ఆకర్షణ 
  •  తాపీగా .. నిదానంగా నడిచే కథనం
  • అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేసిన వెబ్ సిరీస్ 
  • కథకి తగినట్టుగా అనిపించే క్లైమాక్స్     

రాజకీయాలు .. పదవీ కాంక్ష .. అధికార వ్యామోహం .. వెన్నుపోట్లు .. వీటినన్నిటినీ తప్పించుకుంటూ, జనానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లే మంత్రులు .. అధికారులు లేకపోలేదు. అయితే నిజాయతీతో ఆ దిశగా పోరాటం చేసేవారు ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎన్నో త్యాగాలను చేయవలసి ఉంటుంది .. మరెన్నింటినో కోల్పోవలసి ఉంటుంది. అలాంటి ఒక కథతో రూపొందిన వెబ్ సిరీస్ 'సిటీ ఆఫ్ డ్రీమ్స్ - సీజన్ 3'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 26 నుంచి అందుబాటులో ఉన్న 9 ఎపిసోడ్స్ లో ఏముందనేది ఇప్పుడు చూద్దాం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్ణిమారావు గైక్వాడ్ (ప్రియా బపత్) ఉంటుంది. ఆమె తండ్రి అమేయరావు గైక్వాడ్ (అతుల్ కులకర్ణి) కూడా రాజకీయాలలో ఆరితేరినవాడే. తండ్రీకూతుళ్ల స్వభావాలు చాలా విరుద్ధంగా ఉంటాయి. జనానికి మంచి చేయడానికి అధికారం కావలి అనేది కూతురు అభిప్రాయం. అధికారం కోసం అరాచకశక్తులతో చేతులు కలుపుతూ, జనాలను మభ్యపెడుతూ అధికారాన్ని అనుభవించాలనేది తండ్రి ఆలోచన. 

ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో పూర్ణిమ కొడుకు అతుల్ చనిపోతాడు. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి తన తండ్రి కారణమని భావించిన పూర్ణిమ, అతని పట్ల కోపంతో ముంబైను విడిచి 'గోవా' వెళ్లిపోతుంది. దాంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆమె తండ్రి ఉంటాడు. మూడు నెలలు గడిచినా పూర్ణిమ తిరిగి రాకపోవడంతో, ఆమె ఆచూకీ తెలుసుకుని తీసుకురమ్మని అమేయరావు రహస్యంగా వసీమ్ ఖాన్(ఇజాజ్ ఖాన్) ను రంగంలోకి దింపుతాడు. ముంబైలో పట్టుబడిన వెయ్యి కేజీల కొకైన్ కేసు కూడా అతనికి అప్పగించబడి ఉంటుంది. 

గతంలో పూర్ణిమతో మంచి స్నేహబంధం ఉన్న వసీమ్ ఖాన్, ఆమె కోసం గాలిస్తూ బ్యాంకాక్ చేరుకుంటాడు. అక్కడ ఆమె ఆచూకీ తెలుసుకుని, అతి కష్టం మీద కలుసుకుంటాడు. తన కొడుకు చనిపోయిన తరువాత తనకి ఎలాంటి పదవీ వ్యామోహాలు లేవని ఆమె చెబుతుంది. కానీ ప్రస్తుతం మహారాష్ట్ర ఉన్న పరిస్థితుల్లో ఆమె వంటి నిజాయితీ గల ముఖ్యమంత్రి అవసరం ఎంతో ఉందని ఆయన నచ్చజెబుతాడు.

అయితే అమేయరావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన జగదీశ్ (సచిన్)కి తాను ముఖ్యమంత్రిని కావాలనే ఒక బలమైన కోరిక ఉంటుంది. అందువలన ఎలాంటి పరిస్థితుల్లోనూ పూర్ణిమ తిరిగి రాకూడదని అతను భావిస్తాడు. ఇక అమేయరావుతో శత్రుత్వం ఉన్న జగన్ (సుశాంత్ సింగ్) అనే మాఫియా లీడర్ .. ఒక న్యూస్ ఛానల్ కి చెందిన ఛైర్మన్ .. విభా (దివ్య సేథ్) ఇక గైక్వాడ్ ల అధికారం  కొనసాగకూడదనే ఉద్దేశంతో కుతంత్రాలు చేస్తుంటారు. వారి వ్యూహాలు ఫలిస్తాయా? పూర్ణిమ తాను అనుకున్నది సాధించగలుగుతుందా? అనేది మిగతా కథ. 

తెలుగులో 'గుడ్ లక్ సఖి' సినిమాను తీసిన నాగేశ్ కుకునూర్, 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' వెబ్ సిరీస్ కి రచయిత - దర్శకుడు. పొలిటికల్ డ్రామా జోనర్లో ఆయన చేసిన ఈ వెబ్ సిరీస్ లో ఇది 'సీజన్' ఒక వైపున రాజకీయాలు .. మరో వైపున మాఫియా ముఠాలు .. అధికారులలో అవినీతి .. రాజకీయ నాయకులలో స్వార్థం .. తమకి అనుకూలంగా లేని అవతలివారిని లేపేయడానికి జరుగుతున్న పోరాటం .. ఈ మధ్యలో ఒక డెలివరీ బాయ్ లవ్ స్టోరీ. ఈ అంశాలను కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది.

కూతురుపై ఒట్టేసి అబద్ధం చెప్పే తండ్రి .. తాను ప్రేమించిన అమ్మాయి కోసం అతిపెద్ద నిజాన్ని బయటపెట్టిన  ఒక సాధారణ ప్రేమికుడు. నమ్మిన ఫ్యామిలీని మోసం చేసే ఒక బాబాయ్ .. కొన్ని రోజులు ప్రేమించుకున్నందుకే ప్రాణత్యాగం చేసిన ఓ సాధారణ యువతి. తన కూతురుకి తాను మాత్రమే దిక్కు అని తెలిసినా, సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలకు తెగించిన ఒక పోలీస్ ఆఫీసర్. తన తండ్రి మాట కంటే .. ఒక పోలీస్ ఆఫీసర్ మాటను నమ్మిన ఒక ముఖ్యమంత్రి. ఇలా అనేక వ్యక్తిత్వాల మధ్య .. భావాల మధ్య ఈ కథ నడుస్తుంది. 

నాగేశ్ కుకునూర్ ఈ 9 ఎపిసోడ్స్ లో ప్రతి ఎపిసోడ్ లోను ఏదో ఒక విషయం చెబుతూనే వెళ్లాడు. అయితే ప్రతి సీన్ ను డీటేల్డ్ గా చెప్పడానికి ట్రై చేశాడు. దాంతో నిడివి బాగా పెరిగిపోయింది. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగా ఉంటుంది. కొన్ని సీన్స్ ను ఒక్క డైలాగ్ తో చెప్పేయవచ్చు. కొన్ని అనవసరమైన సీన్స్ కూడా లేకపోలేదు. అలాంటివన్నీ ఏరేస్తూ వెళితే, 7 ఎపిసోడ్స్ లోనే ఈ కథను చెప్పచ్చు. అలా టైట్ కంటెంట్ తో చెబితే ఇంకా బాగుండేది. అలా లేకపోవడమే కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. 

ఈ వెబ్ సిరీస్ లో అనేక పాత్రలు ఉన్నాయి. అయినా అతుల్ కులకర్ణి .. ప్రియా బపత్ ... ఇజాజ్ ఖాన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. నిర్మాణ విలువలకు వంకబెట్టవలసిన పని లేదు. తపస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు ఇవ్వొచ్చు. ఫొటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటేనే, ట్రిమ్ చేయవలసిన సీన్స్ కొన్ని కనిపిస్తాయి. ఇక పాత్రల పేర్లను సరిగ్గా పలకకపోవడం .. ఒకే పాత్రను కొన్ని సందర్భాల్లో వేరే పేరుతో పిలవడం వంటి లోపాలు డబ్బింగ్ పరంగా కనిపిస్తాయి. 


ప్లస్ పాయింట్స్: కథ .. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు .. కొన్ని ట్రాకులకు ఇచ్చిన ముగింపు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. క్లైమాక్స్ ..  అతుల్ కులకర్ణి - ప్రియా నటన.  

మైనస్  పాయింట్స్: కథనంలో వేగం లేకుండా తాపీగా .. కూల్ గా చెప్పడం, అనవసరమైన సన్నివేశాలు .. సాగతీత ధోరణి .. డబ్బింగ్ పరమైన లోపాలు.

Movie Name: City Of Dreams

Release Date: 2023-05-26
Cast: Athul Kulakarni, Priya Bapat, Ejaz Khan, Sachin Pilgaonkar, Sushanth Singh, Flora Saini
Director: Nagesh Kukunoor
Producer: Sameer Nair - Deepak Segal
Music: Tapas Rella
Banner: Applause Entertainment

City Of Dreams Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews