'మేమ్ ఫేమస్' - మూవీ రివ్యూ

  • యూత్ కోసం రూపొందిన 'మేమ్ ఫేమస్' 
  • హీరోగా ... దర్శకుడిగా సుమంత్ ప్రభాస్   పరిచయం
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • ఫస్టాఫ్ కి మంచి మార్కులు 
  • సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలు 

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకి మరింత ఆదరణ పెరుగుతూ వెళుతోంది. సింపుల్ బడ్జెట్ లో మంచి కంటెంట్ ను ప్లాన్ చేసుకుని, థియేటర్స్ కి తీసుకుని వస్తున్నారు. చిన్న సినిమాల ద్వారా కొత్త దర్శకులు  .. హీరోలు .. ఇతర నటీనటులు పరిచయమవుతున్నారు. ఇక కొత్త కుర్రాళ్లు దర్శకత్వ బాధ్యతలను కూడా తమ పైనే వేసుకుని, రంగంలోకి దిగుతున్నారు. అలా వచ్చిన సినిమానే 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ హీరోగా .. దర్శకుడిగా రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కథలోకి వెళితే .. మహేశ్ ( సుమంత్ ప్రభాస్) బాలాజీ (మౌర్య) దుర్గ (మణి) ఈ ముగ్గురూ కూడా తెలంగాణ ప్రాంతంలోని 'బండ నర్సింపల్లి) గ్రామానికి చెందిన కుర్రాళ్లు. ముగ్గురూ కూడా పేద కుటుంబాలకి చెందిన వారే. అయినా ఎలాంటి పని పాటా లేకుండా తాగేసి బలాదూర్ గా తిరిగేస్తూ ఉంటారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. దాంతో తల్లిదండ్రులతో పాటు ఊళ్లో అంతా వాళ్లను తిడుతూ ఉంటారు. 

ఎన్నికల సమయంలో తన చేతికింద ఉంటున్నారనే ఉద్దేశంతో సర్పంచ్ వేణు మాత్రం వీరిని సమర్ధిస్తూ ఉంటాడు .. అవసరమైనప్పుడు సాయం చేస్తూ ఉంటాడు. మహేశ్ తన మేనమామ కూతురు మౌనికను ప్రేమిస్తూ ఉంటాడు. అయితే తిరుగుబోతులనే కారణంగా అతనికి పిల్లను ఇవ్వడానికి మేనమామ నిరాకరిస్తాడు. ఇక బాలాజీ కూడా శ్రీమంతుల అమ్మాయి 'బబిత'ను ప్రేమిస్తాడు. ఆమె తండ్రి కూడా అదే కారణంగా అతనికి తన కూతురు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. 

తాము ప్రేమించిన అమ్మాయిలను పొందాలంటే తాము ఫేమస్ కావాలి .. అంతకుముందు తాము ప్రయోజకులమనే సంగతిని నిరూపించుకోవాలి. అందులో భాగంగానే ముగ్గురూ కలిసి 'టెంట్ హౌస్' ను సెట్ చేసుకోవాలని భావిస్తారు. ఈ విషయంలో ఇంట్లో వారి నుంచి కూడా వారికి మద్దతు లభిస్తుంది. టెంట్ హౌస్ జోరుగా నడుస్తూ ఉంటుంది .. సంపాదన బాగా వస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో షార్ట్ సర్క్యూట్ వలన ఆ షాపు తగలబడిపోతుంది. అప్పుడు ఆ ముగ్గురు యువకులు ఏం చేస్తారు? ఎలా ఫేమస్ అవుతారు? అనేదే కథ. 

సుమంత్ ప్రభాస్ ఈ సినిమాతో హీరోగాను .. దర్శకుడిగాను పరిచయమయ్యాడు. తనే కథ .. స్క్రీన్ .. మాటలు అందించాడు. గ్రామీణ నేపథ్యంలో ఒక వైపున స్నేహం .. మరో వైపున ప్రేమ .. ఇంకో వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఈ కథను నడిపించాడు. అక్కడక్కడా కామెడీ టచ్ ఇస్తూ వెళ్లాడు. మేకప్ లేకుండా ఓ సాధారణ పల్లెటూరు కుర్రాడి మాదిరిగా తెరపై కనిపిస్తూ, కథని కనెక్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. 

అయితే సినిమా మొదలైన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకూ గల కంటెంట్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఆ తరువాత కథలో కూడా, సిటీ నుంచి ఒక ఛానల్ వారు ప్రాంక్ వీడియో షూట్ చేయడానికి వస్తారు. దాంతో తాము కూడా యూ ట్యూబ్ వీడియోస్ చేసి ఫేమస్ కావాలనే ఆలోచన హీరో బృందానికి వస్తుంది. ఇక్కడి నుంచి కథలోని పట్టు సడలిపోతుంది. సన్నివేశాలను సాగదీస్తున్నట్టుగా .. అనవసరమైన సీన్స్ ఎక్కువవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ అంత పెర్ఫెక్ట్ గా క్లైమాక్స్ రాలేదని అనిపిస్తుంది. 

యూ ట్యూబ్ ద్వారా ఫేమస్ కావాలనే ఆలోచన పాతది. ఒకవేళ అదే కంటెంట్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, స్క్రీన్ ప్లేను మరింత టైట్ చేసుకుని ముందుకు వెళ్లవలసింది. అలా కాకుండా ఫేమస్ కావడానికి తీసుకునే సమయం ఎక్కువైపోవడంతో ఒకింత అసహనం పెరుగుతుంది. ఫస్టాఫ్ మాదిరిగానే సెకండాఫ్ విషయంలో దృష్టి పెట్టేసి ఉంటే సినిమా మరింతగా యూత్ ను .. మాస్ ను ఆకట్టుకునేదే. 

కల్యాణ్ నాయక్ కట్టిన బాణీలు ఫరవాలేదు. 'అయ్యయ్యో' .. 'గల్లీ సిన్నది' వంటి పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సందర్భానికి తగిన ఎమోషన్స్ కనెక్ట్ చేస్తూ వెళుతుంది.  శ్యామ్ ఫొటోగ్రఫీ ఓ మాదిరిగా ఉంది. సమయం చిక్కినప్పుడల్లా పల్లె అందాలను మరింత మనోహరంగా ఆవిష్కరిస్తే బాగుండేది. ఇక సృజన ఎడిటింగ్ విషయానికి వస్తే, సెకండాఫ్ లో లింగం లవ్ స్టోరీ వంటి కొన్ని సీన్స్ ను లేపేయవలసింది.

పల్లెటూరు .. బాధ్యతలు పట్టని కుర్రాళ్లు .. అయినా ప్రేమించే అమ్మాయిలు ... ఆ ప్రేమను ఎదిరించే పెద్దలు .. ఒకానోక సందర్భంలో  ఆ కుర్రాళ్లు మారడం ... తమ గ్రామానికి పేరు తీసుకుని రావడం .. ఇలాంటి కథతో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. అదే కథను తన మార్క్ తో చెప్పడానికి సుమంత్ ప్రభాస్ చేసిన ప్రయత్నం కొంతవరకూ ఫలించింది. దాదాపు ఈ కథ ఊరు దాటకుండా ... బడ్జెట్ దాటకుండా చూసుకున్నారు. ఆర్టిస్టులంతా బాగానే చేశారు ... కాకపోతే సెకండాఫ్ బలహీన పడటం ఈ సినిమాకి మైనస్ గా కనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్: గ్రామీణ నేపథ్యం .. ఫస్టాఫ్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. సుమంత్ ప్రభాస్ నటన .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎమోషన్స్. 

మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం .. సెకండాఫ్ లో కథనంలో వేగం తగ్గడం .. సన్నివేశాలు బలహీనపడటం. 

Movie Name: Mem Famous

Release Date: 2023-05-26
Cast: Sumanth Prabhas, Mani, Mourya, Shourya, Siri Rashi, Muralidhar
Director: Sumanth Prabhas
Producer: Anurag Reddy - Sharath Chandra - Chandra MOhan
Music: Kalyan Nayak
Banner: Chai Bisket Films

Mem Famous Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews