'తాజ్' డివైడెడ్ బై బ్లడ్ - వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: Taj Divided by Blood

Release Date: 2023-03-04
Cast: Naseeriddin Shah, Dharmendra, Adithi Rao Hydari, Santhya Mrudul, Rhul Bose, Zarina Waahab
Director: Ron Scalpella
Producer: Abhimanyu Singh
Music: Ian Arber
Banner: Contiloe Pictures
Rating: 3.50 out of 5
  • జీ 5 నుంచి వచ్చిన మరో భారీ వెబ్ సిరీస్ 
  • చారిత్రక నేపథ్యంలో సాగే 'తాజ్' డివైడెడ్ బై బ్లడ్
  •  ఆసక్తికరమైన కథాకథనాలు
  • కథతో పాటు తీసుకెళ్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
  • బాలీవుడ్ సినిమా స్థాయిని తలపించే నిర్మాణ  విలువలు
  • అనార్కలి పాత్రకి తగ్గిన ప్రాధాన్యత

అక్బర్ కాలంలో సలీమ్ - అనార్కలి ప్రేమకథను గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. నిజమైన ప్రేమకు .. నిస్వార్థమైన ప్రేమకు నిర్వచనంగా చరిత్రలో వారిద్దరూ కనిపిస్తారు. ఈ కథపై గతంలో వివిధ భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి. చారిత్రక నేపథ్యంలో నడిచే ఆ కథతో రూపొందిన వెబ్ సిరీస్ నే 'తాజ్' డివైడెడ్ బై బ్లడ్. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ 10 ఎపిసోడ్స్ గా జీ 5లో స్ట్రీమింగ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందనేది ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే .. మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఆయన తనయుడు హుమాయూన్ .. ఆయన తనయుడే అక్బర్. చాలా చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్టించిన అక్బర్ (నసీరుద్దీన్ షా) తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. పాలనా సంబంధమైన ఎన్నో సంస్కరణలు ప్రవేశపెడతాడు. అతనికి అత్యంత విశ్వాస పాత్రుడిగా బీర్బల్ .. సేనానాయకుడిగా మాన్ సింగ్ ఉంటారు. అక్బర్ ముగ్గురు భార్యలు కూడా అంతఃపురానికే పరిమితమై ఉంటారు. 

అక్బర్ ముగ్గురు తనయులే సలీమ్ (ధర్మేంద్ర) మురాద్ (తాహ షహ్) దానియల్ (శుభం కుమార్).
సలీమ్ స్త్రీలోలుడు .. మద్యం - మగువ అతని లోకం. మురాద్ కి రాజ్యకాంక్ష ఎక్కువ. ఇక చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న దానియల్ కి తన సమర్ధతపై తనకే నమ్మకం తక్కువ. అయితే ఈ ముగ్గురిలో సమర్ధుడైన వారికే సింహాసనాన్ని అప్పగించాలని అక్బర్ నిర్ణయించుకుంటాడు. అందుకు తగిన పరీక్షలనే తనయులకు పెడుతుంటాడు. 

ఈ నేపథ్యంలోనే అంతఃపురంలోని ఒక ప్రత్యేకమైన మందిరంలో అనార్కలి (అదితీరావు హైదరి) బంధించబడి ఉంటుంది. అక్బర్ ఆ ప్రదేశాన్ని నిషేధిత ప్రదేశంగా ప్రకటించి, రహస్యంగా ఆమెను కలుసుకుని వెళుతుంటాడు. ఒకసారి అనుకోకుండా ఆమె సలీమ్ కంటపడుతుంది. ఆమె సౌందర్యం అతణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. అప్పటి నుంచి ఆయన ఆమెను గురించే ఆలోచన చేస్తుంటాడు. అలా వారి మధ్య ప్రేమ మొదలవుతుంది. 

సలీమ్ తీరుపై అనుమానం వచ్చిన అక్బర్, ఆయనకి మూడు పెళ్లిళ్లు జరిపిస్తాడు. అయినా అనార్కలిని సలీమ్ కలుసుకుంటూనే ఉంటాడు. మరో వైపున అబుల్ ఫజల్ - బదాయిని వంటి అధికారులు, అక్బర్ కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి .. అక్బర్ ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంటారు. అనార్కలి మత్తులో పూర్తిగా మునిగిపోయిన సలీమ్ కి ఒక చేదు నిజం తెలుస్తుంది. అదేమిటి? అక్కడి నుంచి చోటుచేసుకునే సంఘటనలు ఎలాంటివి? అనేదే కథ.

ఈ వెబ్ సిరీస్ ను దాదాపు ఒక బాలీవుడ్ సినిమా స్థాయిలో నిర్మించారు. నలుగురు దర్శకులు ఈ కథను ఆసక్తికరంగా చిత్రీకరించారు. భారీ సెట్టింగ్స్ .. కాస్ట్యూమ్స్ .. ఏనుగులు .. గుర్రాలు .. పోరాటాలు .. ఇలా నిర్మాణ పరంగా ఏ విషయంలోను రాజీ పడకుండా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. గుర్రాలఫై ఛేజింగ్స్ .. అందుకు సంబధించిన లొకేషన్స్ కట్టిపడేస్తాయి. 

కథాకథనాల పరంగా .. తారాగణం పరంగా భారీతనం కనిపించే వెబ్ సిరీస్ ఇది. రాజరికాలు ... స్వార్థాలు .. కుట్రలు .. కుటిల వ్యూహాలు .. అధికార దాహాలు వీటన్నిటినీ టచ్ చేస్తూ నడిపించిన డ్రామా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు ఆ కాలంలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతలా ఈ కథతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఏ ఆర్టిస్ట్ కూడా ఆ పాత్రలో నుంచి బయటికి రాకుండా చేయడం కనిపిస్తుంది. 

అయితే ఈ కథలో అక్బర్ పాలనా సంబంధమైన వ్యవహారాలకు ఎక్కువ సమయం కేటాయించారు. నసీరుద్దిన్ షా ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని, అనార్కలి పాత్రకి ఆయనను కాస్త దూరంగానే ఉంచారు. ఇక సలీమ్ - అనార్కలి  కలుసుకునే సందర్భాలు తక్కువ. ఒకరికోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు, వాళ్ల మధ్య ఆ స్థాయి లవ్ చూపించలేదు కదా అనిపిస్తుంది. అలాగే అనార్కలి .. సలీమ్ ల రొమాన్స్ లో కూడా ఆ స్థాయి ఘాటుదనం ఏమీ కనిపించదు.  

ఇక అనార్కలి అనగానే అక్బర్ ఆస్థానంలో ఆమె నాట్య కళాకారిణిగానే జనానికి తెలుసు. కానీ ఈ వెబ్ సిరీస్ లో ఆమె ఒక బందీ. ఎంట్రీ సమయంలో తప్ప ఆమె మళ్లీ నాట్యం చేయలేదు. నాట్యపరంగా గానీ .. సలీమ్ కాంబినేషన్లో గాని పాటలు లేకపోవడం ఒక వెలితిగానే అనిపిస్తుంది. మిగతా పాత్రలన్నీ కోటలో నానా హడావిడి చేస్తుంటే, ఆమె ఒక కిటికీలో నుంచి చూస్తుంటుంది అంతే. మొత్తం ఎపిసోడ్స్ తో కలిపి చూసుకుంటే, ఆమె పాత్ర నిడివి చాలా తక్కువనే. 

ప్లస్ పాయింట్స్ : కథాకథనాలు .. ప్రత్యేకమైన సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. లొకేషన్స్ ..ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు .. ఛేజింగ్స్ ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం .. ఎడిటింగ్ .. భారీతనం. 

మైనస్ పాయింట్స్: అనార్కలి పాత్ర ఆశించిన స్థాయిలో తెరపై కనిపించకపోవడం. సలీమ్ తో ప్రేమ సన్నివేశాలకి ప్రాధాన్యత తగ్గడం .. అక్కడక్కడా తగిలే అభ్యంతరకర దృశ్యాలు. ఈ సీన్స్ ఫ్యామిలీతో కలిసి చూసేవాళ్లను కాస్త ఇబ్బంది పెడతాయి.

ఇది అనువాదమనే ఫీలింగ్ ఎక్కడా రాదు. తెలుగు వెబ్ సిరీస్ లానే అనిపిస్తుంది. చారిత్రక  నేపథ్యంతో కూడిన ఈ కథను ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్ గా చెప్పారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా జోనర్లో వచ్చిన భారీ వెబ్ సిరీస్ గా ఇది ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


More Movie Reviews