'డియర్ కామ్రేడ్' మూవీ రివ్యూ

ప్రియురాలి ఆశయాన్ని నెరవేర్చడానికి ఒక ప్రియుడు చేసే పోరాటం .. తను మనసిచ్చినవాడిలో ఆవేశాన్ని తగ్గించడానికి ఒక ప్రియురాలుపడే ఆరాటమే 'డియర్ కామ్రేడ్'. ప్రేమ .. అల్లరి .. అలక .. ఎడబాటులోని బాధ .. కలిసి ఉండటంలోని సంతోషాన్ని అందంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ఫరవాలేదనిపిస్తుంది. కథనం పట్టుగా సాగివుంటే మరిన్ని మార్కులు సంపాదించుకుని వుండేదనిపిస్తుంది.
కాలేజ్ లైఫ్ అనేది ఎంతో అందమైందిగా విద్యార్థులు భావిస్తారు. ఎన్నో ఆశలతో .. ఆశయాలతో వాళ్లు కాలేజ్ క్యాంపస్ లోకి అడుగుపెడతారు. అక్కడ పాఠాలు .. పాటలు వినిపిస్తాయి, ఆకతాయిల అల్లర్లూ .. విద్యార్థులను పావులుగా చేసుకునే స్వార్థ రాజకీయాలు కనిపిస్తాయి. అలాంటి కాలేజ్ నేపథ్యంలో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో ప్రేమకథా చిత్రమే 'డియర్ కామ్రేడ్'. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఈ కామ్రేడ్ సాగించిన పోరాటమేమిటో .. సాధించిన ప్రయోజనమేమిటో ఇప్పుడు చూద్దాం.

కథానాయకుడు చైతన్య (విజయ్ దేవరకొండ) కాకినాడలోని ఒక కాలేజ్ లో చదువుతుంటాడు. అంతా అతనిని బాబీ అని పిలుస్తుంటారు. తన తాతయ్య సూర్యం (చారుహాసన్) కామ్రేడ్ భావాలు బాబీ ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతాయి. అందువలన తన కళ్ల ముందు అన్యాయం జరిగితే ఆయన ఎంతమాత్రం సహించలేడు. ఆవేశంతో ఒక్కసారిగా విరుచుకుపడిపోతుంటాడు. వాళ్ల పక్కింట్లో జరిగే ఒక పెళ్లికి హైదరాబాద్ నుంచి అపర్ణాదేవి (రష్మిక) వస్తుంది. ఆమెను అందరూ 'లిల్లీ' అని పిలుస్తుంటారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో లిల్లీ పాల్గొంటూ ఉంటుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది.

లిల్లీని జాతీయస్థాయి క్రికెట్ కి తీసుకెళ్లాలని బాబీ భావిస్తాడు. ఎవరితోను గొడవలు పడకుండా ఆయన ఆవేశం తగ్గించేలా చేయాలని లిల్లీ నిర్ణయించుకుంటుంది. అయితే ఆ తరువాత బాబీ ఆవేశాన్ని రెట్టింపు చేసే సంఘటనలు జరుగుతాయి. క్రికెట్ నుంచి లిల్లీ తప్పుకునే పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందుకు కారకులు ఎవరు? ఆ పరిస్థితులను నాయకా నాయికలు ఎలా ఎదుర్కొన్నారు? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

'నీ హక్కును సాధించడానికి నువ్వు చేసే పోరాటంలో చివరి వరకూ నీకు తోడుగా నడిచేవాడే కామ్రేడ్' అని ఈ సినిమాలో హీరోతో ఆయన తాతయ్య చెబుతాడు. జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రతి ఒక్కరికీ ఒక కామ్రేడ్ ఉండాలి అనే అభిప్రాయాన్ని హీరోయిన్ వ్యక్తం చేస్తుంది. ఇదే పాయింట్ పై దర్శకుడు భరత్ కమ్మ ఈ కథను నడిపించాడు.ఒక వైపున ప్రేమకథను నడిపిస్తూనే మరో వైపున కళాశాల విద్యార్థులపై స్వార్థ రాజకీయ శక్తుల ప్రభావాన్ని .. క్రీడా రంగంలో లైంగిక వేధింపుల కోణాన్ని ఆవిష్కరించాడు.

భరత్ కమ్మ మంచి కథను తయారు చేసుకున్నాడు .. అందుకు తగిన నటీనటులను ఎంచుకున్నాడు. కాకపోతే కథనం విషయంలోనే మరింత శ్రద్ధ పెడితే బాగుండేదనిపిస్తుంది. క్రికెట్ 'బెట్ మ్యాచ్' లో హీరో బ్యాచ్ ను హీరోయిన్ గెలిపించిన దగ్గర నుంచి ఊపందుకున్న కథనం, సెకండాఫ్ లో నెమ్మదించింది. సెకండాఫ్ చివర్లో ఈ లోపం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చారుహాసన్ .. సీనియర్ హీరో ఆనంద్ .. తులసి .. ఆశ్రిత వేముగంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఫీల్ తో కూడిన లవ్ సీన్స్ ను .. సున్నితమైన  ఎమోషనల్ సీన్స్ ను మాత్రం దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.

డైలాగ్స్ పరంగా .. బాడీ లాంగ్వేజ్ పరంగా విజయ్ దేవరకొండ తన మార్క్ సినిమానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమాలో ఆయన మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు. బాబీ పాత్రలో ఆయన చాలా సహజంగా నటించాడు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో చాలా బాగా చేశాడు. ప్రియురాలు దూరమైనప్పుడు .. ఆమె ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న క్రమంలో వచ్చే సీన్స్ లోను ఆయన పలికించిన హావభావాలు గొప్పగా అనిపిస్తాయి. ఇక లిల్లీ పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. సన్నివేశాలకి సహజత్వాన్ని తీసుకొచ్చే విషయంలో విజయ్ దేవరకొండతో పోటీపడింది. ఉత్సాహపరిచే సన్నివేశాల్లోను .. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లోను ఆమె నటన ఆకట్టుకుంది. ఈ జోడీకి మరోసారి మంచి మార్కులు పడినట్టే. ఇక రష్మిక తండ్రి పాత్రలో సంజయ్ స్వరూప్ .. తల్లి పాత్రలో ఆశ్రిత వేముగంటి . పెద్దమ్మ పాత్రలో తులసి .. అక్క పాత్రలో శృతి రామచంద్రన్ పాత్రల పరిథిలో నటించారు. శృతి రామచంద్రన్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జస్టీన్ ప్రభాకరన్ అందించిన సంగీతం .. రీ రికార్డింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఫస్టాఫ్ లో వచ్చే 'నీ నీలికన్నుల్లో ఆకాశమే' .. 'గిరా గిరా' .. 'కడలల్లె వేచె కనులే', సెకండాఫ్ లో వచ్చే 'ఓ కథలా .. కలలా' .. 'మామ చూడరో' .. వంటి పాటలు సందర్భంలో ఇమిడిపోతూ  .. మనసును హత్తుకుంటాయి. ముఖ్యంగా 'కడలల్లె వేచె కనులే' మనసుకి తీపి బాధను కలిగిస్తుంది. 'మామ చూడరో' పాట జోరుగా .. హుషారుగా సాగుతుంది. చైతన్య ప్రసాద్ - రెహ్మాన్ సాహిత్యం .. గౌతమ్ భరద్వాజ్ - సిధ్ శ్రీరామ్ ఆలాపన అందంగా ... ఆహ్లాదంగా సాగాయి.

ఇక సుజిత్ సారంగ్ ఫొటోగ్రఫీ చాలా బాగుంది. వర్షం నేపథ్యంలోని సన్నివేశాలను .. మనసు బాగోలేక హీరో బైక్ ట్రిప్ వేసినప్పటి లొకేషన్స్ ను ఆయన మనసుతెరపై అందంగా ఆవిష్కరించాడు. ఫైట్స్ .. కొరియోగ్రఫీ ఫరవాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే తక్కువ మార్కులే పడతాయి. ఒకటి రెండు అనవసరమైన సీన్స్ .. క్రికెట్ నేపథ్యంలో రష్మిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ .. క్లైమాక్స్ కాస్త సాగతీతగా అనిపిస్తాయి. కామెడీపై కాస్తంత దృష్టి .. కథనం విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా మరింతగా ప్రేక్షకుల మనసులను దోచుకునేది. పై లోపాల కారణంగా ఆ స్థాయికి కాస్త తక్కువ మార్కులతో ఫరవాలేదనిపించుకుంటుంది.  

Movie Name: Dear Comrade

Release Date: 2019-07-26
Cast: Vijay Devarakonda, Rashmika, Shruthi Ramachandran, Tulasi, Anand
Director: Bharat kamma
Producer: Yash Rangineni
Music: Justin Prabhakaran
Banner: Mythri Movies Makers

Dear Comrade Rating: 3.00 out of 5


More Movie Reviews