మూవీ రివ్యూ: 'వాల్తేరు వీరయ్య'

  • ఈ రోజునే విడుదలైన 'వాల్తేరు వీరయ్య'
  • కొత్తదనం లేని కథాకథనాలు 
  • చిరంజీవి - రవితేజ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయని బాబీ 
  • శ్రుతి హాసన్ - కేథరిన్ పాత్రలు నామమాత్రం
  • స్థానికతకు దూరంగా మలేసియాలో నడిచిన కథ
చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అందువల్లనే తన సినిమాల్లో మాస్ కంటెంట్ ఉండేలా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ తరహా సినిమాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ ను అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక డైలాగ్స్ .. పాటలు .. డాన్సులు ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఆ సినిమాలు ఒక రేంజ్ కి వెళుతుంటాయి. అలాంటి ఒక మాస్ కంటెంట్ తో చిరంజీవి చేసిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో సందడి చేసిందనేది చూద్దాం.

'వాల్తేరు'లోని 'జాలరిపేట'లో నివసించేవారిలో వీరయ్య (చిరంజీవి) ఒకరు. వీరయ్య తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి ( సత్యరాజ్) మరో పెళ్లి చేసుకుంటాడు. ఆ భార్యకి అతని వలన కలిగిన కొడుకే విక్రమ్ (రవితేజ). భార్యభర్తల మధ్య మాటా మాట కారణంగా ఆమె విక్రమ్ ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. తండ్రి దగ్గరే ఉంటూ వీరయ్య పెద్దవాడవుతాడు. తండ్రి కూడా చనిపోయిన తరువాత ఆ గూడెం ప్రజలే అతని కుటుంబ సభ్యులు అవుతారు. ఇక తల్లి దగ్గరే పెరిగిన   విక్రమ్, పోలీస్ ఆఫీసర్ అవుతాడు. 

వీరయ్యకి కండబలం .. గుండెబలం ఎక్కువ. అనుకున్నది సాధించడానికి ఆయన వెనుకాడడు. కోస్ట్ గార్డులు సైతం ఒక్కోసారి ఆయన సాయాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాంటి వీరయ్య .. కోర్టులో ఒక కేసు గెలవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ కేసు గెలవడానికి ఆయనకి పాతిక లక్షలు అవసరమవుతాయి. ఆ డబ్బు ఎలా సమకూర్చాలా అని ఆయన ఆలోచన చేస్తుండగా, సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) అనే ఒక కానిస్టేబుల్, తన బావమరిది బాలరాజు ( వెన్నెల కిశోర్)ను వెంటబెట్టుకుని ఆయన దగ్గరికి వస్తాడు.

సాల్మన్ సీజర్ (బాబీ) అనే ఒక అంతర్జాతీయ నేరస్థుడిని అనుకోని కారణాల వలన ఒక రాత్రి తమ పోలీస్ స్టేషన్లో ఉంచవలసి వచ్చిందనీ, అయితే అతను స్టేషన్లోని పోలీసులందరినీ చంపేసి తప్పించుకున్నాడని వీరయ్యతో చెబుతాడు. సాల్మన్ మలేసియాలో ఉంటూ డ్రగ్స్ దందా నడుపుతూ ఉంటాడనీ, అతణ్ణి ఎలాగైనా ఇండియాకి తీసుకుని వచ్చి తమకి అప్పగించమని కోరతాడు. ఆ పని చేసిపెడితే అందుకు 25 లక్షలు ఇస్తానని అంటాడు.

కోర్టు కేసు గెలవాలంటే తనకి డబ్బు అవసరం ఉన్నందు వలన ఆ పని చేసిపెట్టడానికి వీరయ్య ఒప్పుకుంటాడు. తన బృందాన్ని వెంటబెట్టుకుని మలేసియా వెళతాడు. అక్కడే అతనికి అతిథి (శ్రుతి హాసన్) పరిచయమవుతుంది. సాల్మన్ సీజర్ ను పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదనీ, అతని వెనుక అతని అన్నయ్య మైఖేల్ సీజర్ (ప్రకాశ్ రాజ్) ఉన్నాడని తెలుసుకుంటాడు. అయినా వచ్చిన పని పూర్తి చేసే వెళతానంటూ వీరయ్య రంగంలోకి దిగుతాడు. అయితే అతను కేవలం తమ పనిమీదనే అక్కడికి రాలేదనే విషయం సీతాపతికి అర్థమవుతుంది. మలేసియాలో వీరయ్యకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడతను ఏం చేస్తాడు? అక్కడ అతనికున్న సొంత పనేంటి? అనేదే కథ. 

ఈ కథ మారేడుమిల్లి ఫారెస్టు ఏరియాలో ఒక ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ కావడంతో మొదలవుతుంది. ఆ ఫ్లైట్ లో తరలిస్తున్న క్రిమినల్ సాల్మన్ ను దగ్గరలోని జైలులో ఒక నైట్ ఉంచుతారు. అతను అక్కడి నుంచి తన మనుషులతో తప్పించుకుంటాడు. ఆ తరువాత స్మగ్లర్ ల చేతిలో బందీలుగా ఉన్న కోస్టు గార్డులను కాపాడే క్రమంలో వీరయ్య గా చిరంజీవి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంతవరకూ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ వెంటనే వచ్చే ' బాస్ పార్టీ' పాట కూడా మంచి సందడి చేస్తుంది. 

ఎప్పుడైతే వీరయ్య మలేసియా బయల్దేరతాడో అక్కడి నుంచి ఆశించిన స్థాయిలో కథ ఆకట్టుకోదు. మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న మైఖేల్ తమ్ముడు సాల్మన్ ను ఆకతాయిగా కలుసుకోవడం .. ఆయనను మాయచేసి కిడ్నాప్ చేయాలనుకోవడం .. అదీ కుదరకపోతే మభ్యపెట్టి ఇండియాకి తీసుకెళ్లాలనుకోవడం వంటి సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా శ్రుతి హాసన్ - చిరంజీవి కాంబినేషన్ లోని సీన్స్ కూడా పేలవంగానే కనిపిస్తాయి.

ఇంటర్వెల్ బ్యాంగ్ సమయానికి ''మీ కథలోకి నేను రాలేదు .. నా కథలోకి మీరొచ్చారు .. అసలు కథ ఇప్పటి నుంచే మొదలవుతుంది" అని వీరయ్య అంటాడు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్  మొదలవుతుంది. ఇంటర్వెల్ తరువాత పోలీస్ ఆఫీసర్ గా రవితేజ ఎంటరవుతాడు. ఫ్లాష్ బ్యాకులో చిరంజీవిని కలుపుకుంటూ రవితేజ వైపు నుంచి కథ నడుస్తూ ఉంటుంది. బాబీ దర్శకుడిగా చిరంజీవి పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదు. కథనంతో పాటు చిరంజీవికి రాసుకున్న డైలాగ్స్ కూడా బలహీనంగానే ఉన్నాయి. చిరంజీవి పాత్రకి కామెడీ టచ్ ఎక్కువగా ఇవ్వడమే మైనస్ గా అనిపిస్తుంది. 

ఇక రవితేజకి ఒక పవర్ఫుల్ పాత్రను ఇచ్చి, ఆయన ఎనర్జీకి తగినట్టుగా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. విలన్స్ గా అటు ప్రకాశ్ రాజ్ .. బాబీ అన్నదమ్ములు, హీరోల వైపు నుంచి చిరంజీవి - రవితేజ అన్నదమ్ములు. ఈ నాలుగు పాత్రల చుట్టూనే ప్రధానమైన కథ తిరుగుతుంది. ఇక చిరంజీవి సరసన శ్రుతి .. రవితేజ జోడీగా కేథరిన్ పాత్రలు నామమాత్రం. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉండవు.  

దేవిశ్రీ బాణీలు బాగున్నాయి. కానీ బీట్ కి తగినట్టుగా పాటల్లో సాహిత్యపరమైన ఛమక్కులు కనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. కాకపోతే కొన్ని పాటల్లో తమిళ పాటల్లో మాదిరిగా డాన్సర్ల సంఖ్య ఎక్కువైపోయింది. ఇక ఆర్థర్ విల్సన్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ దృశ్యాలను .. పాటలను గొప్పగా చిత్రీకరించాడు. నిరంజన్ ఎడిటింగ్ పనితీరు కూడా ఫరవాలేదు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఓకే. 

చిరంజీవి యాక్టింగ్ .. ఆయన ఫైట్లు .. డాన్సులకు వంకబెట్టలేం. కానీ ఆయన లుక్ దగ్గర నుంచి ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు .. కథాకథనాలను నడిపించిన తీరు అసంతృప్తిని కలిగిస్తాయి. ఇక వాల్తేరులో జాలరిపేట నాయకుడిగా లోకల్ గా కథ నడుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు, కథలో ఎక్కువభాగం మలేసియాలో నడవడంతో అసహనానికి లోనవుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి ఇచ్చిన ఛాన్స్ ను బాబీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడనే అనాలి.

Movie Name: Waltair Veerayya

Release Date: 2023-01-13
Cast: Chiranjeevi, Sruthi Haasan, Raviteja, Catherine, Prakash Raj, Bobby
Director: Bobby
Producer: Naveen Yerneni
Music: Devisri Prasad
Banner: Mythri Movie Makers

Waltair Veerayya Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews