మూవీ రివ్యూ : 'ధమాకా'

  • ఈ రోజునే విడుదలైన 'ధమాకా' 
  • డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన రవితేజ
  • ఆయన జోడీగా గ్లామర్ తో అలరించిన శ్రీలీల 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన పాటలు
  • ఎప్పటిలానే తన ఎనర్జీతో మేజిక్ చేసిన రవితేజ
తేజకి మాస్ మహారాజ్ అనే పేరు ఉంది. తనని అభిమానించే మాస్ ఆడియన్స్ కోసం తన సినిమాల్లో మాస్ కంటెంట్ ఉండేలా ఆయన చూసుకుంటారు. అలా మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుని ఆయన చేసిన సినిమానే 'ధమాకా'.  విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నక్కిన త్రినాథరావు ఈ సినిమాను రూపొందించాడు. మాస్ హీరో .. మాస్ డైరెక్టర్ కలిసి చేసిన ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో సందడి చేసిందనేది ఇప్పుడు చూద్దాం. 

నందగోపాల్ చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) పెద్ద బిజినెస్ మేన్. ఆయన తనయుడే ఆనంద్ చక్రవర్తి (రవితేజ). బిజినెస్ లో తండ్రికి సహాయంగా ఉంటూ ఉంటాడు. తాను ఎక్కువ కాలం బ్రతకనని తెలుసుకున్న నందగోపాల్, తన సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను తన బిజినెస్ లో భాగస్వాములుగా ప్రకటిస్తాడు. ఇక జేపీ (జయరామ్) దౌర్జన్యంతో ఒక్కో సంస్థను ఆక్రమించుకుంటూ ఎదుగుతూ ఉంటాడు. ఈ విషయంలో ఆయనకి తోడుగా ఆయన కొడుకు అథర్వ ఉంటాడు. 

అలాంటి జేపీ కన్ను నందగోపాల్ సంస్థలపై పడుతుంది. దాంతో ఆ సంస్థలను ఆక్రమించుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఇక వాసుదేవరావు (తనికెళ్ల భరణి) దంపతుల తనయుడు స్వామి (రవితేజ) తన ఆవేశం కారణంగా ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని, కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. తన చెల్లెలి స్నేహితురాలైన ప్రణవి (శ్రీలీల) ప్రేమలో స్వామి పడతాడు ప్రణవి తండ్రి (రావు రమేశ్) ఆమెను ఆనంద్ కి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. ఆనంద్ - స్వామి ఇద్దరూ ఒకేలా ఉండటంతో, స్వామి అనుకుని ఆనంద్ తో పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 

తన కూతురు శ్రీమంతుల ఇంటికి కోడలిగా వెళుతుందని భావించిన ప్రణవి తండ్రి, ఆనంద్ మాదిరిగానే ఉన్న స్వామిని చూసి షాక్ అవుతాడు. తన దారికి అడ్డుగా ఉన్న ఆనంద్ ను హతమార్చాలని జీపీ ప్లాన్ చేస్తాడు. తన కూతురు ఆనంద్ ను వివాహం చేసుకోవాలంటే స్వామిని హతమార్చాలని ప్రణవి తండ్రి పథకం వేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేదే కథ.

ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను ప్రసన్నకుమార్ బెజవాడ అందించాడు. ఆయన ఈ కథను రెడీ చేసిన తీరు బాగుంది. రవితేజను అటు క్లాస్ గాను .. ఇటు మాస్ గాను ఈ కథలో డిజైన్ చేశాడు. అలాగని ఇది పాత ఫార్మేట్ నే కదా అని అనిపించదు. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ఉండాలనే  ఉద్దేశంతో ఏ పాత్రకీ కూడా హెవీ లుక్ గానీ .. మేనరిజమ్స్ గాని పెట్టలేదు. అయినా రెండు పాత్రల మధ్య తేడా స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. 

ఇక ప్రసన్న కుమార్ వేసిన స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కథ మొదటి నుంచి చివరి వరకూ చాలా ఫాస్టుగా నడుస్తుంది. ప్రధానమైన పాత్రలను ఆయన మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తరువాత కథపై ఆసక్తిని పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అలాగే క్లైమాక్స్  ఆడియన్స్ ను ఎంతమాత్రం నిరాశ పరచదు. 

దర్శకుడు నక్కిన త్రినాథరావు విషయానికొస్తే, అటు సన్నివేశాల పరంగా .. ఇటు డైలాగ్స్ పరంగా .. పాటల పరంగా ఎక్కడా కూడా మాస్ అంశాలు తగ్గకుండా చూసుకున్నాడు. తన కూతురు కోసం రవితేజ ఇంటికి రావు రమేశ్ వచ్చే సీన్, రావు రమేశ్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి రవితేజ వెళ్లే సీన్ లోను కామెడీ పండించడానికి దర్శకుడు ప్రయత్నించడం అసహనాన్ని కలిగిస్తుంది. ఆ సమయంలో గతంలో జొన్నవిత్తుల రాసిన 'తిట్ల దండకం' తరహాలో ఒక పాట కూడా పాడేయడం అనవసరమని అనిపించకమానదు. 

రవితేజ ఇటు మధ్య తరగతి ఇంట్లో .. అటు శ్రీమంతుల ఇంట్లో ఒకే ఊళ్లో పెరుగుతాడు. కానీ ఈ ఇద్దరూ ఒకేలా ఉన్నారని ఎవరూ అనుకోకపోవడం ఆశ్చర్యం. ఈ ఇద్దరితో ట్రావెల్ అవుతూ ఉండు .. ఎవరు నచ్చితే వారినే పెళ్లి చేసుకో అని హీరోయిన్ కి తల్లి సలహా ఇవ్వడం మరో విచిత్రం. రవితేజ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా సిల్లీగానే అనిపిస్తుంది. తమిళ సినిమాల్లో మాదిరిగా ప్రతి పాటలోను గుంపులకొద్దీ జనాలు కనిపిస్తారు. ఇలాంటివన్నీ పక్కనపెట్టి చూస్తే, మాస్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి దర్శకుడు బాగానే కష్టపడ్డాడనిపిస్తుంది. 

కథలో కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నప్పటికీ, మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది పాటలేనని చెప్పాలి. భీమ్స్ ట్యూన్ చేసిన పాటలు మాస్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టుమార్కు 'జింతాక్' సాంగ్ కి ఇవ్వొచ్చు. ఆ తరువాత స్థానంలో 'దండకడియాల్' .. 'వాట్స్ హ్యాపినింగ్' కనిపిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం భీమ్స్ తడబడ్డాడనే విషయం తెలిసిపోతూనే ఉంటుంది. 

కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను .. పాటలను .. ఫైట్స్ ను చిత్రీకరించిన తీరు నచ్చుతుంది. ముఖ్యంగా సాంగ్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా ఫరవాలేదు. రవితేజ మాస్ యాక్షన్ .. శ్రీలీల గ్లామర్ .. రావు రమేశ్ - హైపర్ అది కామెడీ .. రామ్ - లక్ష్మణ్ ఫైట్స్ .. భీమ్స్ బాణీలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. రవితేజ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ .. రవితేజ - రావు రమేశ్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ పేలవంగా అనిపిస్తాయి. రవితేజ మార్క్ మూవీ కనుక .. ఆయన అభిమానులకు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

Movie Name: Dhamaka

Release Date: 2022-12-23
Cast: Raviteja, Sreeleela, Rao Ramesh,Sachin Khedekar, Jayaram
Director: Thrinatha Rao Nakkina
Producer: Abhishek Agarwal
Music: Bheems
Banner: People Media Factory

Dhamaka Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews