ఓటీటీ రివ్యూ: 'మీట్ క్యూట్' (సోని లివ్)

  • సోని లివ్ నుంచి వచ్చిన తెలుగు వెబ్ సిరీస్
  • ఐదు కథల సమాహారంగా రూపొందిన 'మీట్ క్యూట్'
  • నాని నిర్మాతగా ఆయన సోదరి దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్
  • అయిదు కథల్లో 'ఇన్ లవ్' ఎపిసోడ్ కే ఎక్కువ మార్కులు
  • నిదానంగా నడిచే కథలు .. సాగదీసే సంభాషణలు  
  • ప్రతి కథను కొసమెరుపుతో ముగించడమే ప్రత్యేకత 
తెలుగు సాహిత్యంలో ఏ కథను ఆ కథగా ఆవిష్కరిస్తూ, కొన్ని కథలను కలిపి ఒక పుస్తకంగా అందించిన రచయితలు ఎంతోమంది ఉన్నారు. ప్రతి కథ చివరిలోను ఒక మెలిక .. మెరుపు ఉండేవి. అప్పటి వరకూ సాధారణంగా అనిపించిన కథ, చివరిలోని అనూహ్యమైన మెరుపు కారణంగా ఆశ్చర్య పరుస్తూ అన్నిభూతిని కలిగిస్తుంది. బుల్లితెరపై అలాంటి కథలను ఆవిష్కరించిన ఘనత కె. బాలచందర్ కి దక్కుతుంది. ఏ కథకి ఆ కథగా అప్పట్లో ఆయన అందించిన 'బుల్లితెర కథలు' విశేషమైన ఆదరణ పొందాయి. 

అదే తరహాలో ఇప్పటి ట్రెండుకి తగినట్టుగా వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ 'మీట్ క్యూట్' అని చెప్పచ్చు. నాని సొంత బ్యానర్లో ఆయన అక్కయ్య దీప్తి గంటా దర్శకురాలిగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 'సోని లివ్'లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. విజయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఐదు కథలు ఉంటాయి. అనుకోకుండా పరిచయం ఏర్పడిన ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలు .. ఎమోషన్స్ ఎలా ఉంటాయనేది ఆవిష్కరించడమే 'మీట్ క్యూట్' లోని ప్రధానమైన ఉద్దేశం.

ఈ వెబ్ సిరీస్ లో మొదటి కథగా 'మీట్ ది బాయ్' కనిపిస్తుంది. మ్యాట్రిమొని ద్వారా స్వాతి (వర్ష బొల్లమ్మ) తల్లిదండ్రులకు అభి (అశ్విన్ కుమార్) నచ్చుతాడు. ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న స్వాతి, అతణ్ణి కలుసుకుని మాట్లాడే ఏర్పాటు చేస్తారు. వాళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే సంభాషణ ఎలాంటిది? ఆ పరిచయం వాళ్ల పెళ్ళివారకూ వెళుతుందా? అనేది కథ. 

ఇక రెండవ కథ 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' .. ఈ కథలో సత్యరాజ్ - రుహాని శర్మ ప్రధానమైన పాత్రలుగా  కనిపిస్తాయి.  అనుకోకుండా సరోజ (రుహాని శర్మ)కి .. జర్నలిస్టుగా పనిచేసిన సత్యరాజ్ తో పరిచయమైవుతుంది. అక్క్కడ వారిద్దరూ ఒకరి జెఈవితానికి సంబంధించిన విషయాలను ఒకరు పంచుకుంటారు. ఆ సంభాషణ వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందనేదే ఈ కథ. 

ఇక మూడో కథగా 'ఇన్ లవ్' కనిపిస్తుంది. పద్మ (రోహిణి) తన స్నేహితురాలైన లక్ష్మి కారులో కూరగాయల మార్కెట్ కి వెళుతూ, తన కొడుకు ఒక అమ్మాయితో బైక్ పై వెళ్లడం చూస్తుంది. ఆ యువతి ఆ బైక్ దిగిన చోటునే తానూ కారు దిగిపోయి వెనకే వెళుతుంది. ఆ అమ్మాయి పేరు పూజ అనీ .. ఆమెతో తన కొడుకు సిద్ధూ ప్రేమలో ఉన్నాడని తెలుసుకుంటుంది. ఆల్రెడీ పూజ ఒకరిని పెళ్లి చేసుకోవడం .. విడిపోవడం కూడా జరిగిపోయిందనే విషయాన్ని తాను ఎవరనేది చ్చేప్పకుండానే పూజ నుంచి రాబడుతుంది. ఆ తరువాత అఆమే ఏం చేస్తుంది అనేదే సస్పెన్స్. 

నాల్గొవ కథ శివ కందుకూరి - ఆదా శర్మ మధ్య నడుస్తుంది. అతను ఒక డాక్టర్ .. ఆమె ఒక హీరోయిన్. ఒక రాత్రివేళ తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఆమెకి తన కార్లో లిఫ్ట్ ఇస్తాడు. ఢిల్లీ లో ఉంటూ వచ్చిన అతనికి, ఇక్కడ ఆమె పెద్ద స్టార్ అనే సంగతి తెలియదు. ఆమెను ఇంటివరకూ డ్రాప్ చేసే అవకాశం లేకపోవడంతో తన  ఫ్లాట్ కి తీసుకుని వెళతాడు. అక్కడ ఏం జరుగుతుందనేది కథ. 

ఐదవ కథ 'ఎక్స్ గర్ల్ ఫ్రెండ్'. అజయ్ అనే వ్యక్తి గురించి అతనితో ఉంటున్న అంజన .. అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కిరణ్ (సునైనా)కు మధ్య జరిగే సంభాషణ. అజయ్ ధోరణి పట్ల అంజన అసహనాన్ని వ్యక్తం చేస్తే, తొందరపడి అతణ్ణి వదులుకోవద్దని కిరణ్ చెబుతుంది. ఇలా సముద్ర తీరంలో ఇద్దరి సంభాషణ సాగుతుంది. అజయ్ అంత మంచివాడైతే అతనితో బ్రేకప్ ఎందుకు జరిగిందని కిరణ్ ను అంజన అడుగుతుంది. అప్పుడు ఆమె ఏం చెబుతుంది? అనేదే కొసమెరుపు. 

ఈ ఐదు కథలు కూడా టైటిల్ కి తగినట్టుగానే కొనసాగుతాయి. ప్రధానమైన పాత్రల మధ్య సున్నితమైన ఎమోషన్స్ తో నడుస్తాయి. ఒక కొసమెరుపు తో .. మంచి ఫీల్ తో ఈ కథలు ముగుస్తాయి. గతంలో కొన్ని సినిమాల ముగింపును ప్రేక్షకుల ఊహకు వదిలేసేవారు. ఇదే ప్రక్రియ నవలా సాహిత్యంలోను కనిపించేది. అలాగే కొన్ని ఎపిసోడ్స్ ముగింపును ఆడియన్స్ ఊహకు వదిలేశారు. 

అయితే కథ చివర్లో కనిపించే ఆ ఛమక్కు కోసం .. మొదటి నుంచి చివరివరకూ సంభాషణలను సాగదీస్తూ వెళ్లడం బోర్ అనిపిస్తుంది. రెండేసి పాత్రలు కెమెరా ముందు కదలకుండా కూర్చుని ఎక్కువ సేపు మాట్లాడుకోవడం కాస్త ఇబ్బంది పెడుతుంది. కథలు .. పాత్రలు .. సంభాషణలు హైటెక్ సొసైటీకి చెందినవి కావడం వలన, మిగతావారికి అంతగా కనెక్ట్ కావు. నిర్మాణ విలువల పరంగా .. టేకింగ్ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటుంది. కథాకథనాల పరంగా చూసుకుంటే,  ఆకాంక్ష సింగ్ - రోహిణి ఎపిసోడ్ 'ఇన్ లవ్' తప్ప మిగతావి అంత ఆసక్తికరంగా అనిపించవనే చెప్పాలి.

Movie Name: Meet Cute Web Series

Release Date: 2022-11-25
Cast: Sathya Raj, Rohini, Akanksha Singh, Adah Sharma, Sunaina, Ruhani Sharma, Varsha Bollamma
Director: Deepthi Ganta
Producer: Prashanthi
Music: Vijay
Banner: Wall Poster Cinema

Meet Cute Web Series Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews