ఓటీటీ రివ్యూ : 'అమ్ము'

  •  చివరి వరకూ ఎమోషన్ కి పెద్ద పీట 
  • కొత్తదనం లేని కథాకథనాలు
  • ఉత్కంఠకు దూరంగా కనిపించే సన్నివేశాలు    
  • 'అమ్ము' పాత్రకి న్యాయం చేసిన ఐశ్వర్య లక్ష్మి
  • సహజత్వాన్ని తోడుగా చేసుకుని నడిచిన సాదాసీదా కథ ఇది

నాయిక ప్రధానమైన కథలు ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతూ ఉంటాయి. అందువలన ఈ తరహా కథలకు ఓటీటీ సెంటర్స్ నుంచి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. అలాంటి ఒక కథతో రూపొందిన సినిమానే 'అమ్ము'. ఐశ్వర్యలక్ష్మి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలను పోషించారు. కల్యాణ్ సుబ్రమణియన్ - కార్తీక్ సంతానం నిర్మాతలుగా వ్యవహరించారు. కార్తీక్ సుబ్బరాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి చారుకేశ్ శేఖర్ దర్శకత్వం వహించాడు. అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజునే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది.

కథలోకి వెళితే ఇది కొత్తగా పెళ్లైన భార్యా భర్తల కథ. ఎన్నో ఆశలతో .. కలలతో తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఒక యువతి, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. తెల్లవారకముందే .. కళ్లు తెరవకముందే ఆమె కలలు చెదిరిపోవడం మొదలవుతుంది. అతణ్ణి మార్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంది. ప్రయోజనం కనిపించకపోవడంతో తాను మారడం తప్ప మరో మార్గం లేదని భావిస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుందనేదే కథ. 

అమ్ము ( ఐశ్వర్య లక్ష్మి) .. రవీంద్రనాథ్ (నవీన్ చంద్ర) పెళ్లి చేసుకుంటారు. రవి పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తుంటాడు. హౌస్ వైఫ్ గా ఉంటూ ఆమె అతనికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటుంది. పెళ్లైన కొత్తలో రవి ఆమెతో బాగానే ఉంటాడు. ఆ తరువాత ఆమెను మానసికంగా .. శారీరకంగా హింసించడం మొదలుపెడతాడు. అత్తామామల దగ్గర మంచివాడిలా నటిస్తూ, ఎవరూ లేని సమయంలో అమ్ముకి నరకం చూపిస్తూ ఉంటాడు. ఇక భరించలేక ఆమె అతని నిజస్వరూపం గురించి పుట్టింటి వారికి చెబుతుంది. ఒక బిడ్డ పుడితే పరిస్థితులు సర్దుకుంటాయని వాళ్లు నచ్చజెబుతారు. 

అలాంటి వ్యక్తికి బిడ్డను కనగూడదని అమ్ము పిల్స్ వాడుతుంది. కానీ ఆమెకి తెలియకుండా రవి ఆ టాబ్లెట్స్ మార్చడం వలన ఆమె నెల తప్పుతుంది. తన గర్భాన్ని ఉంచాలా .. తీసేయాలా? అనే విషయంలో ఆమె తర్జన భర్జనలు పడుతుంది. బిడ్డ కోసం కూడా అతణ్ణి భరించడం కష్టమనే విషయం ఆమెకి అర్థమయిపోతుంది. రవి నిజస్వరూపం లోకానికి తెలిసేలా చేయాలని నిర్ణయించుకుంటుంది. అయిష్టంగానే భర్తకి భోజనం తీసుకుని స్టేషన్ కి వెళ్లిన అమ్ము .. అక్కడ 'ప్రభు' అనే నేరస్థుడిని చూస్తుంది. రెండు హత్యలు చేసి శిక్షను అనుభవిస్తూ, చెల్లి పెళ్లిని చూడటానికి అతను పడుతున్న తాపత్రయాన్ని ఆమె అర్థం చేసుకుంటుంది. 

ఆ ఖైదీలోని నిజాయితీని అమ్ము గ్రహిస్తుంది. తాను అనుకున్నది సాధించడానికి అతని సహకారం అవసరమని భావిస్తుంది. అతను ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి కారణమవుతుంది. ఆ తరువాత ప్రభు ఏం చేస్తాడు? అతని ద్వారా అమ్ము అనుకున్నది సాధించగలుగుతుందా? తనని ఉచ్చులో బిగించింది తన భార్యేనని తెలుసుకున్న రవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

కథా పరంగా చూసుకుంటే ఎలాంటి కొత్తదనం కనిపించదు. కథనం పరంగా చూసుకుంటే అంత ఆసక్తికరంగాను అనిపించదు. పాత్రల వైపు నుంచి చూసుకుంటే ప్రధానమైన పాత్రలు మూడు మినహా .. మిగతా పాత్రలలో చెప్పుకోదగిన ఆర్టిస్టులు కనిపించరు. సినిమా కాకుండా సీరియల్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. హీరో అప్పటికప్పుడు మంచిగా .. ఆ వెంటనే క్రూరంగా మారిపోతూ ఉంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేదనే క్లారిటీ ఎక్కడా ఉండదు. భార్య పట్ల అనుమానంతో ఉంటాడు ..  అందుకు కారణాలు కనిపించవు. పోనీ శాడిస్ట్ అనుకుందామా అంటే, భార్యను హింసిస్తూ .. ఆమె బాధపడుతూ ఉంటే ఆనందాన్ని పొందడంలాంటివి లేవు.  

మొత్తం మీద ఆ పాత్ర పై కాస్త క్లారిటీ అవసరం అని మాత్రం అనిపిస్తుంది. ఇక 'అమ్ము' పాత్ర విషయంలో మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. ఆ పాత్రలోని ఎమోషన్స్ చూసేవారికి కనెక్ట్ అవుతాయి. ఇక బాబీ సింహా పాత్ర రెండు హత్యలు చేశాడని అంటారు .. ఎందుకో తెలియదు. చెల్లెలు అతణ్ణి ద్వేషిస్తూ ఉంటుంది .. కారణం అర్థం కాదు. అతని ఫ్లాష్ బ్యాక్ ను అర్థమయ్యేలా చెప్పలేకపోయారని అనిపిస్తుంది. మూడు ప్రధానమైన పాత్రలలో ముగ్గురూ బాగానే చేశారు. తమ పాత్రలకు న్యాయం చేశారు. 

భరత్ కుమార్ స్వరపరిచిన పాటల్లో సాహిత్యం పరంగా ఏం చెప్పాలనుకున్నారనేది అర్థం కాదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా సన్నివేశాల నుంచి విడిపోయినట్టుగా అనిపిస్తుంది. పద్మావతి మల్లాది సమకూర్చిన సంభాషణలు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తాయి. హీరోయిన్ అనుభవిస్తున్న ఘర్షణ డైలాగ్స్ రూపంలో  పెద్దగా ఉండదు గనుక, పదునైన సంభాషణలకి అవకాశం లేకుండా పోయింది. ఇక అపూర్వ అనిల్ ఫొటోగ్రఫీ ... రాధ శ్రీధర్ ఎడిటింగ్ విషయానికొస్తే ఓకే అనిపిస్తాయి. 

ఇలాంటి కథలు ఇంతకుముందు వచ్చినవే .. ఇలాంటి ముగింపులు ఇంతకుముందు చూసినవే. కథలో ఎక్కడా ఆశ్చర్యపోయేంత ట్విస్టులు ఉండవు .. అనుకోని మలుపులు ఉండవు. సాదాసీదాగా .. ప్రేక్షకులు ముందుగానే అంచనాల వేసేలా సాగిపోతుంది. నెక్స్ట్ ఏం జరగనుంది? అనే ఉత్కంఠ ఎక్కడా కలగదు. చెప్పదలచుకున్న విషయాన్ని  ఎలాంటి హంగూ .. ఆర్భాటం లేకుండా సహజత్వానికి దగ్గరగా మాత్రం చెప్పగలిగారంతే. 




Movie Name: Ammu

Release Date: 2022-10-19
Cast: Naveen Chandra, Aishwarya Lakshmi, Bobby Simha
Director: Charukesh Sekhar
Producer: Kalyan SSubramaniyan
Music: Bhartha Shankar
Banner: Stone Bench Productions

Ammu Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews