మలయాళ సినిమాలలో కథాబలం కలిగినవిగా .. సహజత్వానికి దగ్గరగా ఉన్నవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ తరహా సినిమాలు, ప్రేక్షకుల హృదయాలను బలంగా టచ్ చేస్తాయి. అలాంటి సినిమాగా 'జననం 1947 ప్రాణాయం తుదారున్ను' కనిపిస్తుంది. అభిషేక్ అశోకన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ప్రణయం 1947' టైటిల్ తో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అది ఒక మారుమూల గ్రామం. 70 ఏళ్ల వయసు దాటిన శివన్ అక్కడ నివసిస్తూ అంటాడు. ఇద్దరు కొడుకులూ అతనికి దూరంగా ఉంటూ ఉంటారు. 12 ఏళ్ల క్రితం తనభార్య చనిపోయిన దగ్గర నుంచి అతను ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. పొలం దగ్గరే కట్టుకున్న ఇంట్లో ఉంటూ .. పొలం పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే గల ఊళ్లోని వృద్ధుల శరణాలయంలో కొంతసేపు పనిచేసి, తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. సుదీప్ వంటి కొంతమంది సన్నిహితులు అతనికి సాయపడుతూ ఉంటారు.
వృద్ధుల శరణాలయంలో గౌరీ ఉంటుంది. గతంలో టీచర్ గా పనిచేసిన గౌరీని ఆమె కొడుకు వివేక్ అక్కడ చేర్పించి వెళతాడు. అయితే సొంత ఇంటిపై ఆమె బెంగపెట్టుకుని భారంగా రోజులు గడుపుతూ ఉంటుంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న శివన్, తనతో కలిసి బ్రతకాలనుకుంటే తనకి అభ్యంతరం లేదని చెబుతాడు. కొడుకులతో ఈ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటారు. పొలాల మధ్యలో ఉన్న శివన్ ఇల్లు, గౌరీకి ఎంతో నచ్చుతుంది.
ఒక రోజున శివన్ చిన్న కొడుకు రఘు వస్తాడు. తనకి గల ఆర్ధిక ఇబ్బందిని గురించి ప్రస్తావిస్తాడు. తనకి లోన్ అవసరమనీ, అందుకు గాను ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టాలని చెబుతాడు. ఆ ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వమని గొడవకు దిగుతాడు. అప్పుడు శివన్ ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? కొత్తగా ఏర్పడిన బంధం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.
విశ్లేషణ: భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడతారు .. ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లలకి సంబంధించిన వేడుకలను ఒక పండుగలా చేస్తారు. అయితే పెళ్లి అయిన తరువాత పిల్లలు మారిపోతుంటారు. భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన తమ తల్లిని పట్టించుకోరు .. భార్యను పోగొట్టుకుని దిగాలు పడిపోయిన తమ తండ్రిని గురించిన ఆలోచన చేయరు. అలాంటి రెండు కుటుంబాల చుట్టూ అల్లుకున్న కథనే ఇది.
చాలామంది ఓడించలేనిది ఒంటరితనమేనని చెప్పాలి. ఒంటరిగా మిగిలిపోయిన మనసు ఓదార్పు కోరుకోకుండా ఉండదు. జీవితమంతా త్యాగాలు చేయడమే సరిపోయింది. ఇక ఈ నాలుగు రోజులు మనం కోసం బ్రతుకుదాము అనుకోని వాళ్లంటూ దాదాపుగా ఉండరు. శాశ్వతమని భావించిన బంధాలు దూరమైనప్పుడు డీలాపడిపోకుండా, స్వేచ్ఛగా మరికొంత దూరం ప్రయాణం చేయడానికి ప్రయత్నించిన రెండు మనసుల కథ ఇది.
పనితీరు: ఇది ఒక కథ అని చెప్పలేము .. ఎంతోమంది జీవితాలకు ప్రతిబింబం. రెండు స్వచ్ఛమైన మనసులు కలిసి చేసే ఈ ప్రయాణానికి దర్శకుడు ఎంచుకున్న గ్రామీణ నేపథ్యం ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. సున్నితమైన భావోద్వేగాలను బలంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే అనాలి.
సంతోష్ కెమెరా పనితనం బాగుంది. పల్లె అందాలు ఆయన ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. గోవింద్ వసంత నేపథ్య సంగీతం మెప్పింస్తుంది. అలాగే కిరణ్ దాస్ ఎడిటింగ్ కూడా బాగుంది. చిన్న బడ్జెట్ లో .. సింపుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, ఎమోషన్స్ ను కనెక్ట్ చేస్తుందని చెప్పచ్చు.
ముగింపు: నీవాళ్లు మాత్రమే నిన్ను అర్థం చేసుకుంటారని అనుకోకు .. నిన్ను అర్థం చేసుకున్నవారినే నీవాళ్లుగా భావించు. ఇక్కడ ఎవరి త్యాగాలకు విలువ ఉండదు .. రాలిపోయే వరకూ రాళ్లదారులు దాటుతూ వెళ్లవలసిందే అనే సందేశంతో కూడిన ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది.
'ప్రణయం 1947' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews

Pranayam 1947 Review
- మలయాళంలో రూపొందిన సినిమా
- తెలుగులో అందుబాటులోకి
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కంటెంట్
- ఆలోచింపజేసే సందేశం
Movie Name: Pranayam 1947
Release Date: 2025-04-23
Cast: Jayarajan, Leela Samsan, Deepak, Animole, Ali
Director: Abhijith Asokan
Music: Govind Vasantha
Banner: Crayons Pictures
Review By: Peddinti
Pranayam 1947 Rating: 2.50 out of 5
Trailer