'ది లాస్ట్ ఆఫ్ అజ్ 2' అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్. పెడ్రో పాస్కల్ .. బెల్లా రామ్సే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ఫస్టు సీజన్ 2023లో స్ట్రీమింగ్ అయింది. 9 ఎపిసోడ్స్ గా ఫస్టు సీజన్ ను అందించారు. ఇండియాలోను ఈ సిరీస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీజన్ 2 కోసం అంతా ఆసక్తితో వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ మొదలైంది. సీజన్ 2లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండగా, ప్రతి సోమవారం ఒక ఎపిసోడ్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
కథ: సీజన్ 1లో కథ 1968లో మొదలై .. 2003లో కొంతవరకూ ప్రయాణించి, ఆ తరువాత 2023కు చేరుకుంటుంది. జోయెల్ (పెడ్రో పాస్కల్) తన కూతురు సారా (నికో పార్కర్) తో కలిసి జీవిస్తూ ఉంటాడు. ప్రమాదకరమైన వైరస్ .. బ్యాక్టీరియా మాత్రమే కాదు, ఫంగస్ కూడా తీవ్రమైన స్థాయిలో మానవాళిపై దాడి చేయగలదనే వార్తలు మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. అలాంటి ఫంగస్ తమ సిటీలోకి కూడా విస్తరించిందని జోయల్ కి తెలుస్తుంది. దాంతో అతను తన కూతురు 'సారా'ను కాపాడుకోవడం కోసం సిటీ విడిచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు.
ఫంగస్ సోకినా వాళ్లంతా జాంబీల తరహాలో వికృతంగా మారిపోయి .. మృగాల మాదిరిగా ఒకరిని ఒకరు పీక్కుని తింటూ ఉంటారు. వాళ్ల బారి నుంచి 'సారా'ను తప్పించడానికి అతను చేసిన ప్రయత్నం ఫలించకుండా పోతుంది. ఫంగస్ కి విరుగుడు లేకపోవడంతో, అది సోకిన వారిని చంపడం కోసం ఆర్మీ ప్రయోగించిన బాంబులతో నగరాలన్నీ కూడా శిధిలమై పోతాయి. కూతురు చనిపోయిందనే బాధతోనే జోయెల్ 20 ఏళ్లు గడిపేస్తాడు.
ఫంగస్ కారణంగా చనిపోయినవారు చనిపోగా, మిగిలినవారు నగరాలను ఆక్రమిస్తారు. దాంతో ఫంగస్ బారి నుంచి తప్పించుకున్నవారి జీవితం దుర్భరంగా మారుతుంది. అయితే ఎలీ (బెల్లారామ్సే) అనే టీనేజ్ అమ్మాయికి ఫంగస్ సోకినా, ఆమెపై అది పెద్దగా ప్రమాదం చూపలేకపోతుంది. ఆమెలో ఆ ఫంగస్ ను ఎదుర్కునే ఇమ్యూనిటీ ఉంటుంది. దాంతో ఆమెను సేఫ్ గా 'ల్యాబ్'కు తరలించే బాధ్యత జోయెల్ కి అప్పగించబడుతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే ప్రయాణంగా ఫస్టు సీజన్ నడుస్తుంది.
సీజన్ 2లో .. ఫంగస్ సోకినవారు ప్రవేశించకుండా, ఒక ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని మిగతా వారంతా అక్కడ జీవిస్తూ ఉంటారు. గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా, జోయెల్ పై 'ఎలీ' చాలా కోపంగా ఉంటుంది. అతను మాత్రం ఆమెను ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు. అలాంటి ఎలీని ఒక జాంబీ గాయపరుస్తుంది. అయితే ఆ విషయాన్ని ఆమె జోయెల్ తో పాటు ఎవరికీ చెప్పకుండా దాచిపెడుతుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.
విశ్లేషణ: భయంకరమైన ఫంగస్ ను తట్టుకుని జీవించగలిగే ఇమ్యూనిటీ తనకి ఉందని తెలియక 'ఎలీ' సాగించే ప్రయాణం ఫస్టు సీజన్ గా ప్రేక్షకులను పలకరిస్తుంది. తనకి ఫంగస్ సోకినా పెద్దగా ప్రమాదం ఉండదనే నిర్లక్ష్యంతో 'ఎలీ' ఉండటం వలన ఏం జరిగిందనేది సీజన్ 2 కథగా వచ్చింది. ఈ సారి ఆమె హీరో పర్యవేక్షణలో కాకుండా ఆయనకి దూరంగా ఉండటం, ఆడియన్స్ లో మరింత కుతూహలాన్ని పెంచే అంశంగా చెప్పుకోవాలి.
సీజన్ 1కి ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అనవసరమైన సన్నివేశాలు .. సాగతీత సన్నివేశాలు లేకపోలేదు. ఫంగస్ కారణంగా నగరాలు .. నగరాలు శ్మశానాలుగా మారిపోయిన తీరును మాత్రం సహజత్వానికి చాలా దగ్గరగా చిత్రీకరించారు. హీరో .. ఎలీ కలిసి ప్రయాణించే పర్వత ప్రాంతాలకు సంబంధించిన లోకేషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. సీజన్ 2లోను లొకేషన్స్ మంచి మార్కులు కొట్టేస్తాయని అనిపిస్తోంది.
పనితీరు: హాలీవుడ్ సినిమాల స్థాయికి తగ్గని నిర్మాణ విలువలు ఈ సిరీస్ లో మనకి కనిపిస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. సహజంగానే సిరీస్ లలో కాస్త సాగతీత ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అందువలన అది ఎడిటింగ్ వైపు నుంచి లోపంగా చెప్పలేము. ఆర్టిస్టులంతా తమ పాత్రలలో సహజంగా నటించారు.
ముగింపు: సీజన్ 2కి సంబంధించిన 7 ఎపిసోడ్స్ లో ఒకటి మాత్రమే స్ట్రీమింగ్ అయింది. మిగతా ఎపిసోడ్స్ ప్రతి సోమవారం ఒకటి చొప్పున వదలనున్నారు. ఈ సిరీస్ లో జాంబీలు చాలా వికృతంగా కనిపిస్తాయి. జుగుప్స కరమైన ఆకారాలు .. హింస .. రక్తపాతం కళ్లముందు నానా హడావిడి చేస్తాయి. అందువలన ఈ జోనర్ ను ఇష్టపడేవారు .. ఫ్యామిలీతో కాకుండా చూడటమే బెటర్.
'ది లాస్ట్ ఆఫ్ అజ్ 2' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
| Reviews

The Last Of Us 2 Review
- 2023లో వచ్చిన ఫస్టు సీజన్
- ప్రపంచవ్యాప్తంగా లభించిన స్పందన
- నిన్నటి నుంచి ఓటీటీకి వచ్చిన సీజన్ 2
- అందుబాటులోకి వారానికి ఒక ఎపిసోడ్
- ఈ జోనర్ అలవాటున్నవారు చూడొచ్చు
Movie Name: The Last Of Us 2
Release Date: 2025-04-14
Cast: Pedro Pascal, Bella Ramsey, Gabriel Luna, Isabela Merced
Director: Craig Mazin - Neil Druckmann
Music: -
Banner: HBO Original
Review By: Peddinti