ఒక వైపున సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న జీవీ ప్రకాశ్ కుమార్, మరో వైపున కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అలా తన కెరియర్లో ఆయన చేసిన 25వ సినిమానే 'కింగ్ స్టన్'. ఫాంటసీ హారర్ అడ్వెంచర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించాడు.మార్చి 7వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: ఈ కథ 1982లో మొదలవుతుంది. తమిళనాడులోని సముద్ర తీరప్రాంతాలలో 'తూవత్తూర్' ఒకటి. అక్కడి జాలరులంతా చేపలవేటపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వలన ఆ గ్రామానికి చెందిన బోసయ్య అనే వ్యక్తిని గ్రామస్తులంతా కొట్టి చంపుతారు. అతని శవాన్ని ఊళ్లో పాతిపెట్టిన దగ్గర నుంచి విపరీతాలు జరుగుతుండటం గమనిస్తారు. అక్కడి నుంచి ఆ శవపేటికను తీసి, సముద్రంలో పైకి తేలకుండగా జలసమాధి చేస్తారు.
అయితే అప్పటి నుంచి సముద్రంలోకి వెళ్లిన జాలరులు శవాలుగా తీరానికి కొట్టుకు వస్తుంటారు. బోసయ్య ప్రేతాత్మ ఇందుకు కారణమనే భయం అందరిలో మొదలవుతుంది. మరో వైపున కొందరు మూఢ నమ్మకాలతో సముద్రానికి ఆడపిల్లలను 'బలి' ఇస్తుంటారు. ప్రభుత్వం ఆ తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తుంది. తన తండ్రి కూడా ఆ సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడంతో, కింగ్ తన తాత దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. జీవనోపాధి కోసం పక్క ఊరుకు చెందిన థామస్ దగ్గర పనిచేయడం మొదలుపెడతాడు.
థామస్ ఓ దుర్మార్గుడు .. అరాచకాలు .. అక్రమ వ్యాపారాలు తప్ప మానవత్వం ఏ కోశానా లేని మనిషి. తన గూడెం ప్రజల జీవితాలు అతని కారణంగా మరింత దిగజారడం గమనించిన కింగ్, తమ తీరంలోని సముద్రంలో నుంచి బోసయ్య శవపేటికను తీసేస్తే, జనమంతా ధైర్యంగా చేపలవేట చేసుకుని ప్రశాంతంగా బ్రతుకుతారని భావిస్తాడు. అందుకోసం తన స్నేహితులను వెంటబెట్టుకుని సముద్రంలోకి వెళతాడు. సముద్రంపై అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయా? కింగ్ తాను అనుకున్నది సాధించగలుగుతాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: సాధారణంగా సముద్రం నేపథ్యంలోని కథలు, సాహసవంతమైనవిగా కొనసాగుతూ ఉంటాయి. చేపలు పట్టడంలో ఎదురయ్యే ప్రమాదాలు .. అక్రమ రవాణా నేపథ్యంలో ఎదురయ్యే ఆపదలు .. నిధుల కోసం సముద్ర గర్భానికి వెళ్లడం వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ కథలు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ అంశాలకు ఈ సారి హారర్ పాళ్లను కూడా మిక్స్ చేసిన కథాంశం మనకి 'కింగ్ స్టన్' సినిమాలో కనిపిస్తుంది.
కథానాయకుడు ఎప్పుడూ కూడా తన ఊరు కోసం .. తన వర్గం కోసం పోరాటం చేస్తాడు. అందుకోసం అవసరమైతే తన ప్రాణాలను అర్పించడానికి సైతం సిద్ధపడతాడు. తనవారి ఉపాధి కోసం తాను సముద్రంలో ప్రమాదానికి ఎదురుగా వెళ్లే ఈ కథను దర్శకుడు తయారు చేసుకున్నాడు. సముద్రం నేపథ్యంలో కథలు దాదాపు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అయితే ఈ కథ విషయానికి వచ్చేసరికి, స్క్రీన్ ప్లే పరంగా కాస్త గందరగోళం కనిపిస్తుంది.
హీరోకి ఒక లవర్ ఉంటుంది .. కానీ లవ్ .. రొమాన్స్ వైపు దర్శకుడు దృష్టిపెట్టలేదు. సముద్రంపై ప్రమాదాలు .. అనుకోకుండా ఎదురయ్యే ఆపదలో చిక్కుకోవడం వంటివి ఎక్కువ కుతూహలాన్ని పెంచుతాయి. అయితే అందుకు భిన్నంగా దెయ్యాలదాడిని చూపించారు. ఇది ఆడియన్స్ కి నమ్మబుల్ గా అనిపించదు గనుక కనెక్ట్ కాలేకపోతారు. ఎమోషన్స్ తో ముడిపెట్టకపోవడం వలన ఇది ఒక హడావిడిగా మాత్రమే అనిపిస్తుంది.
పనితీరు: సముద్రాన్ని ప్రేతాత్మ ఆక్రమించడం .. హీరో బృందం అనుకోవడమే ఆలస్యం సముద్రంలో నుంచి తీరానికి వచ్చేయడం వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. హీరోతో గ్యాప్ రాకూడదన్నట్టుగా హీరోయిన్ ను కూడా బోట్ లోకి తెస్తారు. అందువలన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. కథకి ప్రధానమైన బలం ఏదైనా ఉందీ అంటే అది గోకుల్ బెనోయ్ ఫొటోగ్రఫీనే. హీరో బృందం నిజంగానే సముద్రం మధ్యలో ఉన్న ఫీల్ ను వర్కౌట్ చేయగలిగాడు. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం .. సాన్ లోకేశ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.
ముగింపు: నిధితో ముడిపడిన కథలు .. స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే కథలు .. దెయ్యాల చుట్టూ తిరిగే కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. అందువలన దర్శకుడు ఈ మూడు ట్రాకులను కలిపేస్తూ ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఎటువైపు నుంచి ఎలాంటి ఎమోషన్స్ ను బలంగా అల్లుకోకపోవడం వలన హీరో చేసే అడ్వెంచర్ హడావుడి మాదిరిగా అనిపిస్తుంది.
నిర్మాణ విలువల పరంగా .. విజువల్స్ పరంగా వంకబెట్టవలసిన పనిలేదు.సెకండాఫ్ లో మంచి ట్విస్ట్ ఉంది .. కానీ అక్కడ ఏం జరుగుతుందనేది సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. కథను లాజిక్ కి దూరంగా .. గందరగోళంగా చెప్పడమే ఇబ్బంది పెడుతుందంతే.
'కింగ్ స్టన్' (జీ 5) మూవీ రివ్యూ!
| Reviews

Kingston Review
- తమిళంలో నిర్మితమైన 'కింగ్ స్టన్'
- నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్
- ఓ మాదిరిగా నడిచే కథాకథనాలు
- ఎమోషన్స్ లోపించిన కంటెంట్
Movie Name: Kingston
Release Date: 2025-04-13
Cast: GV Prakash Kumar, Divyabharathi, Chethan, Azhagan Perumal, Sabumon
Director: Kamal Prakash
Music: GV Prakash Kumar
Banner: Parallel Universe
Review By: Peddinti
Kingston Rating: 2.00 out of 5
Trailer