'కాఫిర్' (జీ 5) మూవీ రివ్యూ!

| Reviews
Kaafir

Kaafir Review

  • 2019లో సిరీస్ గా వచ్చిన 'కాఫిర్'
  • సినిమాగా మలచబడిన కంటెంట్ 
  • ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • నిదానంగా సాగిన సెకండాఫ్  

2019  జూన్ 15వ తేదీన హిందీలో 'కాఫిర్' అనే సిరీస్ 'జీ 5'లో స్ట్రీమింగ్ అయింది. 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ఆడియన్స్ ను పలకరించింది. ఈ మధ్య కాలంలో సిరీస్ లు సినిమా రూపాన్ని సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సిరీస్ కూడా ఇప్పుడు సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమా 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. దియా మీర్జా - మోహిత్ రైనా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ప్పుడు చూద్దాం. 

కథ: కైనాజ్ (దియా మీర్జా) పాకిస్థాన్ కి చెందిన యువతి. అక్కడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమెకి, ఫరూక్ తో వివాహమవుతుంది. అయితే ఆమెకి సంతానం లేదనే నింద వేసి, ఆమె భర్త మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. దాంతో ఆమె మనసు ముక్కలవుతుంది. దాంతో ఇక బ్రతకడంలో అర్థం లేదని భావించి 'నది'లో దూకేస్తుంది. అయితే నది ప్రవాహంలో కొట్టుకుపోతూ భారత నియంత్రణ రేఖను దాటుతుంది. 

సరిగ్గా ఆ సమయంలోనే ఆ నదీ తీరంలో కొంతమంది మిలిటెంట్లను ఇండియన్ ఆర్మీ పట్టుకుంటుంది. అలా వాళ్లతో పాటు తీవ్రవాది అనే ముద్రతో ఆమె కూడా జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలోనే ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ పాపకు 'సెహర్' అని నామకరణ చేస్తారు. తీవ్రవాదుల దాడిలో తన తమ్ముడిని కోల్పోయిన వేదాంత్, కైనాజ్ కు విముక్తిని కలిగించాలని నిర్ణయించుకుంటాడు.

ఆర్మీకి తాను దొరికినప్పుడు తనకి 15 నెలల శిక్షను మాత్రమే విధించారనీ, కానీ తాను జైల్లో ఏడేళ్లుగా మగ్గుతున్నానని కైనాజ్ చెబుతుంది. తాను గర్భవతిగా ఉన్న విషయం, తాను ప్రాణాలతో బయటపడిన తరువాతనే తెలిసిందని అంటుంది. దాంతో ఆమెను జైలు నుంచి విడిపించడానికి అతను గట్టిగా ప్రయత్నించడం మొదలుపెడతాడు. అప్పుడు ఆమె కొన్ని విషయాలలో తనకి అబద్దం చెప్పిందనే సంగతి వేదాంత్ కి అర్థమవుతుంది. ఆమె దాచిన ఆ విషయాలేమిటి? అందుకు గల కారణాలు ఏమిటి? అతను ఆమెకి మాత్రమే సాయం చేయాలనుకోవడానికి కారణాలు ఏమిటి? అనే అంశాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు సాగుతుంది.   

విశ్లేషణ: 'కాఫిర్' .. బాలీవుడ్ నుంచి బరిలోకి దిగిన భారీ వెబ్ సిరీస్ లలో ఒకటి. నిర్మాణ విలువల పరంగా చూసుకుంటే, ఇది బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఎంతమాత్రం తీసిపోదు. కథకి తగిన లొకేషన్స్ విషయంలో ఎంతమాత్రం రాజీపడకుండా ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్ తో కూడిన సిరీస్ గా ఈ కంటెంట్ ను అందించిన సంగతి తెలిసిందే. కానీ సినిమా చూస్తుంటే ఎక్కడ నిడివిని తగ్గించారనేది తెలియకుండా జాగ్రత్తపడ్డారు. 

అయితే ఒక కథను సిరీస్ గా చెప్పడం వేరు .. సినిమాగా చూపించడం వేరు. సిరీస్ ను నిదానంగా చూపించినా ఆడియన్స్ చూస్తారు. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి కథనాన్ని వేగంగా పరుగులు తీయించాలి. ఈ విషయంలోనే ఈ సినిమా సెకండాఫ్ దెబ్బతిందని చెప్పాలి. కథ ఇంకా ఒక గంటసేపు ఉందనే దగ్గర నుంచి నిదానంగా నడవం మొదలుపెడుతుంది.చివరివరకూ అదే పద్ధతిని పాటిస్తూ అసహనాన్ని కలిగిస్తుంది.

పనితీరు:  దర్శకుడు ప్రధానమైన పాత్రల చుట్టూ అల్లుకున్న సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే అందుకు తీసుకున్న సమయం ఎక్కువగా అనిపిస్తుంది. 'ఎవరైనా కలిసి ఉండటం కోసం పోరాటం చేస్తారు .. మేం మాత్రం విడిపోవడం కోసం పోరాడినట్టయింది" అని డైలాగ్ ఈ సినిమా మొత్తంలోకి హైలైట్ అని చెప్పాలి. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. కథకి తగిన లొకేషన్స్  ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి. రవి సింఘాల్ థీమ్ మ్యూజిక్ .. రాజు సింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పాలి. ప్రతీక్ షా కెమెరా పనితనం ఎక్కువ మార్కులను రాబడుతుంది. 

ముగింపు: నిర్మాణ విలువల పరంగా .. కథాకథనాల పరంగా .. చిత్రీకరణ పరంగా ఈ కంటెంట్ బాగుందని అనిపిస్తుంది. అయితే సిరీస్ లను సినిమాగా అందించడం వలన, కథనం విషయంలో తేడా కొట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలా కథనం స్లోగా అనిపించడమే ఈ సినిమా విషయంలోను జరిగింది. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు లేని ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

Movie Name: Kaafir

Release Date: 2025-04-04
Cast: Dia Mirza, Mohith Rana, Umar Sharif, Dara Sandhu
Director: Sonam Nair
Music: -
Banner: -

Kaafir Rating: 2.50 out of 5

Trailer

More Reviews