'అల్లూరి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

| Reviews
Alluri

Alluri Review

  • శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'అల్లూరి'
  • తొలిసారిగా ఆయన పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా 
  •  అనేక సమస్యల వలన పలచబడిన కథ 
  • బలమైన విలన్ లేకపోవడం ప్రధానమైన లోపం 
  • రొటీన్ కి భిన్నంగా లేని కథ     

శ్రీవిష్ణు కామెడీ టచ్ తో కూడిన రోల్స్ బాగా చేస్తాడని చాలామందికి తెలుసు. అలాంటి శ్రీవిష్ణు పూర్తి యాక్షన్ కథను ఎంచుకుని చేసిన సినిమానే 'అల్లూరి'. 2022 సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. 5 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 7 కోట్లకి పైగా వసూలు చేసింది. 'డ్రాగన్' బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా పరిచయమైంది ఈ సినిమాతోనే. ఆల్రెడీ మరో ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా, రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెట్టింది. 

కథ: రామరాజు (శ్రీవిష్ణు) వృత్తి పట్ల అంకితభావం .. ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్. అతను ఎక్కడ ఛార్జ్ తీసుకుంటే అక్కడ, అవినీతి పరులైన పై అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే స్వార్థపరులైన రాజకీయనాయకులు చిక్కుల్లో పడుతూ ఉంటారు. అందువలన రామరాజుకి బదిలీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలా అతను విశాఖ వచ్చినప్పుడు అతనికి సంధ్య (కయాదు లోహర్)తో వివాహమవుతుంది.

విశాఖలో అధికార పార్టీ నాయకుడిగా సాంబశివరావు ఉంటాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతను అనేక అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఆ చీకటి వ్యాపారాలలో ఆయన వారసులు .. ప్రధాన అనుచరుడైన కాళీ హస్తం కూడా ఉంటుంది. అయితే సాంబశివరావు ఫ్యామిలీపై ఫిర్యాదు చేసే సాహసం ఎవరూ చేయకపోవడంతో, రామరాజు ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. ఇక ఒక చిన్న మెకానిక్ గా నమ్మిస్తూ అదే సిటీలో ఉంటున్న తీవ్రవాది అలీ, రామరాజుపై కోపంతో ఉంటాడు.

ఈ నేపథ్యంలోనే 'ఫరా' అనే యువతి అదృశ్యమవుతుంది. ఆ యువతి ఆచూకీ తెలుసుకోవడానికి రామరాజు రంగంలోకి దిగుతాడు. ఫరా ఎవరు? ఆమె కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? రామరాజును అడ్డు తప్పించడానికి సాంబశివరావు ఎలాంటి ప్లాన్ చేస్తాడు? అలీ ఏం చేస్తాడు? దుర్మార్గులను ఏరివేయాలనే రామరాజు కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: అవినీతి పోలీస్ అధికారులకు రౌడీల నుంచో .. గూండాల నుంచో ప్రాణభయం ఉంటుంది. ఇక నిజాయితీ కలిగిన పోలీస్ అధికారులకి మూడు వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. ఒక వైపున అవినీతి అధికారులు .. మరో వైపున రాజకీయ నాయకులు .. ఇంకొక వైపున ఆ రాజకీయ నాయకుల అండచూసుకుని చెలరేగిపోయే రౌడీలు. ఈ ముగ్గురు నుంచి తనని .. తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రజలకి న్యాయం జరిగేలా చూసే ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఇది. 

సాధారణంగా పోలీస్ కథలలో ఒక చిన్న సమస్య పెద్దదవుతూ వెళుతుంది. విలన్ కి .. హీరోకి మధ్య మొదలైన గొడవ చిక్కబడుతూ క్లైమాక్స్ కి చేరుకుంటుంది. అయితే ఈ కథలో హీరో ముందుకు వచ్చే సమస్యలు సింగిల్ ఎపిసోడ్స్ మాదిరిగా ఉంటాయి. ఆ సమస్యలను దాటుకుంటూ హీరో ముందుకు వెళుతూ ..ఫైనల్ ఎపిసోడ్ ను టచ్ చేస్తాడు. ఇలాంటి ట్రాక్ వలన చివరి వరకూ హీరోకి బలమైన విలన్ తారసపడకపోవడం లోపంగా కనిపిస్తుంది. 

ఇక హీరో ప్రమాదకరమైన మనుషులను టచ్ చేస్తాడు. కానీ ఒంటరిగా ఉన్న భార్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోడు. దాంతో ఆమె టెన్షన్ పడటం .. హీరో డీలాపడటం జరుగుతూ ఉంటుంది. మిగతా అన్ని సినిమాలలో కనిపించే సన్నివేశాలే వీరి ట్రాక్ లో రిపీట్ అవుతూ  ఉంటాయి. ఈ సినిమాలో యాక్షన్ ఉంది .. ఎమోషన్స్ ఉన్నాయి. అయితే అవి రొటీన్ అనే ఒక మార్క్ నుంచి బయటపడలేకపోయాయి. 

పనితీరు: ఒక పోలీస్ ఆఫీసర్ తాను నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టిన క్షణం నుంచే అతనికి శత్రువులు పుట్టుకొస్తుంటారు. అప్పటి నుంచి ప్రమాదాలను ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉండాలి. అయితే ఆ ప్రమాదాలు పలకరించే విధానం .. ఆ సన్నివేశాలను డిజైన్ చేసే తీరే ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచే ప్రధానమైన అంశమని చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు కొంతవరకూ మాత్రమే సక్సెస్ కాగలిగాడు. 

ఇక టైటిల్ కి తగినట్టుగా కథ అంతా కూడా శ్రీవిష్ణు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సీరియస్ యాక్షన్ సినిమాలు కూడా చేయగలనని నిరూపించడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేశాడు. కయాదు లోహర్ గ్లామరస్ గా మెరిసింది. హీరో తరువాత చెప్పుకోవడానికి మరో బలమైన పాత్ర లేకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. రాజ్ తోట ఫొటోగ్రఫీ .. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ విషయానికి వస్తే, నిడివిని తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ వదిలేయడమే అసంతృప్తిని కలిగిస్తుంది. 

ముగింపు: తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణును చూపించడానికి చేసిన ప్రయత్నం కొత్తగా అనిపిస్తుంది. అదే సమయంలో ఆయన పాత్రకి తగిన స్థాయిలో మిగతా పాత్రలను డిజైన్ చేయకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. 

Movie Name: Alluri

Release Date: 2025-03-21
Cast: Sree Vishnu, Kayadu Lohar, Suman, Ravi Varma, Tanikella Bharani, Madhusudhan Rao
Director: Pradeep Varma
Music: Harshavardhan Rameshwar
Banner: Kucky Media

Alluri Rating: 2.25 out of 5

Trailer

More Reviews