ధన్ రాజ్ .. కమెడియన్ గా తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తూ .. ఎదుగుతూ వచ్చిన నటుడు. ఆ మధ్య ఒక సినిమా కోసం నిర్మాతగా మారిన ధన్ రాజ్, ఇప్పుడు 'రామం రాఘవం' సినిమా కోసం దర్శకుడిగా మారాడు. సముద్రఖని .. ధన్ రాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: రామం ( సముద్రఖని) ఒక రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. నిజాయితీ కలిగిన ఆఫీసర్ గా ఆయనకి మంచి పేరు ఉంటుంది. భార్య కమల (ప్రమోదిని) కొడుకు రాఘవ ( ధన్ రాజ్) ఇదే ఆయన కుటుంబం. తనకి వచ్చిన జీతంలోనే రామం కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. రాఘవకి పెద్దగా చదువు అబ్బకపోవడం .. దాంతో జాబ్ లేకుండా ఆతను బలాదూర్ తిరగడం రామానికి అసంతృప్తిని కలిగించే విషయాలు.
రాఘవ ఏ పని మొదలెట్టినా అందులో ఎదగడానికి అడ్డ దారులు వెతుకుతూ ఉంటాడు. అందుకోసం అతను చేసిన ప్రయత్నాలు వికటించి, బిజినెస్ చేయడానికి తండ్రి ఇచ్చిన 5 లక్షలను పోగొట్టుకుంటాడు. మద్యం .. జూదం వంటి వ్యాసనాలు ఉన్న రాఘవను ఒక పెట్రోల్ బంక్ లో పనికి పెడతాడు రామం. అక్కడ కూడా తన అతితెలివి తేటలు చూపించిన రాఘవ, తనిఖీ అధికారులకు దొరికిపోతాడు.
వాళ్ల బారి నుంచి బయటపడటం కోసం 'బంకు' డబ్బు 10 లక్షలను లంచంగా ఇస్తాడు. మరోసటి రోజు ఉదయం బ్యాంకులో జమ చేయవలసిన డబ్బు అది. ఆ డబ్బు సర్దుబాటు చేయడం కోసం అమలాపురం వెళ్లి, నాయుడు (సునీల్)ను కలుస్తాడు. తనకి 10 లక్షలు అప్పుగా కావాలని నాయుడిని కోరతాడు. డబ్బులు ఇవ్వడానికి తాను సిద్ధమనీ, అయితే తనకి ఒక పని చేసి పెట్టాలని నాయుడు అంటాడు. నాయుడు కోరిన ఆ సాయం ఏమిటి? డబ్బు కోసం రాఘవ ఏం చేస్తాడు? అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.
విశ్లేషణ: కుటుంబం కోసం తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో త్యాగాలు చేస్తూ ముందుకు వెళుతుంటారు. తమ పిల్లల సంతోషంలోనే తమ సంతృప్తిని వెతుక్కుంటారు. తమ పిల్లలకు అనుక్షణం రక్షణగా నిలుస్తూ, వాళ్లు ఒక గమ్యం చేరుకోవడానికి తగిన సపోర్ట్ ను ఇస్తుంటారు. అయితే తండ్రి నిజాయితీని అసమర్థతగా .. ఆయన ప్రేమను పెట్టుబడిగా అర్థం చేసుకున్న ఒక కొడుకు ఏం చేశాడనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది.
ఈ కథలో ఒక గమ్మత్తు కనిపిస్తుంది. ఈ కథకు తండ్రి కొడుకుల పాత్రలు రెండు కళ్లు. ఈ కథలో ప్రేక్షకుల వైపు నుంచి తండ్రి హీరో .. కానీ కొడుకు పాత్ర వైపు నుంచి ఆ తండ్రినే విలన్. కొడుకు ప్రయోజకుడు కాలేకపోయినందుకు బాధపడే తండ్రి. ఆయన ధారాళంగా లంచాలు తీసుకుని ఉంటే తాను మరింత ఎంజాయ్ చేసేవాడినే అని అసహనంతో రగిలిపోయే కొడుకు. ఈ రెండు పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది .. అక్కడక్కడా కన్నీళ్లు పెట్టించే ప్రయత్నం చేస్తుంది.
నిజాయితీ పరుడైన ఒక తండ్రికీ .. వ్యసనపరుడైన ఒక కొడుక్కి మధ్యలో ప్రపంచానికి తెలియకుండా జరిగే పెద్ద పోరాటమే ఈ కథ. దర్శకుడిగా ధన్ రాజ్ ఈ కథను సెట్ చేసుకోవడం వరకూ బాగుంది. అక్కడక్కడా ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నం కూడా బాగానే ఉంది. కానీ తండ్రీ కొడుకులుగా సముద్రఖని .. ధన్ రాజ్ లను ఆడియన్స్ అంగీకరించలేకపోయారేమోనని అనిపిస్తుంది. అదే ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.
పనితీరు: తండ్రి పాత్రలో సముద్రఖని .. కొడుకు పాత్రలో ధన్ రాజ్ నటన బాగుంది. దుర్గాప్రసాద్ ఫొటోగ్రఫీ .. అరుణ్ చిలువేరు నేపథ్య సంగీతం .. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఓకే.
ముగింపు: 'కూతురు పుడితే తన కోసం దాచాలి .. కొడుకు పుడితే మన కోసం దాచాలి' అనే ఒక నానుడి ఉంది. ఆ విషయాన్ని రామం మరిచిపోయాడా అనిపిస్తుంది. తండ్రిని చూడని కొడుకు .. తల్లిని పట్టించుకుంటాడా? పైగా రాఘవకు ఒక సంబంధం వస్తే, 'వాడు నీకు కరెక్టు కాదమ్మా .. అసలు వాడే కరెక్టు కాదు' అంటూ అవతల అమ్మాయికి చెప్పిన రామం, అలాంటి కొడుకును నమ్మడాన్ని ఆడియన్స్ అంగీకరించలేకపోయారని అనిపిస్తుంది. ఈ రెండు పాత్రలు మినహా మిగతా పాత్రలను నామమాత్రం చేయడం మరో మైనస్ గా మారిందేమో అనే ఆలోచన కూడా తలెత్తకుండా ఉండదు. చెడ్డవాడైన కొడుకు మాత్రమే కాదు, మంచివాడైన తండ్రి కూడా తీసుకున్న తొందరపాటు నిర్ణయంగా 'రామం రాఘవం'గా కనిపిస్తుంది.
'రామం రాఘవం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
| Reviews

Ramam Raghavam Review
- ధన్ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా
- నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్
- కనెక్ట్ కాని ఎమోషన్స్
- అసంతృప్తిగా అనిపించే క్లైమాక్స్
Movie Name: Ramam Raghavam
Release Date: 2025-03-14
Cast: Samudrakhani, Dhanraj, Harish Utthaman, Sunil, Sathya
Director: Dhanraj Koranani
Music: Arun Chikuveru
Banner: Slate pencil Stories
Review By: Peddinti
Ramam Raghavam Rating: 2.25 out of 5
Trailer