'కోర్ట్' - మూవీ రివ్యూ

| Reviews
Court

Court Review

  • లవ్ .. ఎమోషన్స్ ప్రధానంగా సాగే 'కోర్ట్'
  • ఆసక్తికరమైన కథాకథనాలు
  • సహజత్వంతో కూడిన సన్నివేశాలు  
  • ఆలోచింపజేసే సందేశం 
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్

హీరో నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన సినిమా 'కోర్ట్'. ప్రియదర్శి .. హర్ష్ రోషన్ .. శ్రీదేవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో నాని మాట్లాడుతూ ఈ సినిమా పట్ల తనకి గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. తాను చెబుతున్నట్టుగా ఈ సినిమా లేకపోతే, ఆ తరువాత రానున్న తన 'హిట్ 3' మూవీని చూడొద్దంటూ అందరి దృష్టిని ఈ సినిమా వైపుకు మళ్లించాడు. మరి నిజంగానే ఈ సినిమా ఆ రేంజ్ లో ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.

 కథ: 2013లో .. విశాఖపట్నం నేపథ్యంలో జరిగే కథ ఇది. భర్తను కోల్పోయిన సీతారత్నం (రోహిణి) తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ఇంటర్ చదువుతున్న ఆమె కూతురు జాబిలి (శ్రీదేవి), చందూ (హర్ష రోషన్)ను ఆటపట్టించబోయి అతని ప్రేమలో పడుతుంది. చందు ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇంటర్ ఫెయిల్ కావడం వలన చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటాడు. తాము అనుకున్నట్టుగా అతను చదవలేకపోవడం గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు.


మంగపతి రైస్ మిల్ నడుపుతూ స్థానిక రాజకీయాలలోను కనిపిస్తూ ఉంటాడు. డబ్బుకీ .. పరువుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే వ్యకి అతను. తన పరువును కాపాడుకునే క్రమంలో తన వాళ్లందరినీ భయపెట్టేస్తూ ఉంటాడు. తండ్రిలేని జాబిల్లి కుటుంబం మేనమామ అయిన మంగపతిపై ఆధారపడుతుంది. చందుతో జాబిల్లి లవ్ లో పడిందని తెలిసిన అతను కోపంతో ఊగిపోతాడు. జాబిల్లిని మైనర్ గా పేర్కొంటూ, తన పలుకుబడిని ఉపయోగించి చందుపై 'పోక్సో' చట్టంతో పాటు ఇతర సెక్షన్లపై కూడా కేసు పెడతాడు. 

మంగపతికి సీనియర్ లాయర్ దామోదర్ ( హర్షవర్ధన్)తో మంచి పరిచయం ఉంటుంది. అందువలన ఈ కేసులో నుంచి చందు బయటకి రాకుండా అతను అన్ని వైపుల నుంచి కేసును బిగిస్తుంటాడు. మోహన్ రావు (సాయికుమార్) దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేసే సూర్యతేజ (ప్రియదర్శి)కి ఈ కేసులో చందుకి అన్యాయం జరుగుతుందని భావించి రంగంలోకి దిగుతాడు. చందు నిర్దోషి అని అతను నిరూపించగలుగుతాడా? డబ్బు .. పలుకుబడి ఉన్న మంగపతి నెగ్గుతాడా? అనేది కథ. 

విశ్లేషణ: టీనేజ్ లో ప్రేమలో పడటం సహజమే. అయితే కాలం ఎంతగా మారుతున్నా, కులం .. మతం .. ధనం .. అనేవి ప్రేమకి ప్రధాన శత్రువులుగా అడ్డుపడుతూనే ఉన్నాయి. ఈ మూడు అంశాలు తమ పరువుకు సంబంధించినవిగా కొంతమంది భావిస్తుంటారు. ఆ పరువును కాపాడుకోవాలనే మొండితనంతో చట్టంలోని కొన్ని అంశాలను తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లుకున్న కథనే ఇది.

18 ఏళ్లు నిండేవరకూ అమ్మాయిలకు మైనారిటీ తీరదు. 18 రాగానే .. అంటే ఒక్కరోజు డేట్ మారగానే అప్పటివరకూ లేని పరిపక్వత ఎలా వస్తుంది? అమ్మాయిలు మేజర్లు కాకుండా ప్రేమలో ముందుకు వెళితే ఏం జరుగుతుందనేది ఎంతమంది అబ్బాయిలకు తెలుసు? మన చట్టాల్లో ఏవుంది అనేది చెప్పడానికి ఎవరు ప్రయత్నించారు? ఏవుందో తెలియనప్పుడు వాటిని ఫాలోకావడానికి ఎవరు ప్రయత్నిస్తారు? అనే అంశాల చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ ఆలోచింపజేస్తుంది. 

'పోక్సో' చట్టం ఏం చెబుతోంది? దానిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రేమకీ .. కామానికి ఉన్న తేడాను ఎలా గుర్తించాలి? అనే అంశాలను టచ్ చేస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. సరదాగా మొదలయ్యే ఈ కథను ఇంటర్వెల్ సమయానికి ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి అంతే టెంపోతో నడిపించిన విధానం మెప్పిస్తుంది. చిన్న చిన్న లంచాలకు కొంతమంది కక్కుర్తి పడటం వలన, చాలామంది కుర్రాళ్లు ఏళ్లపాటు జైళ్లలో మగ్గుతున్నారనే ఆవేదన ఆలోచింపజేస్తుంది. 

పనితీరు: దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు బాగుంది. మొదటి నుంచి చివరి వరకూ ఈ కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా ముందుకు తీసుకుని వెళ్లాడు. ఎక్కడా తడబడినట్టు కనిపించదు. ఎక్కడా  టైమ్ వేస్ట్ చేయని స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఈ సినిమాలో వినోదం కంటే సందేశం పాళ్లు ఎక్కువ. అలాంటి ఒక లైన్ ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతలను అభినందించవచ్చు. 

ఈ సినిమాకి ఒక రకంగా విలన్ స్థానంలో శివాజీ కనిపిస్తాడు. ఎదుటివాడు ఏమైపోయినా ఫరవాలేదు. తమ పరువు  మాత్రం కాపాడుకోవాలి అనే పాత్రలో ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. అలాగే కన్నింగ్ లాయర్ గా హర్షవర్ధన్ .. కసితో ఉన్న లాయర్ గా ప్రియదర్శి నటన మెప్పిస్తుంది. సాయికుమార్ .. రోహిణి పాత్రలు నిండుదనాన్ని తీసుకొచ్చాయి. హర్ష రోషన్ నటనలో సహజత్వం కనిపిస్తుంది. శ్రీదేవి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  

దినేశ్ పురుషోత్తమన్ ఫొటోగ్రఫీ బాగుంది. విజయ్ బుల్గానిన్ బాణీలు .. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. సంభాషణలు కూడా అర్థవంతంగా ఉన్నాయి. 'మనుషులను మార్చేలేనేమో గానీ, వాళ్లు మాట్లాడుకునే విషయాలను మార్చగలను' .. 'ఒక కుర్రాడి 14 ఏళ్ల భవిష్యత్తు ఖరీదు .. కొంతమంది అవినీతిపరులు పంచుకున్న 3 లక్షలా?' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. 

ముగింపు: ఒక చిన్నపాటి లైన్ తీసుకుని దానిని తక్కువ బడ్జెట్ లో ఇంట్రెస్టింగ్ గా అందించడమనేది మనకి మలయాళ ఇండస్ట్రీలో కనిపిస్తుంది. అలాంటి ఒక ప్రయోగాన్ని తెలుగులో చేసిన సినిమాగా 'కోర్ట్' గురించి చెప్పుకోవచ్చు. చట్టంలో ఏముందో టీనేజ్ లవర్స్ కి తెలియడం లేదు. దాంతో చట్టాన్ని తమకి అనుకూలంగా మార్చుకుని పరువు పేరుతో కొంతమంది పెద్దలు చేసే కుట్రలకు వాళ్లు బలవుతున్నారు. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పిల్లలకు పాఠాలు మాత్రమే కాదు . మన చట్టాల్లో ఏవుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఇచ్చిన సందేశం ఈ కథను మరింత బలంగా కనెక్ట్ చేస్తుంది.

Movie Name: Court

Release Date: 2025-03-14
Cast: Harsh Roshan, Sridevi, Shivaji, Priyadarshi, Sai Kumar, Harshavardhan
Director: Ram Jagadeesh
Music: Vijay Bulganin
Banner: Wall Poster Cinema

Court Rating: 3.00 out of 5

Trailer

More Reviews