తమిళనాట శరత్ కుమార్ కి మాస్ యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. ఆయన పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు చాలా వరకూ విజయాన్ని సాధించాయి. అలాంటి శరత్ కుమార్ కథానాయకుడిగా రూపొందిన 150వ సినిమానే 'ది స్మైల్ మేన్'. క్రితం ఏడాది డిసెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా, నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్యామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.
కథ: చిదంబరం (శరత్ కుమార్) సీఐడీ సీనియర్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న చిదంబరం ఐదేళ్ల క్రితం 'స్మైల్ మేన్' ను పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడతాడు. ఆ సమయంలోనే ఆఫీసర్ వెంకటేశ్ (సురేశ్ మీనన్) చేతిలో 'స్మైల్ మేన్' చనిపోయాడనే వార్తలు వస్తాయి. అయితే అప్పటి నుంచి ఆఫీసర్ వెంకటేశ్ జాడ తెలియకుండా పోతుంది. ఏదేమైనా స్మైల్ మేన్ పీడ విరగడ అయిందని అంతా ఊపిరి పీల్చుకుంటారు.
ఐదేళ్ల క్రితం గాయపడిన చిదంబరం నిదానంగా కోలుకుంటాడు. అయితే అతను అల్జీమర్స్ బారినపడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతారు. ఒక ఏడాదిలో అతను తన గతం గురించి పూర్తిగా మరిచిపోయే అవకాశం ఉందని అంటారు. స్మైల్ మేన్ చనిపోలేదని అతను చెప్పడంతో పోలీస్ అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఆ వార్త బయటికి వచ్చిన మరుసటి రోజు నుంచే, స్మైల్ మేన్ హత్యలు చేయడం మొదలవుతుంది. స్మైల్ మేన్ ఎవరు? అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు? చిదంబరం ఎలా అతని ఆటకట్టిస్తాడు? అనేది కథ.
విశ్లేషణ: ఇది ఒక సైకో కిల్లర్ కథ. సైకో కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ వెళుతుంటాడు. హత్యలు చేయడంలో అతని మార్క్ చూపిస్తూ ఉంటాడు. చంపేసిన తరువాత అతను దంతాలన్నీ బయటికి కనిపించేలా, పెదవుల చుట్టుపక్కల భాగమంతా కోసేస్తూ ఉంటాడు. దాంతో చనిపోయిన వ్యక్తి వికారంగా నవ్వుతున్నట్టు ఉంటుంది. అందువల్లనే ఆ కిల్లర్ ను అందరూ స్మైల్ మేన్ గా పిలుస్తూ ఉంటారు.
ఈ తరహా కథలలో ఆసక్తిని రేకెత్తించేవి రెండే అంశాలు. స్మైల్ మేన్ ఎందుకు సైకోలా మారతాడు? అతనిని కథానాయకుడు ఎలా పట్టుకుంటాడు? ఈ రెండు వైపులా ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనేవి ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతూ ఉంటాయి. సైకో కిల్లర్ ను రివీల్ చేసేవరకూ ఫస్టాఫ్ గా నడుస్తుంది. అతనిని రివీల్ చేసిన తరువాత చోటు చేసుకునే సంఘటనలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
సాధారణంగా సైకోలు చేసే హత్యలు చాలా దారుణంగానే ఉంటూ ఉంటాయి. అయితే ఈ సినిమాలో హత్యలు మరింత దారుణంగా జరుగుతూ ఉంటాయి. దంతాలన్నీ కనిపించేలా నోరు భాగమంతా కోసేసిన శవాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూడటం సాధారణ ప్రేక్షకుల వలన అయ్యేపని కాదు. హత్యలు జరిగే పద్ధతి తప్ప, మిగతా అంశాలన్నీ కూడా రొటీన్ గానే అనిపిస్తూ ఉంటాయి.
పనితీరు: సైకో థ్రిల్లర్ సినిమాలలో అద్భుతమైన స్క్రీన్ ప్లేకి ఉండే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకు చంపుతున్నాడు? .. ఎలా పట్టుకుంటారు? అనే విషయంపైనే ఆడియన్స్ దృష్టిపెడతారు. ఈ సినిమాలో హీరోకి అల్జీమర్స్ పెట్టేసి, ఆ ఇబ్బందితో హంతకుడిని వేటాడటం ద్వారా ఆడియన్స్ లో టెన్షన్స్ పెంచాలనుకున్నారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అయినట్టుగా అనిపించదు.
శరత్ కుమార్ కి ఇలాంటి పాత్రలను పోషించడం కొత్తేమీ కాదు. అలాగే విలనిజం తో కూడిన పాత్రలను చేయడంలో కలైయరసన్ కి మంచి అనుభవం ఉంది. కథను నడిపించడంలో ఇద్దరూ తమవంతు కృషి చేశారు. విక్రమ్ మోహన్ ఫొటోగ్రఫీ బాగుంది. గవాస్కర్ అవినాశ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. లోకేశ్ ఎడిటింగ్ ఓకే.
ముగింపు: అల్జీమర్స్ తో బాధపడుతున్న ఒక పోలీస్ ఆఫీసర్, అత్యంత దారుణంగా హత్యలను చేసే సైకో కిల్లర్ ను వేటాడే తీరు ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. అయితే శవాలను తెరపై చూపించిన తీరును తట్టుకోవడం కష్టం. ఈ జోనర్ కథల పట్ల ఆసక్తి ఉన్నవారు మాత్రమే చూసే సినిమా ఇది.
'ది స్మైల్ మేన్' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews

The Smile Man Review
- తమిళంలో రూపొందిన 'ది స్మైల్ మేన్'
- నిన్నటి నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్
- రొటీన్ గా అనిపించే కంటెంట్
- ఈ జోనర్ ను ఇష్టపడేవారు మాత్రమే చూడగలిగే సినిమా ఇది.
Movie Name: The Smile Man
Release Date: 2025-03-07
Cast: Sarath Kumar, Kalaiyarasan, Sri Kumar, Sija Rose, Suresh Menon, Ineya
Director: Syam
Music: Gavaskar Avinash
Banner: Magnum Movies
Review By: Peddinti
The Smile Man Rating: 2.50 out of 5
Trailer