'సుడల్ - సీజన్ 2' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

| Reviews
Suzhal 2

Suzhal 2 Review

  • 2022లో వచ్చిన 'సుడల్' సీజన్ 1
  • ఈ రోజు నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ 
  • భారీతనంలో విషయంలో మెప్పించిన కంటెంట్
  • ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసిన క్లైమాక్స్ ట్విస్ట్   
  • కథ - స్క్రీన్ ప్లే విషయంలో సీజన్ 1కే ఎక్కువ మార్కులు

ఐశ్వర్య రాజేశ్ - కథిర్ ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ వెబ్ సిరీస్ 'సుడల్'. జూన్ 17.. 2022లో ఈ సిరీస్ ఫస్టు సీజన్ 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగుకి వచ్చింది. ఫస్ట్ సీజన్ కి విశేషమైన ఆదరణ లభించడంతో, సెకండ్ సీజన్ ను కూడా 8 ఎపిసోడ్స్ గా వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ రోజు నుంచే సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 2 ఎంతవరకూ ఆడియన్స్ కు కనెక్ట్ను అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ:  షణ్ముగం (పార్తీబన్) పెద్ద కూతురు నందిని (ఐశ్వర్య రాజేశ్). నందిని చెల్లెలు నీల - పోలీస్ ఆఫీసర్ రెజీనా ( శ్రియా రెడ్డి) కొడుకు అతిశయం ప్రేమించుకుంటారు. అయితే వాళ్లిద్దరూ చనిపోవడంతో, ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తారు. అయితే అది హత్య అని పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి ( కథిర్) ద్వారా నందిని తెలుసుకుంటుంది. తన చెల్లెలు మరణానికి కారకులైనవారికి తగిన శిక్షను విధిస్తుంది. ఇక్కడి నుంచి సీజన్ 2 కథ మొదలవుతుంది. 

హత్యా నేరంపై శిక్షను అనుభవిస్తూ నందిని జైల్లో ఉంటుంది. ఆమెను విడిపించడానికి లాయర్ చెల్లప్ప (లాల్) ద్వారా పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే హఠాత్తుగా ఒక రోజున లాయర్ చెల్లప్ప హత్యకి గురవుతాడు. సంఘటన స్థలంలో ఉన్న 'ముత్తు' (గౌరీ కిషన్)ను చక్రవర్తి అదుపులోకి తీసుకుంటాడు. ముత్తు గురించిన వివరాలు లభించకపోవడం .. చెల్లప్పను ఎందుకు హత్య చేసింది ఆమె చెప్పకపోవడంతో చక్రవర్తి తలపట్టుకుంటాడు.

ఈ నేపథ్యంలోనే ఎవరికివారుగా ఏడుగురు యువతులు పోలీస్ స్టేషన్ కి వచ్చి, చెల్లప్పను తాను హత్య చేశానంటే తాను హత్య చేశానంటూ లొంగిపోతారు. దాంతో చక్రవర్తి అయోమయంలో పడతాడు. చెల్లప్పను ఎలా హత్య చేయడం జరిగిందనేది అందరూ ఒకేలా చెబుతారు. ఆ ఏడుగురిలో ఒకరికి ఒకరు తెలియదు. వాళ్ల మధ్య ఎలాంటి అనుబంధం లేదు. వాళ్లకి 'ముత్తు' ఎవరనేది తెలియదు. నందిని శిక్షను అనుభవిస్తున్న సబ్  జైలుకు వాళ్లను తీసుకుని వెళతాడు చక్రవర్తి. అక్కడ ఏం జరుగుతుంది? చెల్లప్పను హత్య చేసింది ఎవరు? ఆయనతో ఆ అమ్మాయిలకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ. 

విశ్లేషణ: జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి మనుషులు మారుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో హత్య చేసినవారు అమాయకుల మాదిరిగా నటిస్తూ ఉంటారు. హత్యకి గురైనవారు దుర్మార్గులుగా చిత్రీకరించబడుతూ ఉంటారు. అయితే అసలు నిజాన్ని ఈ లోకానికి చాటడానికి కాలం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరణం తరువాత కూడా మంచివాళ్లపై మరక పడకుండా చూస్తూనే ఉంటుంది. ఈ వాస్తవాన్ని ఆవిష్కరించే కథ ఇది. 

'సుడల్' సీజన్ 1 చూసినవారు ఆల్రెడీ కథ అంతా అయిపోయింది కదా. మళ్లీ ఏం చెబుతారు? అనే అనుకుంటారు. నిజంగానే ఫస్టు సీజన్ లోనే కథ మొత్తాన్ని కానిచ్చేశారు. సీజన్ 1 వైపు నుంచి ఇందులో ఐశ్వర్య రాజేశ్ పాత్రతో మాత్రమే చిన్న లింక్ ఉంచారు అంతే. మిగతా కథ అంతా కూడా మరో కోణంలో అల్లుకున్నదే. ఈ కథలో కూడా చాలా పాత్రలు .. అనూహ్యమైన మలుపులు ఉన్నాయి. సీజన్ 2 చూస్తే మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.

నందినీని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించే లాయర్ చెల్లప్ప  చనిపోతాడు. అతనిని ఎవరు చంపారు? ఇప్పుడు నందిని పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై దర్శకుడు ఆసక్తిని రేకెత్తించిన విధానం బాగుంది. ఆడియన్స్ గెస్ కి అందకుండా క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. అలాగే మంజిమా మోహన్ ఎపిసోడ్ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఐశ్వర్య రాజేశ్ పాత్ర డైనమిక్ గా ఉంటుందని భావించిన వారికి మాత్రం కాస్త నిరాశ కలుగుతుంది.  
             
పనితీరు: ఈ వెబ్ సిరీస్ నిర్మాణ విలువలు ఒక సినిమా స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఖర్చు పరంగా .. చిత్రీకరణ పరంగా జాతర సన్నివేశాలు .. మహిళా ఖైదీల నేపథ్యంలో సన్నివేశాలు .. సముద్రం నేపథ్యంలో సీన్స్ ను దర్శకుడు ప్లాన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే బాగుంది కానీ, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. 

అబ్రహం జోసెఫ్ ఫొటోగ్రఫీ ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. జైలు .. సముద్రం .. యాక్షన్ సీన్స్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ గొప్పగా ఉంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలలో నుంచి ఆడియన్స్ జారిపోకుండా చూస్తుంది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ ఫరవాలేదు. సాగదీసిన సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.  

ముగింపు: భారీ నిర్మాణ విలువలు .. ఆసక్తికరమైన సన్నివేశాలు .. అనూహ్యమైన మలుపులు ఈ సిరీస్ ను మొదటి నుంచి చివరివరకూ చూసేలా చేస్తాయి. అయితే కథ - స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే 'సుడల్' సీజన్ 1 పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. సీజన్ 2లో భారీ సీన్స్ చాలా ఉన్నప్పటికీ, ఎమోషన్స్ తో కూడిన మంజిమా మోహన్ ఎపిసోడ్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఐశ్వర్య రాజేశ్ పాత్ర ఆశించిన స్థాయిలో కనిపించకపోవడమే ఒక లోపంగా అనిపిస్తుందంతే. 

Movie Name: Suzhal 2

Release Date: 2025-02-28
Cast: Aishwarya Rajesh, Kathir, Gouri Kishan, lal, Ashwini
Director: Bramma G
Music: Sam CS - Santosh Narayan
Banner: Wallwatcher Films

Suzhal 2 Rating: 3.00 out of 5

Trailer

More Reviews