'కౌసల్య సుప్రజా రామా' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

| Reviews
Kousalya Supraja Rama

Kousalya Supraja Rama Review

  • కన్నడలో రూపొందిన సినిమా 
  • తల్లీ కొడుకుల ఎమోషన్స్ కి ప్రాధాన్యం  
  • సెకండ్ హీరోయిన్ ఎంట్రీ నుంచి నిదానించిన కథ
  • ఓ మాదిరిగా అనిపించే కంటెంట్          

కన్నడలో రూపొందిన 'కౌసల్య సుప్రజా రామా' సినిమా, 2023 జులై 28వ తేదీన విడుదలైంది. బీసీ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకి, శశాంక్ దర్శకత్వం వహించాడు. కృష్ణుడు .. బృందా ఆచార్య .. మిలాన్ నాగరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, కన్నడలో మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ రోజు నుంచే తెలుగులో ఈ సినిమా 'ఈటీవీ విన్' ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఒకసారి చూద్దాం. 

కథ: రామ్ (డార్లింగ్ కృష్ణ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఆయన తల్లిపేరు కౌసల్య (సుధ బెళవాడి) తండ్రి పేరు సిద్ధగౌడ ( రంగయన రఘు). సిద్ధగౌడ తాగుడికి బానిస .. భరించేవాళ్లే ఆడవాళ్లు అనేది ఆయన అభిప్రాయం. అందుకు తగినట్టుగానే కౌసల్య సర్దుకుపోతూ వస్తుంటుంది. తండ్రిని చూస్తూ ఎదిగిన రామ్ కూడా అలాగే తయారవుతాడు. రామ్ మేనత్త కొడుకైన సంతోష్ కూడా చిన్నప్పటి నుంచి అతనితో పాటే కలిసి చదువుకుంటాడు. 

కాలేజ్ లో రామ్ కి శివాని (బృందా ఆచార్య) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. తాను చెప్పినట్టు వినాల్సిందే అనే రామ్ లోని మొండి వైఖరిని శివాని గమనిస్తుంది. అలాంటి అతనితో కలిసి జీవితాంతం గడపలేనని చెప్పి వెళ్లిపోతుంది. అసలే పట్టుదల గల రామ్, అలాగే మొండికేసి కూర్చుంటాడు. ఈ విషయంలో తల్లి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అతను వినిపించుకోడు. అలాంటి పరిస్థితుల్లో అతని తల్లి చనిపోతుంది. 

తాను శివానిని మరిచిపోవాలనే ఉద్దేశంతో తన తల్లి 'ముత్తు లక్ష్మి' అనే మరొక అమ్మాయిని చూసి వచ్చిందని రామ్ తెలుసుకుంటాడు. తన తల్లి బ్రతికుండగా ఆమె మాటలను తాను పట్టించుకోలేదు. అందువలన ఆమెకి నచ్చిన యువతిని పెళ్లి చేసుకోవడం మంచిదని భావిస్తాడు. ముత్తులక్ష్మి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? ఆమెను వివాహం చేసుకున్న తరువాత ఆయన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: 'ఉన్నప్పుడు విలువ తెలియదు' అనే ఒక మాటను మనం వింటూ ఉంటాము . నిజంగా అది నిజమే. ముఖ్యంగా 'అమ్మ' ఉన్నప్పుడు చాలామందికి ఆ విలువ తెలియదు. తల్లి ప్రేమను .. ఆమె మంచి మాటలను .. చెప్పే జాగ్రత్తలను చాలామంది లైట్ తీసుకుంటారు. ఆమె అభిరుచులు .. అభిప్రాయాలు .. సలహాలు .. సూచనలు వేటికీ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాంటి అమ్మ లేకపోతే అప్పుడు తత్త్వం బోధ పడుతుంది. 

అమ్మలేకపోతే నీ ఆకలిని పట్టించుకునేవారు ఉండరు. అమ్మ లేకపోతే నీ ఫీలింగ్స్ ను షేర్ చేసుకునేవారు ఉండరు. అలాంటి ఒక తల్లి .. తన కొడుకును మార్చడానికి ప్రయత్నిస్తూనే చనిపోతుంది. తల్లి మరణంతో జ్ఞానోదయమైన ఆ కొడుకు అప్పటి నుంచి మారడం మొదలు పెడతాడు. తండ్రి మాదిరిగా ప్రవర్తిస్తూ తల్లిని బాధపెట్టిన ఓ కొడుకు, ఆ తరువాత తల్లికి నచ్చేలా ఉండటం కోసం చేసే ప్రయత్నమే ఈ సినిమా. 

సాధారణంగా ఈ సినిమా టైటిల్ ను చూసి, కౌసల్య - సుప్రజ - రామ్ మధ్య జరిగే లవ్ స్టోరీ అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ టైటిల్లో తల్లిపేరు కౌసల్య .. కొడుకు పేరు రామ్ .. ఇది తల్లీ కొడుకుల ఎమోషన్స్ తో ముడిపడిన కథ. దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగానే ఉంది. కాకపోతే ఆ విషయాన్ని సాగదీస్తూ చెప్పకపోతే, ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది. 

పనితీరు: దర్శకుడు పూర్తి ఫోకస్ ను హీరో పాత్రపై పెట్టాడు. తల్లి బ్రతికి ఉన్నప్పుడు .. తల్లి చనిపోయిన తరువాత అనే వేరియేషన్ చూపించడంపై దృష్టిపెట్టాడు. ఫస్టాఫ్ లో లవ్ కీ .. రొమాన్స్ కి మంచి అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఉపయోగించుకోలేదు. ఇక హీరో ఎప్పుడూ సీరియస్ గా ఉండేలా దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేయడం మరో మైనస్ అనే చెప్పుకోవాలి. హీరోయిన్స్ లో గ్లామర్ లేకపోవడం కూడా మరో కారణమే. 

 సుగుణన్ ఫొటోగ్రఫీ .. అర్జున్ జన్య నేపథ్య సంగీతం .. గిరి మహేశ్ ఎడిటింగ్ ఫరవాలేదు. దర్శకుడు ప్రేక్షకులకు గుర్తుండిపోయే స్థాయి సీన్స్ ను డిజైన్ చేయలేదు. ఆ స్థాయిలో ఏ పాత్రను మలచలేదు. అందువలన తమ పరిధిలో ఆర్టిస్టులు మెప్పించారు. తల్లి చనిపోయిన తరువాత, ఆమె కోసం కొడుకు మారతాడు. ఈ పాయింటులోని సున్నితత్వం కనెక్ట్ కానివారు, 'ఫస్టాఫ్ అంతా హీరో తాగుతాడు .. సెకండాఫ్ అంతా హీరోయిన్ తాగుతుంది .. ఏవుంది ఇందులో' అనుకునే అవకాశం లేకపోలేదు. తల్లి సెంటిమెంట్ కనెక్ట్ అయినవారికి బాగానే అనిపిస్తుంది.  

Movie Name: Kousalya Supraja Rama

Release Date: 2025-02-27
Cast: Darling Krishna, Brinda Acharya, Milana Nagaraj, Rangayana Raghu, Achyuth Kumar
Director: Shashank
Music: Arjun Janya
Banner: Shashank Cinemas

Kousalya Supraja Rama Rating: 2.50 out of 5

Trailer

More Reviews