'వెంకట్రాది ఎక్స్ ప్రెస్' తరువాత మళ్లీ ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ రకరకాల కథలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ అవి సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఇటీవల 'భైరవకోన'తో ఫర్వాలేదనుకునే యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో, ఈసారి ఎంటర్‌టైన్ మెంట్ కథతో 'మజాకా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌తో పాటు రావు రమేష్ కూడా ఓ కీలక పాత్రను పోషించాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ చిత్రానికి అతను కూడా ఓ హీరోనే. శివరాత్రి పర్వదినాన విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనేది ఒక లుక్కేద్దాం.
కథ: కృష్ణ (సందీప్ కిషన్), వెంకీ అలియాస్ వెంకట రమణ (రావు రమేష్)లు తండ్రీ కొడుకులు. చిన్నప్పుడే కృష్ణ అమ్మను కొల్పోవడంతో వెంకటరమణ అతని బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఆడదిక్కు లేకుండా జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. అయితే ఎలాగైనా కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫోటోని గోడకు తగిలించాలని వెంకటరమణ చేయని ప్రయత్నం ఉండదు. ఎన్ని సంబంధాలు చూసినా ఆడదిక్కు లేని ఇంటికి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకురారు.
ఈ సమయంలోనే ముందుగా తాను పెళ్లి చేసుకుంటే ఆ తరువాత కొడుక్కి పెళ్లి చేయవచ్చనే సలహాతో ఆయన యశోద (అన్షు) ప్రేమలో పడతాడు. ఈ సమయంలోనే కృష్ణ కూడా మీరా (రీతూ వర్మ)ను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అలా తండ్రీ కొడుకులు ప్రేమలో మునిగి తేలుతుంటారు. అయితే అనుకోకుండా వీళ్ల ప్రేమకథలోకి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. కొన్ని కొత్త పాత్రలు ప్రవేశిస్తాయి. అవేమిటి? అనేది వెండితెరపై చూడాల్సిందే..
విశ్లేషణ: ఈ తరహా కథలకు ఓ పాయింట్‌ను ఆలోంచించడం ఎంత ముఖ్యమో.. ఆ కథకు తగిన ట్రీట్‌మెంట్ అంతే ముఖ్యం. ఈ కథలో లోపించింది కూడా అదే. తమ జీవితాలు అందరిలా ముందుకు సాగిపోవాలంటే ఓ మంచి కుటుంబాన్ని కావాలని కోరుకునే తండ్రి కొడుకుల కథ ఇది. అయితే ఇలాంటి కథలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ఎమోషన్ కూడా ముఖ్యమే. అయితే తీసిన సీన్‌నే మళ్లీ తీస్తూ.. రిపీటెడ్ సన్నివేశాలతో విసిగించాడు. రొటిన్ కామెడీతోనే కాలయాపన చేశాడు.
ఎస్‌ఐ పాత్రలో కనిపించిన అజయ్‌కి తండ్రి కొడుకులు ఇద్దరూ తమ ఫ్లాష్‌బ్యాక్‌ను చెప్పే ఐడియా బాగానే ఉంది. ఫ్లాష్‌బ్యాక్ చెప్పేంత గొప్ప సన్నివేశాలు ఈ సినిమాలో కనిపించలేదు. ఎవరికి వాళ్లు డైలాగులు చెబుతుంటారు.ఎక్కడ కూడా అవి కావాల్సిన ఫన్‌ను జనరేట్ చేయలేదు. సినిమా మొత్తంలో 'వావ్' అనిపించేంత డైలాగ్ కానీ, సన్నివేశం కాని మచ్చుకు కూడా కనిపించదు. ఫస్ట్ హాఫ్ రొటిన్ ఫన్ సన్నివేశాలతో కాలయాపన చేస్తే.. సెకండాఫ్ మాత్రం మరింత విసుగు తెప్పించే సన్నివేశాలతో నింపేశారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలిగించినా, ఆ ఆసక్తిని కొనసాగించక లేకపోయారు. మేనత్తగా అన్షు, మేనకోడలుగా రీతూ వర్మ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ కథను ట్రాక్ తప్పించాయి. 'మజాకా'లో ఎంటర్‌టైన్‌మెంట్ సన్నివేశాలు పెద్ద ప్రేక్షకులను నవ్వించకపోయినా, కొన్ని ఎమోషన్ సీన్స్ మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తాయి. 'ఈ ఇంట్లో గజ్జెల పట్టీల సౌండ్ విని పాతికేళ్లు అయ్యింది అమ్మా.. అందుకే నిన్ను అన్నిసార్లు అటు ఇటు తిప్పాను' అంటూ రావు రమేష్ చెప్పే సంభాషణ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది.
రొటిన్ కామెడీ సన్నివేశాలు, ఎక్కడో చూసిన ఫన్‌ను కాకుండా కథకు తగ్గట్టుగా కొన్ని ఫ్రెష్ సీన్స్‌ను రాసుకుని ఉంటే కనీసం సినిమాను అవి యావరేజీ స్థాయిలోనైనా నిలిపేవి. ముఖ్యంగా రావు రమేష్-అన్షుల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా నిరాశపరిచాయి. వీళ్లీద్దరి మధ్య ప్రేమలో ఎమోషన్ ఉండి ఉంటే సినిమా కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు 'మజాకా' అటు ఎమోషన్‌లో, ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌లో రెండింటిలోనూ విఫలమైన సినిమాగా మిగిలింది.
పనితీరు: ఈ సినిమాలో సందీప్ కిషన్ హడావుడి చేశాడు. కామెడీ సన్నివేశాల్లో తడబాటు కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో రావు రమేష్ ముందు సందీప్ తేలిపోయాడు. రావు రమేష్ నటన పరంగా నూటికి నూరు శాతం మార్కులు దక్కించుకున్నా, కొన్ని సన్నివేశాల్లు ఓవర్‌ద బార్డర్‌గా అనిపించాయి. ఈ సినిమాలో భార్గవ్ శర్మ పాత్రలో మురళీ శర్మ ఆకట్టుకున్నాడు. రీతూ వర్మ, అన్షులు ఫర్వాలేదనిపించుకున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం గురించి పెద్దగా చెప్పాల్పిన పనిలేదు. ఎందుకంటే సంగీత పరంగా ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో రచయిత ప్రసన్నకుమార్ చాలా రొటిన్ సన్నివేశాలను రాసుకున్నాడు. ఇప్పుడున్న పోటీలో ఇలాంటి సాదాసీదా సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించి, ప్రేక్షకుల మెప్పు పొందాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఏ మాత్రం కొత్తదనం లేకుండా రాసిన సీన్స్‌ను దర్శకుడు కూడా అదే స్థాయిలో రాజీపడి తెరకెక్కించాడు.
'మజాకా'లాంటి ఓ టైటిల్‌ను పెట్టుకుని, ఎంటర్‌టైన్‌మెంట్‌ను సినిమాలో జోడించడంలో విఫలమయ్యారు. నేటి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ స్కోప్ పెరిగింది. థియేటర్ఆ కి వచ్చే ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే 'మజాకా'లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ సరిపోదనే చెప్పాలి.
'మజాకా' - మూవీ రివ్యూ!
| Reviews

Mazaka Review
- సందీప్ కిషన్ - రావు రమేశ్ 'మజాకా'
- రొటిన్ ఎంటర్‌టైన్‌మెంట్
- ఆకట్టుకోని ఎమోషన్
- ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన సినిమా
Movie Name: Mazaka
Release Date: 2025-02-26
Cast: Sundeep Kishan, Ritu Varma, Rao Ramesh, Anshu
Director: Thrinadha Rao Nakkina
Music: Leon James
Banner: AK Entertainments- Hasya Movies- Zee Studios
Review By: Madhu
Mazaka Rating: 2.00 out of 5
Trailer