తమిళంలో ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సినిమాల జాబితాలో 'మద్రాస్ కారణ్' ఒకటి. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిహారిక కీలకమైన పాత్రను పోషించింది. జనవరి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా, థియేటర్స్ దగ్గర గట్టిపోటీని ఎదుర్కోవలసి వచ్చింది. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగుకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: మీరా (నిహారిక) సత్య (షేన్ నిగమ్) ప్రేమించుకుంటారు. మీరాతో పెళ్లికి సత్య తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మీరా ఆలనా పాలన తండ్రి చూసుకుంటాడు. ఆమెకి ఒక అక్కయ్య కూడా ఉంటుంది. చిన్నప్పుడు తన సొంత ఊరు నుంచి చెన్నైకి వెళ్లిపోయిన సత్య, అదే ఊళ్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు మీరా వాళ్లు అంగీకరించి, సత్య ఊరుకి చేరుకుంటారు.
తెల్లవారితే పెళ్లి .. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. హోటల్లో దిగిన మీరా కాల్ చేయడంతో, ఆమె దగ్గరికి బయల్దేరతాడు సత్య. మార్గమధ్యంలో ఒక గర్భవతిని అతని కారు ఢీ కొడుతుంది. దాంతో అక్కడివారంతా సత్యపై చేయి చేసుకుంటారు. సత్య ఆ గర్భవతిని హాస్పిటల్లో చేరుస్తాడు. విషయం తెలిసి పోలీసులు వస్తారు. ఆ ఊళ్లోని వాళ్లంతా చాలా ఆవేశపరులుగా ఉండటంతో, తన స్నేహితులకు సత్య కాల్ చేస్తాడు.
ఆ గర్భవతి పేరు కల్యాణి. ఆమె భర్త సింగం ( కలైయరసన్) అంటే ఆ ఏరియాలో అందరికీ భయమే. ఇక కల్యాణి అన్నయ్య మణిమారన్ కూడా రాజకీయంగా ఎదగాలనుకునే రౌడీ. వాళ్లిద్దరూ కూడా అక్కడికి చేరుకుంటారు.పెళ్లి మంటపానికి సత్య రాకపోవడంతో అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. కల్యాణికి గానీ .. ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఏం జరిగినా తమ పని అయిపోయినట్టేననే విషయం సత్యకి అర్థమైపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటన ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? మీరా - సత్య పెళ్లి జరుగుతుందా .. లేదా ? అనేది కథ.
విశ్లేషణ: ఒక చిన్న ప్రమాదం .. ఒక చిన్న తొందరపాటు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. మనం కారణం కాకపోయినా బలి పశువులను చేస్తాయి. ఒక సంబరంలో నుంచి ఒక సమస్యలోకి వచ్చి పడటానికి ఒక్క క్షణకాలం చాలు అనేది సత్యం. అలాంటి ఒక విషయం చుట్టూ ఆసక్తికరంగా అల్లుకున్న కథ ఇది.
ఈ కథలో హీరో - హీరోయిన్ లవ్ .. పెళ్లికి సంబంధించిన పనులు .. సరిగ్గా ముహూర్తానికి ముందు హీరో ఒక గొడవలో చిక్కుకోవడంతో ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఆ సమస్యలో నుంచి హీరో బయటపడటానికి చేసే ప్రయత్నం .. అసలు కారకులను అన్వేషించడానికి రంగంలోకి దిగడంతో సెకండాఫ్ నడుస్తుంది. ఐదు ప్రధానమైన పాత్రల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
ఒక వైపున పెళ్లి మంటపం .. ఒక వైపున పోలీస్ స్టేషన్ .. మరో వైపున హాస్పిటల్ నేపథ్యంలోని సన్నివేశాలతో ఫస్టాఫ్ వేడెక్కుతుంది. జరిగిన సంఘటనకి తాను కారణం కాదని తెలుసుకున్న సత్య, అసలు కారకులు ఎవరో తెలుసుకోవడానికి సిద్ధపడటంతో సెకండాఫ్ స్పీడ్ అందుకుంటుంది. మొదటి నుంచి చివరివరకూ కథను పట్టుగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
పనితీరు: నీళ్లలో తేలే ఏ వస్తువు అయినా సుడిగుండంలో మునిగిపోవడానికి ముందు దాని చుట్టూ నిదానంగా తిరుగుతూ కేంద్రస్థానానికి చేరుకుంటుంది. అలాగే చాలా సాదాసీదాగా అనిపించే సన్నివేశాలతో ఈ కథ మొదలవుతుంది. నిదానంగా కథ చిక్కబడుతూ వెళుతుంది. అలా వెళుతున్నా కొద్దీ కథ మరింత లోతుగా కనిపిస్తూ .. కుతూహలాన్ని పెంచుతూ ఉంటుంది. అలాంటి కథాకథనాలతో దర్శకుడు మెప్పించాడు.
ప్రధానమైన పాత్రలను పోషించిన షేన్ నిగమ్ .. కలైయరసన్ .. ఐశ్వర్య దత్త తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రసన్న కుమార్ ఫొటోగ్రఫీ బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా 'థీమ్ మ్యూజిక్' హైలైట్ గా అనిపిస్తుంది. వసంత్ కుమార్ ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు తగలవు.
ముగింపు: కథలోని సహజత్వం .. ఎమోషన్స్ .. అనూహ్యమైన మలుపులు ఈ సినిమాకి ప్రధానమైన బలం అనే చెప్పాలి. నిహారిక పాత్ర సెకండాఫ్ లో కనిపించకపోవడం, కేవలం సీరియస్ డ్రామాపై మాత్రమే దృష్టి పెట్టడం ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించే విషయంగా అనిపిస్తుంది. రిలీజ్ సమయంలో గట్టి పోటీని ఎదుర్కున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
'మద్రాస్ కారణ్' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews

Madras Kaaran Review
- జనవరి 10న విడుదలైన సినిమా
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- ఆసక్తికరమైన మలుపులు
- ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు
- ఓటీటీ వైపు నుంచి మెప్పించే కంటెంట్
Movie Name: Madras Kaaran
Release Date: 2025-02-26
Cast: Shane Nigam, Kalaiyarasan, Niharika Konidela, Aishwarya Dutta, Karunas
Director: Vaali Mohan Das
Music: Sam C S
Banner: SR Productions
Review By: Peddinti
Madras Kaaran Rating: 2.50 out of 5
Trailer