కన్నడలో స్టార్ హీరోగా కిచ్చా సుదీప్ జోరు కొనసాగుతోంది. ఆయన హీరోగా రూపొందిన 'కోటిగొబ్బ 3' 2021 అక్టోబర్ 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. శివకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులో 'K3 కోటికొక్కడు' టైటిల్ తో విడుదలైంది. అలాంటి ఈ సినిమా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సూరప్పబాబు నిర్మించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: సత్య (సుదీప్) అనాథలకు తనకు తోచిన సాయం చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులను కోల్పోయిన 'జాను' అనే పాపకు విదేశాల్లో ఆపరేషన్ చేయించడానికి అతని సిద్ధపడతాడు. ఆ సమయంలోనే అతనికి ప్రియ ( మడోన్నా సెబాస్టియన్) తో పరిచయమవుతుంది. అతని వ్యక్తిత్వం పట్ల ఆమె ఆకర్షితురాలు అవుతుంది. సత్యతో గొడవపెట్టుకున్న కారణంగా లోకల్ రౌడీ లీడర్ 'బషీర్' జైలుకు వెళతాడు.
సత్య కారణంగానే జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఏసీపీ కిశోర్ (రవిశంకర్), తాను బయటికి రాగానే అతణ్ణి అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఇంటర్ పోల్ ఆఫీసర్లు శరత్ - కంగనా ఇద్దరూ కూడా సత్య కోసం గాలిస్తుంటారు. జరిగిన సంఘటనలకు కారణం శివనా? సత్యనా? అనే విషయంలో ఒక క్లారిటీ కోసం వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాళ్లు ఇద్దరు కాదు .. ఒక్కరేనని ఏసీపీ కిశోర్ బలంగా చెబుతూ ఉంటాడు.
జాను ట్రీట్మెంట్ సమయంలోనే దేవేంద్ర భూపతి ( నవాబ్ షా) పేరును సత్య వింటాడు. తన స్వార్థం కోసం అతను ఫార్మా రంగాన్ని ప్రభావితం చేస్తుంటాడు. శివ .. సత్య ఇద్దరూ ఒకటేనా? దేవేంద్ర భూపతితో సత్యకి గల వైరం ఏమిటి? దేవేంద్ర కారణంగా సత్య కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? జాను ప్రాణాలను సత్య కాపాడగలుగుతాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: హీరో ఒక వైపున తన శత్రువులకు .. మరో వైపున పోలీస్ డిపార్టుమెంటువారికి నిద్రలేకుండా చేస్తుంటాడు. హీరోను ఏదో ఒకటి చేయాలనుకున్న ఈ ఇద్దరికీ, అతను ట్విన్స్ లో ఒకడు కావడమనేది అయోమయాన్ని కలిగిస్తూ ఉంటుంది. తమ ముందున్నది తాము టార్గెట్ చేసిన వ్యక్తియేనా కాదా? అనే ఒక సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి ఒక కంటెంట్ తో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి.
సుదీప్ ద్విపాత్రాభినయం చేశాడా? లేదంటే సోలో హీరోనేనా? అనే డౌట్ ఆడియన్స్ లో చివరి వరకూ ఉంటుంది. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ను చూపించే ప్రయత్నం దర్శకుడు చేయలేదు. హీరో ఫ్యామిలీకి .. విలన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. అది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఇక ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్ ఉందిగానీ ఆమె హీరోయిన్ అని చెప్పడానికి కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందే.
ఫార్మా బిజినెస్ .. డ్రగ్ మాఫియా నేపథ్యంలో చాలానే కథలు వచ్చాయి. డ్రగ్ మాఫియా అనగానే, ఇంట్రవెల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎలా ఉంటుందనేది గెస్ చేసే స్థాయికి ఆడియన్స్ వచ్చేశారు. ఈ కథ రొటీన్ గా అనిపించడానికి ఒక కారణం హీరో డ్యూయల్ రోల్ అయితే, మరో కారణం డ్రగ్ మాఫియా అనే చెప్పచ్చు.
పనితీరు: సుదీప్ యాక్టింగ్ గురించి ఆయన అభిమానులకు బాగా తెలుసు. అయితే ఈ సినిమాలో ఆయన మార్క్ ను కూడా సరిగ్గా టచ్ చేయలేదేమోనని అనిపిస్తుంది. సుదీప్ కి హీరోగా బయట గల ఇమేజ్ ను గురించి .. ఆయన యాక్టింగ్ గురించి రవి శంకర్ డైలాగ్స్ ఉంటాయి. సుదీప్ ను అతనితో అలా మోయించడం చూసేవారికి చిరాకు తెప్పిస్తుంది. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ వైపు నుంచి .. విలనిజం వైపు నుంచి వేసుకున్న ట్రాక్ కూడా అంత పవర్ఫుల్ గా అనిపించదు.
శేఖర్ చంద్ర కెమెరా పనితనం .. అర్జున్ జన్య నేపథ్య సంగీతం .. గోరన్ ఎడిటింగ్ ఫరవాలేదు.
వాళ్ల ప్రతిభను నిరూపించుకోవడానికి తగిన సన్నివేశాలు పడలేదని చెబితేనే కరెక్టుగా ఉంటుంది.
ఈ కథలో యాక్షన్ ఉంది .. ఎమోషన్ ఉంది. ఒక స్టార్ హీరో సినిమాకి తగిన భారీతనం ఉంది. మరి లేనిదేమిటి? అంటే, కొత్తదనం అనే చెప్పాలి. కథనం ద్వారా ఉత్కఠను రేపే ప్రయత్నాలు జరగలేదు.
రొమాన్స్ ను టచ్ చేశామని చెప్పడానికి ఒక ఐటం సాంగ్ పెట్టారుగానీ అది సరిపోలేదు. మాస్ ఆడియన్స్ వైపు నుంచి అది ఒక లోపంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాకి 'K3' అని గానీ .. 'కోటికొక్కడు' అనిగాని టైటిల్ పెట్టి ఉంటే ప్రాణానికి కాస్త హాయిగా ఉండేది. టైటిల్ విషయంలోనే పొంతన లేకపోవడం ఆడియన్స్ కనిపెట్టేస్తే కష్టమే మరి.
'K3 కోటికొక్కడు' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
| Reviews

K3 Kotikokkadu Review
- కన్నడలో సుదీప్ కి మంచి క్రేజ్
- రీసెంటుగా ఓటీటీకి వచ్చిన 'K3 కోటికొక్కడు'
- అక్కడ మంచి వసూళ్లనే రాబట్టిన సినిమా
- ఇక్కడి ప్రేక్షకులకు ఇది ఒక రొటీన్ డ్రామా
Movie Name: K3 Kotikokkadu
Release Date: 2025-02-22
Cast: Sudeepa, Ravi Shankar, Madonna Sebastian, Afthab Shivdasani, Shraddha Dasm Nawab Shah
Director: Shiva Karthik
Music: Arjun Janya
Banner: Rambabu Productions
Review By: Peddinti
K3 Kotikokkadu Rating: 2.50 out of 5
Trailer