'దక్షిణ' - (ఓటీటీ) మూవీ రివ్యూ!

| Reviews
Dhakshina

Dhakshina Review

  • 'దక్షిణ'గా సాయిధన్సిక 
  • క్రైమ్ యాక్షన్ డ్రామాగా నడిచే సినిమా 
  • కొత్తదనం లేని కథాకథనాలు
  • కనెక్ట్ కానీ ఎమోషన్స్  
  • ఆందోళన కలిగించే హింసాత్మక దృశ్యాలు      

తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలో సాయిధన్సిక ముందుంటుంది. ఆమె ప్రధాన పాత్రగా రూపొందిన సినిమానే 'దక్షిణ'. క్రైమ్ యాక్షన్ డ్రామా జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, క్రితం ఏడాది అక్టోబర్ 4వ తేదీన విడుదలైంది. తాజాగా ఈ సినిమా 'లైన్స్ గేట్ ప్లే' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

కథ: విశాఖలో వరుసగా అందమైన అమ్మాయిలు కిడ్నాప్ కి గురవుతూ ఉంటారు. ఆ తరువాత దారుణంగా హత్య చేయబడుతూ ఉంటారు. మొండెం నుంచి తలను వేరు చేసి హంతకుడు తీసుకుని వెళ్లిపోతుంటాడు. అందుకు సంబంధించిన వార్తలను టీవీలలో చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అక్కడి లేడీ పోలీస్ ఆఫీసర్ ఆధారలతో హంతకుడిని పట్టుకోవడానికి తన టీమ్ తో కలిసి పనిచేస్తూ ఉంటుంది. 

అయితే ఎక్కడికి వెళ్లినా, ఆల్రెడీ ఆధారాలను మరో పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చినట్టుగా వాళ్లు చెబుతూ ఉంటారు. తమకంటే ముందుగా ఆధారాలు సేకరిస్తున్నది ఒకప్పుడు హైదరాబాదులో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన 'దక్షిణ' అనే విషయం ఆమెకి అర్థమవుతుంది. అప్పట్లోనే రాజీనామా చేసిన దక్షిణ ఇప్పుడు ఎందుకు ఈ కేసు విషయంలో ఆసక్తిని కనబరుస్తున్నది ఆమెకి అర్థం కాదు. ముందుగా ఆ సంగతి తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. 

ఒకప్పుడు హైదరాబాదులో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన దక్షిణ ఇప్పుడు వైజాగ్ ఎందుకు వచ్చినట్టు? ఆల్రెడీ చాలా కలం క్రితమే రిజైన్ చేసిన ఆమె, ఇక్కడ జరుగుతున్న హత్యలపై ఎందుకు ఫోకస్ పెట్టినట్టు? హైదరాబాదులో జరిగిన వరుస హత్యలకు .. విశాఖలో జరుగుతున్న వరుస హత్యలకు మధ్యగల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ:  సాధారణంగా సైకో కిల్లర్ కి సంబంధించిన కథలన్నీ ఒకే మాదిరిగా ఉంటూ ఉంటాయి. కిల్లర్ తన మార్క్ మర్డర్లు చేస్తూ వెళుతూ ఉంటాడు. 'క్లూ' దొరక్క పోలీసులు సతమతమైపోతుంటారు. తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీస్ ఆఫీసర్ ను సైకో టార్గెట్ చేస్తాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనే ఒక ఉత్కంఠ ఆడియన్స్ ను కూర్చోబెడుతుంది. ఈ సినిమా కూడా అదే ఫార్మేట్ ను ఫాలో అయింది.

కథ అంతా కూడా సాయిధన్సిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మంచి హైట్ .. అందుకు తగిన ఫిట్ నెస్ తో పోలీస్ ఆఫీసర్ కి తగిన పర్సనాలిటీతో ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు సాయిధన్సికను ఎంచుకోవడం దర్శకుడు చేసిన మంచి పని అయితే, పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో కాసేపైనా ఆమెను చూపించకపోవడం ఓ పొరపాటు అనే చెప్పాలి. ఒక చేతిలో సిగరెట్ .. మరో చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఆమె రోడ్లపై తిరుగుతూ ఉంటుంది.

దక్షిణ పెద్ద కేడర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్. ఆమె బంగ్లా ఒక రేంజ్ లో ఉంటుంది. అయినా ఆడుతూ పాడుతూ సైకో ఆమె బెడ్ రూమ్ వరకూ వచ్చేయడం చిత్రంగా అనిపిస్తుంది. ప్రమాదకరమైన కేసులను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్లు ఇంత అజాగ్రత్తగా ఉంటారా? అని ఆశ్చర్యం కలగకమానదు. ఇక కొన్ని సందర్భాల్లో ఆమె పాత్ర ప్రవర్తించిన తీరు చూస్తే, ఇద్దరిలో ఎవరు సైకో? అనే డౌట్ మనకి రాకుండా ఉండదు. 

పనితీరు: ఇలాంటి కథతో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. అందువలన కొత్తదనం కోసం వెతకవలసిన పనిలేదు. అనూహ్యమైన మలుపులు కూడా ఏమీ కనిపించవు. అమ్మాయిలను సైకో కిడ్నాప్ చేయడాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించవచ్చు. కానీ అది చాలా సాదాసీదాగా చూపించి, హత్యలను మాత్రం దారుణంగా చూపించడం ఇబ్బంది పెడుతుంది. 

రామకృష్ణ సేనాపతి ఫొటోగ్రఫీ .. డీఎస్ ఆర్ నేపథ్య సంగీతం .. వినయ్ ఎడిటింగ్ ఫరవాలేదు.
కొన్ని దారుణమైన హత్యలు .. రక్తపాతం .. అందుకు కారణమైన సైకోను పట్టుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఎమోషన్స్ తో ముడిపడిన కథ లేకపోవడం వలన, హత్యలు మాత్రమే గుర్తుంటాయి. వరుస హత్యలకి సంబంధించిన దారుణమైన దృశ్యాలను చూసి తట్టుకోగలమని అనుకుంటే ప్రయత్నం చేయవచ్చు.

Movie Name: Dhakshina

Release Date: 2025-02-21
Cast: Sai Dhansika, Rishav Basu, Sneha Singh, Hima Sailaja, Karuna
Director: Tulasi Ram Osho
Music: DSR
Banner: Cult Concepts

Dhakshina Rating: 2.00 out of 5

Trailer

More Reviews