ఈ రోజునే విడుదలైన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'ధనుష్ దర్శకత్వంలో ట్రెండీ ప్రేమకథ సింపుల్ ప్రేమకథతో మెప్పించిన ధనుష్ ఆకట్టుకున్న ప్రియాంక్ అరుళ్ మోహన్ ప్రత్యేక గీతం హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, తనలోని క్రియేటివిటిని దర్శకుడిగా కూడా ధనుష్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇటీవల 'రాయన్'తో దర్శకుడిగా అందరి మెప్పు పొందిన ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కథ ఏమిటి? దర్శకుడిగా ధనుష్ ఎలాంటి సినిమాను అందించాడు? అనే అంశాలపై ఓకే లుక్కేద్దాం.
కథ: ప్రభు (పవీష్) హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును చదువుతుంటాడు. ఓ పెద్ద హోటల్‌లో చెఫ్ కావలనేది తన కోరిక. తొలిచూపులోనే నీల (అనికా సురేంద్రన్) ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని, ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే తన కూతురు ప్రభు లాంటి మధ్య తరగతి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నీల తండ్రి (శరత్ కుమార్)కు ఇష్టం ఉండదు. అయితే నీలతో ప్రభు కొన్ని రోజులు జర్నీ చేయడానికి ఒప్పుకుంటాడు.
ఈ నేపథ్యంలోనే ప్రభుకి ప్రీతి (ప్రియా ప్రకాష్ వారియర్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం పెళ్లి చూపుల వరకూ వెళుతుంది. ప్రీతీ ఎవరు? ఆమె ఎలా ప్రభు జీవితంలోకి అడుగుపెడుతుంది? ప్రభుకి దగ్గర కావడానికి ప్రీతీ ప్రయత్నిస్తుంటే నీల ఏం చేస్తుంది? చివరికి ప్రభుకు ఎవరు దక్కుతారు? అనే సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఇది చాలా సాదాసీదా కథ అని దర్శకుడు ధనుష్ చెబుతున్నట్లుగానే,చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇంతకు ముందు చూసిన కథే. అసలు ఇందులో కొత్తదనం ఏముంది? అనిపిస్తుంది. అయితే ఇలాంటి స్టేట్‌మెంట్స్ వల్ల ఈ సినిమాతో ఎవరూ అంచనాలు పెట్టుకోరు. అందుకే ఈ కథ సింపుల్‌గా అనిపించినా నేటి యువతరం మచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఎంగేజింగ్‌గా ఉంటుంది.
ముఖ్యంగా సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అందరూ చూసిన కథను దర్శకుడు కొత్త ట్రీట్‌మెంట్‌తో సరికొత్తగా ఉండేలా చేశాడు. ముఖ్యంగా నేటి యువతరానికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ చిత్రంలో సన్నివేశాలు, సంభాషణలు రొటిన్‌గా అనిపించినా అందరికి ఎందుకో నచ్చుతాయి. అదే ఈ సినిమా మ్యాజిక్‌లా అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతుంది.
తదుపరి సన్నివేశం ఏమిటో అనే క్యూరియాసిటీ, బీభత్సమైన యాక్షన్ ఏపిసోడ్స్, మాస్ డైలాగ్స్ ఇవేమీ లేకపోయినా ఎందుకో ఈ సినిమాలోని ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేసే విధంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కొనసాగిన విధానంతో ద్వితీయార్థంపై కూడా ఆసక్తి మొదలవుతుంది. ఈ తరం ప్రేక్షకులకు కావాలసిన అన్ని ఎలిమెంట్స్ ద్వితీయార్థంలో ఉండటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ తీద్దామనే ఆలోచనతో పతాక సన్నివేశాలు అసంపూర్తిగా ముగించడం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. ఈ లోపాన్ని మినహాయిస్తే మిగతా సినిమాను అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది.
నటీనటుల పనితీరు: ఈ సినిమాతో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా పరిచయమయ్యాడు. పక్కింటి కుర్రాడిగా ఎంతో చలాకీగా నటించాడు పవీష్. అతని నటనలో మేనమామ ధనుష్‌ను అనుకరిస్తున్నట్లుగా అనిపించింది. 'నీల'గా అనికా సురేంద్రన్ ఎంతో అందంగా కనిపించింది. ఆమె నటన కూడా అందరిని మెప్పిస్తుంది. హీరో ఫ్రెండ్ రాజేష్‌గా నటించిన మాథ్యూ థామస్ వినోదం అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాలో పవీష్ ఫ్రెండ్స్‌గా నటించిన మరో జంట ప్రేమకథ కూడా అలరిస్తుంది.
సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ చేసిన స్పెషల్ సాంగ్ అందరిలో జోష్ నింపుతుంది. కథ కాస్త డ్రాప్ అవుతుందన్న సమయంలో సెకండాఫ్‌లో వచ్చే ఈ పాట, మళ్లీ ట్రాక్‌లో పడేస్తుంది. ప్రియాంక అరుళ్ స్టెప్స్ మళ్లీ మళ్లీ చూసేలా అనిపించాయి. జీవీ ప్రకాష్ సంగీతం ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీకి ఎనర్జీని ఇచ్చింది. దర్శకుడిగా ధనుష్ చాలా సింపుల్ కథను తనదైన ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించి మెప్పించాడు.
తన మేనల్లుడు హీరో అనగానే నేల విడిచి సాము చేయకుండా, అందరికి తెలిసిన ఓ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని సింపుల్‌గా రూపొందించిన విధానం బాగుంది. సినిమా చూసినంత సేపు రొటిన్‌గా అనిపించినా.. రిచ్ కంటెంట్‌తో రీచ్ అయ్యే ప్రేమకథగా అనిపిస్తుంది. టోటల్‌గా 'జాబిలమ్మ నీకు అంత కోపమా- ఓ ట్రెండీ లవ్‌స్టోరీగా అందరి ప్రేమను పొందడానికి అవకాశం ఉంది.