హిందీ నుంచి క్రితం ఏడాదిలో వచ్చిన డ్రామా సిరీస్ లో 'తుక్రా కే మేరా ప్యార్' ముందువరుసలో కనిపిస్తుంది. ధవళ్ ఠాకూర్ - సంచిత బసు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, క్రితం ఏడాది నవంబర్ 22 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ విడతలవారీగా స్ట్రీమింగ్ చేస్తూ వచ్చారు. రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. శ్రద్ధా పాసి జైరత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని 'సితార్ పూర్' పరిధిలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో మనోహర్ చౌహన్ పెత్తనం నడుస్తూ ఉంటుంది. శ్రీమంతుడు .. రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు కావడం వలన, అతనికి అంతా భయపడుతూ ఉంటారు. తాను రాజకీయం చేస్తూ, తన తమ్ముడైన 'పుష్కర్'తో రౌడీయిజానికి సంబంధించిన పనులు చేయిస్తూ ఉంటాడు. చౌహాన్ కూతురే శాన్విక (సంచిత బసూ). ఆమె అంటే అతనికి ప్రాణం.
ఆ గ్రామంలోనే కులదీప్ కుమార్ ( ధవళ్ ఠాకూర్) తన పేరెంట్స్ తోను .. చెల్లెలితోను కలిసి నివసిస్తూ ఉంటాడు. వాళ్లది నిరుపేద కుటుంబం. కులదీప్ తండ్రి, చౌహాన్ బోట్స్ రిపేర్ చేసే పనులు చేస్తూ ఉంటాడు. కులదీప్ తల్లి చౌహాన్ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. శాన్విక కాలేజ్ లోనే చదువుతున్న కులదీప్, ఆ కాలేజ్ కి టాపర్. అందువలన అతని పట్ల శాన్వికకి గల అభిమానం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు.
కులదీప్ - శాన్విక ప్రేమవ్యవహారం అదే కాలేజ్ లో చదువుతున్న ఒక అల్లరిమూకకి తెలుస్తుంది. వాళ్ల ద్వారా ఆ విషయం చౌహాన్ బ్రదర్స్ చెవిన పడుతుంది. దాంతో చౌహాన్ కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోతారు. ఆ సమయంలో తనకేమీ తెలియదన్నట్టుగా శాన్విక ప్రవర్తిస్తుంది. దాంతో కులదీప్ కుటుంబ సభ్యులను చౌహాన్ గ్యాంగ్ ఇంట్లోనే బంధించి నిప్పు అంటిస్తుంది. ఆ ప్రమాదం నుంచి ఎలాగో బయటపడిన కులదీప్ కుటుంబ సభ్యులు, అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంటారు.
శాన్విక కారణంగా కులదీప్ కుటుంబ సభ్యుల పరువుపోతుంది. నలుగురిలో అతని చెల్లెలు అవమానించబడుతుంది. అతని చదువు మధ్యలో ఆగిపోతుంది. ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపోయిన ఆ ఫ్యామిలీ, కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి వచ్చేస్తుంది. ఆ కోపంతో కులదీప్ ఏం చేస్తాడు? చౌహాన్ కుటుంబ సభ్యులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? అసలు శాన్విక అతని పట్ల అలా ఎందుకు ప్రవర్తించింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ప్రేమకు పెద్దలతో ..పేదరికంతో ఎప్పుడూ శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. ఈ రెండు బలమైన గోడలను దాటుకుని గెలవడం ప్రేమకి ఎదురయ్యే పెద్ద పరీక్ష. ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన తరువాత, ఎలాంటి ప్రమాదాన్నయినా ఇద్దరూ కలిసే ఎదిరించాలి. కానీ ఆపద సమయంలో అమ్మాయి పక్కకి తప్పుకుంటే ఆ ప్రేమికుడి పరిస్థితి ఏమిటి? అనే కథను దర్శకుడు డిజైన్ చేసుకున్న విధానం బాగుంది.
పేదవాడైన ఒక యువకుడు శ్రీమంతుల ఇంటి అమ్మాయిని ప్రేమించడం .. ఆ అమ్మాయి ఫ్యామిలీతో ఆ యువకుడు తన్నులు తినడం .. ఆ సమయంలో ఆ అమ్మాయి మాట మార్చడం .. ఇలాంటి అంశాలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఈ కథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ప్రతి పాత్ర .. సన్నివేశం సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది.
ఒక పేద కుటుంబం .. ఒక శ్రీమంతుల కుటుంబం మధ్య ప్రేమ విషయంగా జరిగే పోరాటమే ఈ కథ అని చెప్పుకోవచ్చు. 19 ఎపిసోడ్స్ గా ఆవిష్కరించిన ఈ కథ ఎక్కడా బోర్ అనిపించదు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలను దర్శకుడు కనెక్ట్ చేయగలిగాడు. రొమాన్స్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ దర్శకుడు అటువైపు వెళ్లలేదు.
పనితీరు: ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా న్యాయం చేశారు. అయితే ముఖ్యంగా సంచిత బసూ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. మన తెలుగు హీరోయిన్ అంజలికి దగ్గర పోలికలతో కనిపించే ఈ అమ్మాయి, నటన పరంగా కూడా అంజలిని గుర్తుకు తెస్తుంది. కాస్త దూకుడు చూపించే ఈ పాత్రలో ఆమె నటన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.
కథ .. స్క్రీన్ ప్లే పకడ్బందీగా అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం కూడా ఈ సిరీస్ ప్రధానమైన బలంగా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినా, ట్రీట్మెంట్ పరంగా ఆడియన్స్ ను కూర్చోబెట్టగలిగారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.
'తుక్రా కే మేరా ప్యార్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
| Reviews

Thukra Ke Mera Pyaar Review
- డ్రామా సిరీస్ గా వచ్చిన 'తుక్రా కే మేరా ప్యార్'
- 19 ఎపిసోడ్స్ గా వచ్చిన సిరీస్
- తెలుగులోనూ అందుబాటులోకి
- ఇంట్రెస్టింగ్ గా నడిచే కంటెంట్
- సంచిత బసూ నటన హైలైట్
Movie Name: Thukra Ke Mera Pyaar
Release Date: 2024-11-22
Cast: Dhaval Thakur, Sanchita Basu, Anirudh Dave, Govind Pandey, Sushil Pandey
Director: Shraddha Pasi Jairath
Music: -
Banner: Bombay Show Studios
Review By: Peddinti
Thukra Ke Mera Pyaar Rating: 3.00 out of 5
Trailer