'లైలా' మూవీ రివ్యూ

| Reviews
Laila

Laila Review

  • 'లైలా'  ప్రేక్షకుల ముందుకు విష్వక్‌ సేన్‌ 
  • ప్రేక్షకులను ఆకట్టుకోని నాసిరకమైన కథ 
  • బోరింగ్‌గా ప్రేక్షకుల ఓపికకు పరీక్షగా లైలా
  • విష్వక్‌ సేన్‌కు మరోసారి నిరాశ

యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాందించుకున్న కథానాయకుడు విష్వక్‌ సేన్‌ నటించిన తాజా చిత్రం 'లైలా. ఈ చిత్రంలో ఆయన లేడి గెటప్‌లో కనిపించడమే హైలైట్‌గా ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్‌ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి ఈ సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది. అయితే విశ్వక్‌ సేన్‌ లేడి గెటప్‌, పృథ్వీరాజ్‌ చేసిన నెగెటివ్‌ పబ్లిసిటి అనేది ఈ సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదని ఈ చిత్రం ప్రారంభ వసూళ్లు చూస్తే అందరికి అర్థమవుతోంది. రామ్‌ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'లైలా' చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక లేడి గెటప్‌లో విశ్వక్‌ సేన్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? 'లైలా' ఎలా ఉంది అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: అమ్మ తనకు ఇచ్చిన జ్క్షాపకంగా, వారసత్వంగా  భావిస్తూ హైదరాబాద్‌లోని పాతబస్తీలో సోను (విష్వక్‌ సేన్‌) బ్యూటీ పార్లర్‌ను నడిపిస్తుంటాడు. పాతబస్తీలోని ఆడవాళ్లందరూ సోను బ్యూటీ పార్లర్‌కే వస్తుంటారు. అలా తన పార్లర్‌కు వచ్చిన ఓ లేడి కస్టమర్‌కు బిజినెస్‌ కోసం ఆర్థిక సహాయం చేయడమే కాక, వాళ్లు చేస్తున్న కుకింగ్‌ ఆయిల్‌ బిజినెస్‌కు అంబాసిడర్‌గా తన ఫోటోను కూడా ప్రచారంలో వాడుకోమని చెబుతాడు.  మరో వైపు ఆ ప్రాంతంలో మటన్‌ బిజినెస్ చేస్తున్న రుస్తుమ్‌  (అభిమన్యు సింగ్‌)కు పెళ్లి కాకుండా బాధపడుతుంటే, సోనూ తన పార్లర్‌లో మేకప్‌తో అందంగా తయారు చేసిన ఓ అమ్మాయి (కామాక్షి భాస్కర్ల)ను చూసి రుస్తుమ్‌ పెళ్లి చేసుకుంటాడు. 

అయితే శోభనం జరిగిన మరుసటి రోజే ఆమె అందం కేవలం మేకప్‌తోనే వచ్చిందని, సోను తనను మోసం చేశాడని అనుకుంటాడు రుస్తుం. దీంతో పాటు రుస్తుం పెళ్లి వంటల్లో వాడిన నూనె ద్వారా ఫుడ్‌ పాయిజన్‌ అయి పెండ్లికి వచ్చిన వారందరూ ఆస్పత్రిలో జాయిన్‌ అవుతారు. సోను ఈ ఆయిల్‌ కంపెనీకి అంబాసిడర్‌గా ఉండటంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలుపెడతారు. పోలీసుల నుండి, రుస్తుం నుండి తప్పించుకోవడానిక సోను లేడి గెటప్‌లోకి లైలాగా మారిపోతాడు. ఆ తరువాత ఏం జరిగింది? లేడి గెటప్‌ లైలాగా సోను ఏం చేశాడు? తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు అనేది వెండితెరపై చూడాలి. 


విశ్లేషణ: ఇలాంటి ఓ కథను సినిమాగా తీస్తానంటే నిర్మాత, హీరో విష్వక్‌ సేన్‌ ఎలా ఒప్పుకున్నాడు అనిపించేంత నాసిరకమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలో మచ్చుకైన ఒక సన్నివేశం కూడా ప్రేక్షకుడు చూసే విధంగా, భరించే విధంగా లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం విష్వక్‌ సేన్‌ లేడి గెటప్‌లో కనిపించడానికి మాత్రమే ఈ సినిమా
ఒప్పుకున్నాడా? అనే భావన కలుగుతుంది. ఇంతకు ముందు లేడి గెటప్‌లో మన హీరోలు చాలా సినిమాల్లో కనిపించారు. అయితే వాళ్లు కనిపించడానికి ఓ పర్పస్‌ ఉంటుంది. వాళ్లు అలా మారిపోవడానికి దాని వెనుక ఎంతో మీనింగ్‌ఫుల్‌ రీజన్‌ ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో అలా కనిపించడానికి చూపించే రీజన్‌ ఏ మాత్రం కన్వీన్సింగ్‌గా లేదు. 

సినిమా మొదలు నుంచి థియేటర్‌ నుంచి ఎప్పుడూ బయటపడదామా అనే విధంగా సినిమాలోని సన్నివేశాలు ఉంటాయి. ఏ మాత్రం ఆసక్తి లేని కథ, కథనాలతో కేవలం లేడి గెటప్‌తో సినిమాను లాగించేద్దామనే ఉద్దేశంతో దర్శకుడు రచనా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. సినిమాలో వినోదం, ఎమోషన్‌, సెంటిమెంట్‌ ఏమీ లేకుండా కథ నడిపించారు. సినిమా సెకండాఫ్‌లో ఉన్న సన్నివేశాల వల్ల ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ వచ్చే అవకాశం కూడా లేదు. 


నటీనటుల పనితీరు: ఈ చిత్రంలో హీరో విష్వక్‌ సేన్‌ పాతబస్తీ కుర్రాడు సోను పాత్రలో బాగానే నటించాడు. కానీ లైలా లేడి గెటప్‌లో మాత్రం ఆకట్టుకోలేక పోయాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ను కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేశారు. వీలున్నంత వరకు కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నంగా ఆమెను ఫోకస్‌ చేయాలని ప్రయత్నించారు. ఈ సినిమాలోని ఏ పాత్రలు, సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా లేనప్పుడు ఆ పాత్రలు పోషించిన వాళ్లు కూడా ఎలివేట్‌ అయ్యే అవకాశం లేదు. అందుకే మిగత పాత్రలు గురించి ప్రస్తావించకపోవడమే మంచిది. 

ఈ సినిమా విషయంలో దర్శకుడు రామ్‌ నారాయణ కథ విషయంలో, సన్నివేశాల విషయంలో ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదనిపించింది. కేవలం హీరో లేడి గెటప్‌లో కనిపించడమే సినిమాకు సక్సెస్‌ మంత్రంగా భావించడని అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ మాత్రం కలర్‌ఫుల్‌గా కనిపించింది.

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రస్తుతం  ప్రేక్షకులు ఎన్నో విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన కథలను అన్ని భాషల్లో చూస్తున్నారు. తెలుగు సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ సమయంలో ఇలాంటి నాసిరకమైన, బోరింగ్‌  కథతో ప్రేక్షకకుల ముందుకు రావడమనే నిర్ణయమే సాహసమని చెప్పాలి. టోటల్‌గా 'లైలా'ను ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయంగానే కనిపిస్తోంది.


Movie Name: Laila

Release Date: 2025-02-14
Cast: Vishwaksen, Akanksha Sharma
Director: Ram Narayan
Music: Leon James
Banner: Shine Screens

Laila Rating: 1.75 out of 5

Trailer

More Reviews