'భైరతి రణగల్'(ఆహా) మూవీ రివ్యూ!

| Reviews
Bhairathi Ranagal

Bhairathi Ranagal Review

  • కన్నడలో రూపొందిన 'భైరతి రణగల్'
  • క్రితం ఏడాది నవంబర్ 15న విడుదలైన సినిమా 
  • ఈ రోజు నుంచే తెలుగులో అందుబాటులోకి 
  • శివరాజ్ కుమార్ ఇమేజ్ కి తగిన కంటెంట్ 
  • రొటీన్ గానే అనిపించే కథాకథనాలు

శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన సినిమా 'భైరతి రణగల్'. శివరాజ్ కుమార్ సొంత బ్యానర్ పై ఈ  సినిమా నిర్మితమైంది. నార్తన్ దర్శత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది నవంబర్ 15వ తేదీన విడుదలైంది. డిసెంబర్ 25వ తేదీ నుంచి ఈ సినిమా కన్నడలో 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచి 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ  సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.   

కథ: ఈ కథ 1985లో మొదలవుతుంది. భైరతి రణగల్ (శివరాజ్ కుమార్) తన 12 ఏళ్ల వయసు నుంచే తన గ్రామమైన 'రోనాపూర్' గురించి ఆలోచన చేయడం మొదలుపెడతాడు. తన గ్రామంలో మంచినీటి వసతి లేకపోవడం వలన జనాలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారనేది గ్రహిస్తాడు. అందుకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యాన్ని సహించలేక నాటు బాంబులు సెట్ చేసి .. వాళ్లను లేపేస్తాడు. ఫలితంగా 21 ఏళ్లపాటు శిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలవుతాడు. 

తాను పుట్టి పెరిగిన ఊరు ఈ 21 ఏళ్లలో పూర్తిగా మారిపోతుంది. ఆయన చెల్లెలు వేదవతి .. జైపాల్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతణ్ణి పెళ్లి చేసుకుని ఆమె ఫారిన్ వెళ్లిపోవాలని అనుకుంటుంది. తన అనుమతి కోసమే ఆమె వెయిట్ చేస్తుందని తెలిసి, అందుకు భైరతి రణగల్ ఒప్పుకుంటాడు. తాను అడ్వకేట్ గా పనిచేస్తూ, పేదవాళ్లకు అండగా నిలబడతాడు. ఆయన మంచితనం చూసి, డాక్టర్ వైశాలి(రుక్మిణి వసంత్) ఆరాధిస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. 

ఈ నేపథ్యంలోనే తనని నమ్మినవాళ్ల కోసం పరండే (రాహుల్ బోస్) తో భైరతి రణగల్ గొడవపడతాడు. కార్మికులను బెదిరించడానికీ .. వాళ్లతో పని చేయించుకోవడానికి భైరతి రణగల్ అడ్డుగా ఉండటాన్ని వాళ్లు తట్టుకోలేకపోతారు. అప్పుడు పరండే ఏం చేస్తాడు? ఫలితంగా భైరతి రణగల్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? స్వార్థరాజకీయాలు ఆయనను ఎలా మారుస్తాయి? అనే అంశాలతో ఈ కథ నడుస్తుంది. 

విశ్లేషణ: తన కుటుంబం బాగు కోసం ఆలోచించేవాడిని యజమాని అంటారు. ఊరు బాగు కోసం ఆలోచన చేసేవాడిని నాయకుడు అంటారు .. కథానాయకుడిగా చెప్పుకుంటారు. అలాంటి ఒక కథానాయకుడి కథ ఇది. తన ఊరును కాపాడుకోవాలి .. తన ప్రజలను రక్షించుకోవాలి అనే ఒక ఆలోచనతో, అందుకోసం ఎంతవరకైనా వెళ్లే ఒక వ్యక్తి కథ ఇది. తన గ్రామం .. తన ప్రజల మేలు కోసం, బంధుత్వాలు కూడా పట్టించుకోని స్వభావం ఆయనది. 

మంచి చేయడానికి కూడా చెడ్డవాడిగా మారవలసిందే అనే సూత్రాన్ని పాటించే ఈ పాత్రను దర్శకుడు మలిచిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మంచి చేయడం మొదలుపెడితే, ఆ క్షణం నుంచే చెడు మనలను వెతకడం మొదలు పెడుతుంది అనే పాయింటును టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. 

గ్రామాలను కార్పొరేట్ సంస్థలు ఎలా ఆక్రమిస్తున్నాయి? అందుకు స్వార్థ రాజకీయ నాయకులు ఎలా సహకరిస్తున్నారు? ఈ విషయంలో అడ్డుతగిలినవారి పరిస్థితి ఏమిటి? అనే విషయంలో ఆడియన్స్ కి ఒక అంచనా వచ్చేలా దర్శకుడు చెప్పగలిగాడు. ఇది శివరాజ్ కుమార్ ఇమేజ్ కీ  .. బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ అనే చెప్పాలి. యాక్షన్ ను .. ఎమోషన్ ను కలిపి నడిపిస్తూ వెళ్లినప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. 

పనితీరు
: శివరాజ్ కుమార్ కి కన్నడలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తన ఇమేజ్ కి తగిన పాత్రనే ఈ సినిమాలో ఆయన చేశాడు. ఆయన యాక్టింగ్ స్టైల్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. ఇక రుక్మిణి వసంత్ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, సింపుల్ గా కనిపిస్తూనే ఆకట్టుకుంటుంది. రాహుల్ బోస్ విలనిజం కాస్త వీక్ గా  అనిపిస్తుంది. ఈ పాత్రను పవర్ఫుల్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండునే అనిపిస్తుంది.

నవీన్ కుమార్ ఫోటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన విధానానికి ఎక్కువ మార్కులు పడతాయి. రవి బస్రూర్ నేపథ్య సంగీతం, శివ రాజ్ కుమార్ ఇమేజ్ కి తగిన స్థాయికి సన్నివేశాలను తీసుకుని వెళుతుంది. ఆకాశ్ హీరేమఠ్ ఎడిటింగ్ ఓకే. శివరాజ్ కుమార్ కి కన్నడలో గల ఇమేజ్ కారణంగా, అక్కడి వారి నుంచి మంచి రెస్పాన్స్ రావడం సహజం. లేదంటే ఇది ఒక యావరేజ్ సినిమాగానే అనిపిస్తుంది.

Movie Name: Bhairathi Ranagal

Release Date: 2025-02-13
Cast: Shiva Rajkumr, Rukmini Vasanth, Rahul Bose, Devaraj
Director: Narthan
Music: Ravi Basrur
Banner: Geetha Pictures

Bhairathi Ranagal Rating: 2.50 out of 5

Trailer

More Reviews