ఓటీటీలో విడుదలవుతున్న మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా మలయాళం నుంచి 'ఆహా'కి వచ్చిన సినిమానే 'వివేకానందన్ వైరల్'. మలయాళంలో క్రితం ఏడాది జనవరి 19వ తేదీన విడుదలైంది. షైన్ టామ్ చాకో కథానాయకుడిగా నటించాడు. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన చేరువయ్యాడు. నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: వివేకానందన్ ( షైన్ టామ్ చాకో) టౌన్లో ఉన్న ఒక బ్యాంకులో ఏరియా మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య సితార (స్వాసిక విజయ్) పంచాయితీ ఆఫీసులో పనిచేస్తూ ఉంటుంది. వివేకా తల్లిదండ్రులు విడిపోయి చాలాకాలమే అవుతుంది. అయినా వాళ్ల మధ్య ప్రేమానురాగాలు అలాగే ఉంటాయి. వివేకా టౌన్లోనే ఒక రూమ్ రెంట్ కి తీసుకుని ఉంటూ, వీకెండులో మాత్రమే ఇంటికి వస్తుంటాడు.
వివేకాలో శృంగారపరమైన ఆలోచనలు .. కోరికలు ఎక్కువ. అందువలన అతను రకరకాల లేహ్యాలు వాడుతూ ఉంటాడు. శృంగార సమయంలో అతని ప్రవర్తన రాక్షసంగా ఉండటంతో భార్య సైతం భయపడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే అతను టౌన్లో తాను అద్దెకి ఉండే ఇంటి ఓనర్ కూతురు 'డయానా'ను ముగ్గులోకి దింపుతాడు. సితారకి తెలియకుండా డయానాతో సహజీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఆమెను కూడా శారీరికంగా హింసిస్తూ ఉంటాడు.
ఇక తనతో పాటు బస్సులో ప్రయాణించే ఒక యువతినీ .. బ్యాంకు పనిపై తనని కలవడానికి వచ్చిన 'దివ్య'ను ముగ్గులోకి దింపడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెడతాడు. అతని స్వభావాన్ని అర్థం చేసుకున్న డయానా అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? సితార సపోర్టును కూడా కోరాలని అనుకున్న ఆమెకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? వివేకా నందన్ ఏ విధంగా వైరల్ అవుతాడు? అనేది కథ.
విశ్లేషణ: కామెడీ డ్రామా జోనర్లో కమల్ సిద్ధం చేసుకున్న కథ ఇది. పెళ్లి తరువాత కూడా కొంతమంది శృంగారపరమైన ఆలోచనలతో అమ్మాయిల వెంటపడటం .. వాళ్ల పట్ల వికృతంగా పరవర్తించడం చేస్తుంటారు. తమకి తాము రొమాంటిక్ హీరోలుగా ఊహించుకుంటూ పక్కదారులు పడుతూ ఉంటారు. అలాంటి స్వభావం కలిగిన ఈ కథలోని నాయకుడికి అమ్మాయిలంతా కలిసి ఎలా గుణపాఠం చెప్పారనే ఈ కథను దర్శకుడు తనదైన స్టైల్లో ఆవిష్కరించాడు.
మలయాళంలో ఇంతవరకూ షైన్ టామ్ చాకో చేస్తూ వచ్చిన పాత్రలు వేరు. రొమాన్స్ తో కూడిన ఈ పాత్రలో విపరీత పోకడలు ఉంటాయి. అందువలన దర్శకుడు ఆయనను ఎంచుకున్నాడనే విషయం మనకి అర్థమవుతుంది. హీరో అమ్మాయిలకు వల విసిరే ప్రయత్నాలతో ఫస్టాఫ్ సరదాగానే సాగిపోతుంది. వివేకానందన్ కి బుద్ధి చెప్పాలని అమ్మాయిలంతా నిర్ణయించుకోవడం సెకండాఫ్ గా నడుస్తుంది.
అయితే వివేకానందన్ కి వాళ్లు బుద్ధి చెప్పడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటారా? అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశనే ఎదురవుతుంది. అక్కడి నుంచి కథలో వినోదం లోపించి .. హడావిడి మాత్రమే కనిపిస్తుంది. సెకండాఫ్ లో కథ దాదాపు ఒక ఇంట్లో .. నాలుగు గోడల మధ్య పరిమితమైపోతుంది. నిజానికి ఈ తరహా కథలో మంచి కామెడీని వర్కౌట్ చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నమేదీ కనిపించదు.
పనితీరు: షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మిగతా ఆర్టిస్టులంతా చాలా నేచురల్ గా చేశారు. ఫస్టాఫ్ ను కాస్త సరదాగానే నడిపించిన దర్శకుడు, ఆ తరువాత కథను అంత పట్టుగా రాసుకోలేకపోయాడు. అనవసరమైన హడావిడి తప్ప, వినోదం కనిపించదు.
ప్రకాశ్ వేలాయుధన్ ఫొటోగ్రఫీ బాగుంది. అవకాశం చిక్కినప్పుడు విలేజ్ నేపథ్యంలో లొకేషన్స్ ను బాగా చూపించాడు. బిజిబల్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. రంజన్ అబ్రహం ఎడిటింగ్ కూడా ఓకే. సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం .. వివేకానందన్ పేరెంట్స్ ఎందుకు విడిపోయారనే ఫ్లాష్ బ్యాక్ కూడా బలంగా లేకపోవడంతో పాటు, క్లైమాక్స్ కూడా వీక్ గా అనిపిస్తుంది. అందువలన ఈ కంటెంట్ నిరాశపరిచిందనే చెప్పుకోవాలి..
'వివేకానందన్ వైరల్' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews

Vivekanandan Viral Review
- మలయాళంలో రూపొందిన 'వివేకానందన్ వైరల్'
- నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
- ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఫస్టాఫ్
- నిరాశపరిచే సెకండాఫ్
- కనిపించని కామెడీ
Movie Name: Vivekanandan Viral
Release Date: 2025-02-07
Cast: Shine Tom Chacko, Sasika, Grace Antony, Mareena, Maala Parvathi
Director: Kamal
Music: Bijibal
Banner: Nediyath Productions
Review By: Peddinti
Vivekanandan Viral Rating: 2.00 out of 5
Trailer