తెలుగులో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అలా వచ్చిన సినిమానే 'తండేల్'. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ కంటెంట్ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కథ: అది శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జాలరి గూడెం. ఆ గూడెంలోని కుర్రాళ్లంతా చేపల వేటను వృత్తిగా కొనసాగిస్తూ ఉంటారు. ఆ జాలరులకు 'తండేల్'గా .. అంటే నాయకుడిగా రాజు (నాగచైతన్య) ఉంటాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇంటికి అతనే దిక్కు. అతనిని అదే గూడానికి చెందిన సత్య (సాయిపల్లవి) ప్రేమిస్తూ ఉంటుంది. తల్లిని కోల్పోయిన ఆమె, తండ్రి ఆలనాపాలనలో పెరుగుతుంది.
రాజు ఒకసారి సముద్రంపైకి వెళితే, తిరిగి రావడానికి తొమ్మిది నెలలు పడుతూ ఉంటుంది. రాజూనే పెళ్లి చేసుకోవాలని అనుకున్న సత్య, అతనికి ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉంటుంది. చేపల వేట మానేయమని పోరుతూ ఉంటుంది. గూడానికి కష్టం వస్తే అండగా నిలిచే తానే చేపలవేట మానేయడం సరికాదని సత్యకు నచ్చజెప్పడానికి రాజు ప్రయత్నిస్తాడు. ఆమె ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా వెళతాడు.
అలా వెళ్లిన రాజు .. అతని బృందం తమకి తెలియకుండానే పాకిస్థాన్ సముద్ర జలాలలో ప్రవేశిస్తారు. దాంతో అరెస్టు చేయబడి 'కరాచీ' సెంట్రల్ జైలుకి వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? తన భర్తను విడిపించుకోవడానికి సత్య ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
విశ్లేషణ: మత్స్య కారుల కుటుంబాలకి చెందిన రాజు - సత్య ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఏడాదిలో 9 నెలలు అతను సముద్రంపై ఉంటాడు. ఆ మిగతా 3 నెలల కోసమే ఈ 9 నెలల పాటు ఇద్దరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆ ఇద్దరి లవ్ ట్రాక్ కి సంబంధించిన సన్నివేశాలతో ఫస్టాఫ్ కొనసాగుతుంది. ఈ కథ పల్లెటూరు నుంచి పాకిస్థాన్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి సెకండాఫ్ మొదలవుతుంది.
ఫస్టాఫ్ లో రాజు ప్రేమను దక్కించుకోవాలనుకున్న సత్య, సెకండాఫ్ లో ప్రాణాలతో అతన్ని దక్కించుకోవడం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇది యథార్థ సంఘటనే అయినా .. సహజత్వం దెబ్బతినకుండా సినిమా టిక్ లక్షణాలను ఆపాదిస్తూ వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. లవ్ .. ఎమోషన్స్ తో పాటు, దేశభక్తి .. ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు.
సముద్రపు తుపానులో బోట్ చిక్కుకోవడం .. గుజరాత్ సేఠ్ దగ్గర సాయిపల్లవి ధర్నాకి దిగడం .. వర్షంలో పెళ్లికూతురుగా ఢిల్లీ పెద్దలను కలవడం .. పాకిస్థాన్ జైల్లో దేశభక్తి నేపథ్యంలోని యాక్షన్ దృశ్యాలు మనసును మరింత బలంగా తాకుతాయి. అయితే మైమ్ గోపీ వంటి ఆర్టిస్ట్ ను చిన్న పాత్రకి పరిమితం చేయడం బాధగా అనిపిస్తుంది. డైలాగ్ తో సరిపోయే బబ్లూ పృథ్వీ ఫ్లాష్ బ్యాక్ ను దృశ్య రూపంలో చూపించడం అవసరం లేదనిపిస్తుంది.
పనితీరు: కథ - స్క్రీన్ ప్లే పరంగా చందూ మొండేటి మంచి మార్కులు కొట్టేశాడు. ఎక్కడా బోర్ అనిపించకుండా బలమైన .. బరువైన ఎమోషన్స్ ను ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తూ వెళ్లాడు. గీతా ఆర్ట్స్ సినిమా కనుక, నిర్మాణ సంబంధమైన విషయాల్లో ఎక్కడా రాజీపడినట్టుగా కనిపించదు. సాయిపల్లవి నటన - డాన్స్ ఆమె అభిమానులను కట్టిపడేస్తుంది. చైతూ కూడా ఎమోషన్స్ ను బాగానే పలికించాడు.
శ్యామ్ దత్ ఫొటోగ్రఫీ బాగుంది. సముద్రం నేపథ్యంలో సన్నివేశాలను .. పాటలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ స్వరపరిచిన బాణీలు ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. ముఖ్యంగా 'థీమ్' మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా అనిపిస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా మంచి మార్కులనే అందుకుంటుంది.
'తొమ్మిది నెలలు నీకు దూరంగా ఉండటం అంటే, పురిటి నెప్పులు పడటం కంటే ఎక్కువ బాధగా ఉంటుంది' .. 'బతుకు వలలో అతను .. భయం వలలో నేను' .. 'తప్పుచేసి రాలేదు .. తప్పిపోయి వచ్చాము' .. వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.'సైన్యం లేని సమరంలో ధైర్యమే ఆయుధం' అంటూ 'ఆజాది' పాటలోని సాహిత్యం కూడా ఆలోచింపజేసేలా ఉంది.
ముగింపు: మొత్తంగా చూసుకుంటే ఒక మంచి ప్రేమకథ .. దేశభక్తి ..స్నేహం అనే మూడు అంశాల కలయికగా ఈ సినిమా కనిపిస్తుంది. సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లే ఎమోషన్స్ .. పాటలు ఈ సినిమాను ప్రేక్షకుల మనసుకు చేరవేస్తాయి. చైతూ .. సాయిపల్లవి కలిసి మరో హిట్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి.
'తండేల్' - మూవీ రివ్యూ!
| Reviews

Thandel Review
- యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన 'తండేల్'
- బలమైన కథాకథనాలు
- బరువైన సన్నివేశాలు
- హైలైట్ గా నిలిచే పాటలు
- చైతూ - సాయిపల్లవికి మరో హిట్ పడే ఛాన్స్
Movie Name: Thandel
Release Date: 2025-02-07
Cast: Naga Chaitanya, Sai Pallavi, Aadukalam Naren, Prakash Belawadi,Karunakaran
Director: Chandu Mondeti
Music: Devi Sri Prasad
Banner: Bunny Vasu
Review By: Peddinti
Thandel Rating: 3.00 out of 5
Trailer