టోవినో థామస్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందిన సినిమానే 'ఐడెంటిటీ'. అఖిల్ పాల్ - అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. త్రిష కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అలీషా (త్రిష) ఒక టీవీ ఛానల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ కేసుకు సంబంధించిన పరిశోధనలో భాగంగా ఆమె ఒక పాడుబడిన ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ అమర్ అనే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి మర్డర్ చేయడం చూస్తుంది. ఆ సంఘటనను తన కెమెరాలో షూట్ చేసిన ఆమె, అక్కడి నుంచి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. దాంతో ఆమె ఫేస్ బ్లైండ్ నెస్ తో ఇబ్బందిపడుతూ ఉంటుంది. హంతకుడు ఎవరనేది ఆమె ద్వారా తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ అలెన్ జాకబ్ (వినయ్ రాయ్) ప్రయత్నిస్తూ ఉంటాడు. అలీషాను ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి రక్షిస్తూ ఉంటాడు.
ఆ సమయంలోనే ఆయనకి హరన్ (టోవినో థామస్) పరిచయమవుతాడు. అతను మంచి స్కెచ్ ఆర్టిస్ట్ అనే విషయం తెలుసుకున్న అలెన్, అలీషాతో హంతకుడి పోలికలు చెప్పిస్తూ .. హరన్ తో స్కెచ్ గీయిస్తాడు. అలీషా చెప్పినట్టు బొమ్మ గీసిన హరన్, తన పోలికలతో ఆ బొమ్మ ఉండటం చూసి షాక్ అవుతాడు. అప్పటి నుంచి అతణ్ణి అలెన్ అనుమానించడం మొదలుపెడతాడు. హత్యకి గురైన అమర్ దగ్గర ఉండవలసిన హెచ్ డీ డ్రైవ్ గురించి అతని అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది.
హరన్ పై అనుమానం రావడంతో, ఆయన ఎవరో .. ఆయన ఆనవాళ్లు ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకునే పనిని సుప్రియ (మందిరా బేడీ)కి అలెన్ అప్పగిస్తాడు. అదే సమయంలో హరన్ కూడా అలెన్ గురించి తెలుసుకునే పనిలో పడతాడు. హరన్ గురించి అలెన్ ఏం తెలుసుకుంటాడు? అలెన్ గురించి హరన్ కి ఏం తెలుస్తుంది? హత్యకి గురైన అమర్ ఎవరు? అలీషా చూసిన హంతకుడు ఎవరు? అసలు ఈ కథ అంతా తిరిగే ఐడెంటిటీ దేనికి సంబంధించినది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో ఒక హత్య జరుగుతుంది. హత్య చేయబడిన వ్యక్తి దగ్గరగల ఒక హెచ్ డీ డ్రైవ్ లో కొంతమందికి సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ దేనికి సంబంధించినవి? అవి హెచ్ డీ డ్రైవ్ లో ఎలా బయటికి వచ్చాయి? ఈ రాకెట్ వెనుక ఎవరున్నారు? అనే విషయాలను దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చెబుతూ వెళ్లాడు.
ఫస్టాఫ్ లో అనేక సందేహాలను రేకెత్తిస్తూ వెళ్లిన దర్శకుడు .. సెకండాఫ్ లో వాటిని విప్పేస్తూ వెళ్లిన విధానం కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా విలన్ చెడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటే .. హీరో వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇటు హీరోపై .. అటు విలన్ పై కూడా సందేహాలను రేకెత్తిస్తూ వెళ్లడం ఈ కథలో కొత్తగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరు 'దోషి' అనే అనుమానమే తలెత్తుతూ ఉంటుంది.
'ఐడెంటిటీ' అనే ఈ సినిమా చూసినప్పుడు, ఈ సినిమాకి స్క్రీన్ ప్లేనే ఆయువు పట్టు అనే విషయం అర్థమవుతుంది. అలాంటి స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వలన, కథలో కాస్త గందరగోళం ఏర్పడిందేమో అనిపిస్తుంది. ట్విస్టులు బాగానే ఉన్నాయే అనిపిస్తుంది .. కానీ ప్రేక్షకుడు దానిని పూర్తిగా ఎంజాయ్ చేయలేడు .. ఎందుకంటే ఒక రకమైన అయోమయం అతనిని వెంటాడుతూ ఉంటుంది. సాధారణ ప్రేక్షకులకు వెంటనే అర్థం కానీ స్క్రీన్ ప్లే ఇది.
పనితీరు: టోవినో థామస్ .. వినయ్ రాయ్ నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. త్రిష మొదటి నుంచి చివరివరకూ తెరపై కనిపిస్తుంది. అయితే ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. దర్శకుడు చాలా పాత్రలను తెరపైకి తీసుకుని వస్తాడు .. కానీ అవేవీ ఆడియన్స్ ను ప్రభావితం చేసేవిలా కనిపించవు. హీరో - విలన్ పాత్రల పైనే పూర్తి ఫోకస్ పెట్టడం కనిపిస్తుంది. మిగతా పాత్రలన్నీ నామమాత్రంగానే కనిపిస్తాయి.
సినిమా మొత్తం చూసిన తరువాత, ఒక హంతుకుడిని గుర్తుపట్టడానికి 'త్రిష' అవసరమా అనిపిస్తుంది. ఇక ఆదిత్య మీనన్ .. మందిర బేడీ వంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆ పాత్రలతో కాస్త హడావిడి చేయడానికి ప్రయత్నించిన డైరెక్టర్, ఆ తరువాత విరమించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇక హీరో బాల్యం నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుంది. కానీ అది అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించదు. ఈ కథను అంత చుట్టూ తిప్పుకు రావలసిన అవసరం లేదనే అనిపిస్తుంది.
నిర్మాణ విలువల పరంగా ఈ సినిమాకి వంక బెట్టవలసిన అవసరం లేదు. అఖిల్ జార్జ్ ఫొటోగ్రఫీ బాగుంది. ఛేజింగ్ దృశ్యాలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. చమన్ చాకో ఎడిటింగ్ విషయానికి వస్తే, కొన్ని అనవరసమైన సన్నివేశాలపై కత్తెర పడలేదనిపిస్తుంది.
ముగింపు: కథాపరంగా .. నిర్మాణం పరంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అయితే కథను మరింత విస్తృతంగా చెప్పడం కోసం దాని పరిధిని పెంచేసి అయోమయానికి కారకులయ్యారు. పాయింట్ కొత్తదేగానీ, దానిని సామాన్య ప్రేక్షకులకు వెంటనే అర్థమయ్యేలా చెప్పలేకపోయారని అనిపిస్తుంది.
'ఐడెంటిటీ' (జీ 5) మూవీ రివ్యూ!
| Reviews

Identity Review
- మలయాళంలో రూపొందిన 'ఐడెంటిటీ'
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సినిమా
- కొత్త పాయింటును ఎంచుకున్న డైరెక్టర్
- అనవసరమైన పాత్రలతో .. సీన్స్ తో గందరగోళం
- మంచి మార్కులు కొట్టేసిన ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
Movie Name: Identity
Release Date: 2025-01-31
Cast: Tovino Thomas, Trisha, Vinay Rai, Aju Varghese, Shammi Thilakan, Arya
Director: Akhil Paul - Anas Khan
Music: Jakes Bejoy
Banner: Ragam Movies
Review By: Peddinti
Identity Rating: 2.75 out of 5
Trailer