'పోతుగడ్డ' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

| Reviews
Pothugadda

Pothugadda Review

  • నేరుగా ఓటీటీకి వచ్చేసిన 'పోతుగడ్డ'
  • ప్రేమ - రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • సింపుల్ కంటెంట్ ను బలంగా చెప్పిన డైరెక్టర్, ఆడుకాలం నరేన్ నటన హైలైట్ 
  • యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథ

ఈ మధ్య కాలంలో ఓటీటీ వైపు నుంచి ఆసక్తిని రేకెత్తించిన సినిమాగా 'పోతుగడ్డ' కనిపిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఈటీవీ విన్' వారు సొంతం చేసుకున్నారు. నేరుగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. కర్నూల్ నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో, కర్నూల్ లోని 'పోతుగడ్డ' నియోజక వర్గంలోని వాతావరణం వేడెక్కుతూ ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సముద్ర (ఆడుకాలం నరేన్) మళ్లీ ఈ సారి కూడా తానే నెగ్గాలని అనుకుంటాడు. తన కూతురు 'గీత'ను యూత్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తాడు. సముద్రపై తరచూ ఓడిపోతూ వస్తున్న భాస్కర్ (శత్రు) ఈ సారి తానే గెలవాలనే పట్టుదలతో ఉంటాడు. అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు పంచడానికి ఏర్పాట్లు చేస్తుంటాడు. 

సముద్ర కూతురు గీతకి తల్లిప్రేమ తెలియదు. తండ్రికి రాజకీయాలు తప్ప మరో ధ్యాస ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె కృష్ణ (పృథ్వీ) ప్రేమలో పడుతుంది. తమ పెళ్లికి తండ్రి ఒప్పుకోడనే ఉద్దేశంతో ఆ ఊరు నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఒక రాత్రివేళ ఇల్లొదిలి వెళ్లిపోతుంది. ఈ విషయం బయటికి వెళితే పరువుపోతుందని భావించిన తండ్రి, కృష్ణను చంపేసి గీతను తీసుకురమ్మని తన ప్రధాన అనుచరుడైన వెంకట్ తో చెబుతాడు. 'పొలిమేర' దాటేలోగా తన కూతురును తిరిగి తీసుకురావాలని ఆదేశిస్తాడు.  

 ఎన్నికలలో పంచడం కోసం భాస్కర్ 50 కోట్లను ఏర్పాటు చేస్తాడు. ఆ డబ్బును బుట్టలో పెట్టుకుని, అతని అనుచరులు బస్సులో బయల్దేరతారు. గీత - కృష్ణ అదే బస్సు ఎక్కుతారు. 'రాయచోటి' వెళ్లే ఆ బస్సులో వాళ్లు వెళ్లారని తెలుసుకున్న వెంకట్, ఆ బస్సును ఫాలో అవుతూ దానిని అందుకుంటాడు. రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతానికి ఆ బస్సు వెళ్లగానే తన పని పూర్తి చేయాలని వెంకట్ అనుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.

విశ్లేషణ: రక్ష వీరమ్ రాసుకున్న కథ ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథను .. అక్కడ స్థానికంగా ఉండే రాజకీయాలను కలుపుకుంటూ వెళ్లిన కథ ఇది. తమ ప్రేమను గెలిపించడం కోసం ఇల్లొదిలి వెళ్లిన ప్రేమజంట .. ఆ ప్రేమజంటను విడదీసి తమ పరువు కాపాడుకోవాలనీ .. తమ పదవులు కాపాడుకోవాలనుకునే రాజకీయ నాయకుల మధ్య ఈ కథ కొనసాగుతుంది. 90 శాతం కథను బస్సులో నడిపించడం విశేషం. 

నిజానికి ఈ కథలో చాలా తక్కువ పాత్రలు కనిపిస్తాయి. రాత్రివేళ ప్రయాణిస్తున్న బస్సులోనే కథ అంతా నడుస్తూ ఉంటుంది. అందువలన కథతో పాటు ట్రావెల్ చేస్తున్న ఫీల్ ను ప్రేక్షకులు పొందుతూ ఉంటారు. అందమైన .. అమాయకమైన ప్రేమజంట బస్సులో రాత్రివేళ ప్రయాణం చేస్తూ ఉండటం .. వాళ్లను ఒక వైపున రాజకీయనాయకులు .. మరో వైపున పోలీసులు టార్గెట్ చేయడం ఉత్కంఠను రేకెత్తించే అంశంగా అనిపిస్తుంది.

నిజానికి ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఒక్క బస్సులోనే మొత్తం కథను నడిపించడం చాలా కష్టమైన విషయం. కానీ దర్శకుడు వేసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. బస్సులోకి కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తూ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలాగే చివరికి ఏమౌతుందా అని వెయిట్ చేస్తూ వచ్చిన ప్రేక్షకులకు నిరాశ కలిగించని ఒక ముగింపు ఉంటుంది.

పనితీరు: హీరో .. హీరోయిన్ .. ఆమె తండ్రి .. ఆయన ప్రధాన అనుచరుడు .. ప్రధాన శత్రువు అనే పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆడుకాలం నరేన్ .. ఆయన ప్రధానమైన అనుచరుడి నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలి. 

దర్శకుడు వేసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. చాలా సింపుల్ కంటెంట్ ను ఇంట్రెస్టింగ్ గా అందించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా పనితనం .. మార్కస్ నేపథ్య సంగీతం .. శివకిరణ్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: జీవితంలో డబ్బు అనేది చాలా మందిని మార్చేస్తుంది. అలాగే పరువు విషయానికి వచ్చేసరికి కూడా మనుషులు మారిపోతూ ఉంటారు. డబ్బుకి .. పరువుకు మాత్రమే కాదు, ప్రేమకి కూడా మనుషులను మార్చేసే శక్తి ఉంటుందని చాటి చెప్పే సినిమా ఇది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. 

Movie Name: Pothugadda

Release Date: 2025-01-30
Cast: Prudhvi Dandamudi, Aadukalam Naren, Krheah Raj, Shatru, Aadvik Bandaru
Director: Raksha Veeram
Music: Marcus
Banner: 24 Cinema Street

Pothugadda Rating: 2.50 out of 5

Trailer

More Reviews