మలయాళంలో నజ్రియా నజీమ్ కి ఉన్న క్రేజ్ తెలియనిది కాదు. ఇక బాసిల్ జోసెఫ్ కి ఉన్న ఇమేజ్ కూడా తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో 'సూక్ష్మదర్శిని' సినిమా రూపొందింది. నవంబర్ 22వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. థియేటర్ల నుంచి 55 కోట్ల వరకూ రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: ప్రియా (నజ్రియా) ఆంటోని (దీపక్) భార్యాభర్తలు. ఆంటోని ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. ప్రియా తన స్నేహితురాళ్లయిన స్టెఫీ - ఆస్మాలతో తన కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటుంది. చాలా కాలం క్రితం ఆ ఊరు నుంచి వెళ్లిపోయిన మాన్యుయల్ (బాసిల్ జోసెఫ్), తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన తిరిగి ఆ ఊరుకి తీసుకుని వస్తాడు. మాన్యుయల్ వాళ్ల పక్కనే ఉన్న ఇంట్లోనే ప్రియా వాళ్లు అద్దెకి ఉంటూ ఉంటారు.
ప్రియా వాళ్ల కిటికీలో నుంచి మాన్యుయెల్ వాళ్ల ఇల్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తన తల్లి అల్జీమర్స్ తో బాధపడుతున్నట్టు మాన్యుయెల్ అక్కడి వాళ్లకి చెబుతాడు. అప్పుడప్పుడు ఆమె ఇల్లు వదలి వెళ్లిపోవడం .. మాన్యుయెల్ ఆమె జాడ తెలుసుకుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కానీ అతని తల్లి ప్రవర్తనను గమనిస్తూ వస్తున్న ప్రియా, ఆమె అల్జీమర్స్ తో బాధపడుతుందనేది అబద్ధమని భావిస్తుంది. అలాగే మాన్యుయెల్ ప్రవర్తన కూడా ఆమెకి కాస్త అనుమానంగా అనిపిస్తుంది.
ఒకసారి తన తల్లి కనిపించకుండా పోయిందని మాన్యుయెల్ చెప్పిన నాలుగు రోజులకు, ఓ రాత్రివేళ ఆ ఇంట్లోనే అతని తల్లిని ప్రియ చూస్తుంది. ఆ మరుసటి రోజు మాన్యుయెల్ ను అతని తల్లిని గురించి అడిగితే, ఇంకా ఆమె జాడ దొరకలేదనే చెబుతాడు. దాంతో ప్రియకి అనుమానం మొదలవుతుంది. మాన్యుయెల్ ఏదో చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది అనే అనుమానం బలపడుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఫలితంగా ఆమెకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అనేది కథ.
విశ్లేషణ: ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ప్రియా .. మాన్యుయెల్ .. అతని తల్లి .. ఈ మూడు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. మిగతా పాత్రలు సందర్భాన్ని బట్టి తెరపైకి వచ్చి వెళుతూ ఉంటాయి. ఈ కథను ఫస్టాఫ్ గా .. సెకండాఫ్ గా విడదీసి చూడలేం. ఎందుకంటే కథ నిదానంగా .. చాలా సరదాగా .. సాదాసీదాగా మొదలై, వెళుతూ వెళుతూ చిక్కబడుతుంది.
సాధారణంగా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందిలో ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు .. అవతల ఫ్యామిలీపై అనుమానం బలపడుతూ వెళితే ఎలా ఉంటుందనేది దర్శకుడు రివీల్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బాసిల్ జోసెఫ్ కి కామెడీ వైపు నుంచి ఉన్న క్రేజ్ గురించి చెప్పవలసిన పనిలేదు. కానీ అతణ్ణి ఈ సినిమాలో చూపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది.
సాధారణంగా పట్టణాలలో ఎవరింట్లో ఏం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. కానీ అదే పల్లెటూళ్లో అయితే పట్టేస్తారు. ఈ విషయాన్ని సరదా సరదాగా చూపిస్తూనే, దర్శకుడు ఉత్కంఠను రేకెత్తిస్తాడు. చిన్నఊరు .. ఓ బజారు .. పరిమితమైన పాత్రలతో దర్శకుడు ఈ కథను చాలా ఆసక్తికరంగా చెప్పాడు. కథను - స్క్రీన్ ప్లేను ప్రధానమైన బలంగా నిలబెడుతూ, చివరివరకూ ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
పనితీరు: తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో .. ఒకటి రెండు లొకేషన్స్ లోనే ఆసక్తికరమైన కథలను చెప్పడంలో మలయాళ దర్శకులకు మంచి నైపుణ్యం ఉంటుంది. ఈ సినిమా విషయంలోను అది స్పష్టంగా కనిపిస్తుంది. జితిన్ టేకింగ్ .. అతుల్ రామచంద్రన్ - లిబిన్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి.
నజ్రియా నజీమ్ పాత్రను కేంద్రంగా చేసుకునే ఈ కథ నడుస్తుంది. తన నటనతో ఆమె మెప్పిస్తుంది. బాసిల్ జోసెఫ్ ఈ పాత్రతో తన నటనలో కొత్త కోణాన్ని చూపించాడు. శరణ్ వేలాయుధన్ ఫొటోగ్రఫీ .. క్రిస్టో సేవియర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరో రెండు పిల్లర్లు అని చెప్పాలి. చమన్ చాకో ఎడిటింగ్ కూడా ఓకే.
ముగింపు: ఏ సినిమాకైనా సరైన స్క్రిప్ట్ ముఖ్యం. బలమైన కథాకథనాలు .. పాత్రలను మలిచితీరు .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఇలా అన్నీ కుదిరినప్పుడే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. తెరపై చూపించవలసింది ఖర్చు కాదు .. కథను అనే విషయాన్ని అలాంటి సినిమాలే స్పష్టం చేస్తూ ఉంటాయి. 'సూక్ష్మదర్శిని' ఆ కోవలోకి వచ్చే సినిమాగానే చూడొచ్చు.
'సూక్ష్మదర్శిని' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!
| Reviews
Sookshmadarshini Review
- మలయాళంలో రూపొందిన 'సూక్ష్మదర్శిని'
- బ్లాక్ కామెడీ మిస్టర్ థ్రిల్లర్ జోనర్
- క్రితం ఏడాది నవంబర్లో విడుదలైన సినిమా
- ఆసక్తికరమైన కథాకథనాలు
- తక్కువ బడ్జెట్ లో చెప్పిన ఇంట్రెస్టింగ్ కంటెంట్
Movie Name: Sookshmadarshini
Release Date: 2025-01-10
Cast: Nazriya Nazim, Basil Joseph, Merin Philip, Pooja Mohanraj, Siddharth Bharathan, Deepak
Director: MC Jithin
Music: Christo Xavier
Banner: AVA Productions
Review By: Peddinti
Sookshmadarshini Rating: 3.00 out of 5
Trailer