భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు శంకర్, మాస్ చిత్రాల కథానాయకుడు రామ్‌చరణ్ కలయికలో చిత్రం అనగానే అందరిలోనూ చిన్న ఆసక్తి మొదలైంది. 'ఇక గేమ్ ఛేంజర్' అనే డిఫరెంట్ టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రంపై విడుదలకు ముందుగానే అంచనాలు మొదలయ్యాయి. దీంతో పాటు రామ్‌చరణ్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత నటించిన చిత్రం కావడంతో, సినిమా గురించి అందరూ ఎదురుచూశారు. అయితే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను 'గేమ్ ఛేంజర్' అందుకుందా? అసలు ఈ చిత్రం కథ ఏమిటి? ఆడియన్స్‌ను ఈ చిత్రం ఎంత వరకు మెప్పించింది? అనేది చూద్దాం.
కథ: రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఓ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తించి, ఆ తరువాత తను ప్రేమించిన అమ్మాయి దీపిక ( కియారా అద్వానీ)కి ఇచ్చిన మాట కోసం మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్‌గా తన సొంత జిల్లాకే (విశాఖ) కలెక్టర్‌గా వస్తాడు. ఆమె కోసమే తనలోని కోపాన్ని కూడా తగ్గించుకుంటాడు. విశాఖలో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోగానే అక్కడి అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తూ, తనకున్న పవర్స్‌తో వాటిని అడ్డుకుంటాడు రామ్‌నందన్.
ఈ క్రమంలోనే అక్కడి మంత్రి బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జేసూర్య)తో వైరం మొదలవుతుంది. అయితే మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి, గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతాడు. పదవుల కోసం ఆరాడపడుతూ అక్రమాలు చేస్తున్న కొడుకు మోపిదేవికి కాకుండా, రామ్‌నందన్‌కు సపోర్ట్ చేస్తుంటాడు. ముఖ్యమంత్రి అవ్వాలనే తన చిరకాల కోరిక కోసం మోపిదేవి ఏం చేస్తాడు? రామ్‌నందన్‌ను ఎలా ఎదుర్కొంటాడు? సత్యమూర్తికి, రామ్‌నందన్‌కి ఉన్న సంబంధ ఏమిటి? అప్పన్న (రామ్‌చరణ్), పార్వతి (అంజలి) ఎవరు? వాళ్లకు అభ్యుదయ పార్టీకి ఉన్న సంబంధమేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: రాజకీయాల నేపథ్యంలో నడిచే ఓ కథాంశం ఎంచుకుని, వ్యవస్థను ప్రక్షాళనను చేసే ఐఏఎస్ అధికారి చుట్టూ సాగే విధంగా దర్శకుడు శంకర్ ఈ కథను అల్లుకున్నాడు. ఆయన గత చిత్రాలు 'ఒకే ఒక్కడు' తో పాటు 'శివాజీ' చిత్రాలు గుర్తొచ్చే విధంగా ఈ కథాంశం ఉంటుంది. ఇలాంటి ఓ కథను ఎంచుకున్నప్పుడు సన్నివేశాలు ఎంతో బలంగా ఉండాలి. అయితే ఈ చిత్రంలో ఏ సన్నివేశం కూడా కన్వీన్సింగ్‌గా, హృదయానికి హత్తుకునే విధంగా అనిపించదు. పాత్రల ద్వారా ఉండాల్సిన ఎమోషన్స్ కూడా చిత్రంలో మచ్చుకు కూడా కనిపించవు.
ముఖ్యంగా ప్రేక్షకులు కోరుకునే ఉత్సుకత కానీ .. ఉత్కంఠ కాని లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. తరువాత సన్నివేశం ఏంటో ప్రేక్షకుడు ఎంతో సులువుగా ఊహించి చెప్పే విధంగా ఉన్నప్పుడు ప్రేక్షకుడు సినిమాలో లీనం కావడం కష్టం. శంకర్ ఎన్నికల వ్యవస్థలోని లాజిక్‌లు ఏ మాత్రం పట్టించుకోకుండా సన్నివేశాలు రాసుకున్నాడని సీన్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇలా సహజత్వానికి దూరంగా ఉండటం కూడా చిత్రం మీద ఆసక్తిని తగ్గించింది.
అయితే ఇంత సీరియస్ కథలో రామ్‌నందన్ ప్రేమకథ కూడా సినిమా వేగానికి అడ్డుపడింది. రామ్‌నందన్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి వ్యవస్థను ప్రక్షాళన చేసే సన్నివేశాలు 'ఒకే ఒక్కడు' సినిమాను గుర్తుచేస్తాయి. రామ్‌నందన్, మోపీదేవి మధ్య వచ్చే సన్నివేశాలు బలంగా లేకపోవడంతో ఆ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. అయితే సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే అప్పన్న ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. తమ ఊరును మైనింగ్ నుంచి కాపాడుకోవడానికి చేసే పోరాటం, డబ్బు లేని రాజకీయాలు చేయాలనే సంకల్పంతో పార్టీ పెట్టడం, ఆ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను అప్పన్న ఎదుర్కొవడం ఆడియన్స్‌ను మెప్పిస్తాయి.
ఈ మ్యాజిక్‌ను తరువాత వచ్చే కథలో శంకర్ కంటిన్యూ చేయలేకపోయాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాలతో పాటు ప్రీ క్లైమాక్స్ కూడా బలంగా లేకపోవడంతో సినిమా రక్తికట్టదు. తొలిభాగం ఓ మోస్తరుగా ఆక్టటుకున్నా, సెకండాఫ్‌లో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మినహా ఏది ఆకట్టుకోదు. ఇలాంటి ఓ కథకు సన్నివేశాల్లో బలం ఎంతో ముఖ్యం. అదే 'గేమ్ ఛేంజర్'లో లోపించింది.
నటీనటుల పనితీరు: అప్పన్నగా .. రామ్‌నందన్‌గా రామ్‌చరణ్ ఈ చిత్రంలో రెండు పాత్రలో కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్స్‌లోనూ ఆయన నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా అప్పన్న పాత్రలో ఆయన నటన అభినందనీయం. కియారా అద్వానిది రెగ్యులర్ హీరోయిన్ పాత్రనే. నటనకు పెద్దగా స్కోప్ లేదు. అంజలికి చాలా కాలం తరువాత నటనకి ఆస్కారమున్న పాత్ర దొరికింది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. అప్పన భార్యగా పార్వతిగా ఆమెకు మంచి మార్కులు పడతాయి.
ఎస్‌జే సూర్య నటన సినిమాకు ప్లస్ అయ్యే విధంగా ఉంది. మోపిదేవి పాత్రలో ప్రతినాయకుడిగా భయపెట్టడంతో పాటు అక్కడక్కడా నవ్వించాడు. సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్ పాత్రలు కథను ముందుకు నడిపించడంలో కనిపించే పాత్రలే తప్ప.. పెద్దగా ప్రత్యేకతలు ఏమీ లేవు.
సాంకేతిక వర్గం పనితీరు: ముఖ్యంగా ఈ సినిమా ఎంతో రిచ్‌గా కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తమన్ నేపథ్య సంగీతం కథ కాస్త స్పీడ్‌గా నడవడంలో సహాయపడింది. ఆయన నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో విజువల్స్ బాగున్నాయి. కళా దర్శకత్వం, ఎడిటింగ్ పనితీరు మెచ్చుకునే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం రైటింగ్ సైడ్ శ్రద్దపెట్టి, ఇంకాస్త బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే బాగుండేది. ఓ సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటప్పుడు రచన విభాగంలో చేయాల్సిన స్థాయిలో కసరత్తులు జరగలేదనిపిస్తుంది.
'గేమ్ ఛేంజర్' - మూవీ రివ్యూ!
| Reviews
Game Changer Review
- రొటిన్ కథతో 'గేమ్ ఛేంజర్'
- ఆసక్తికరంగా లేని కథా కథనాలు
- రామ్‌నందన్ - అప్పన్న పాత్రల్లో మెప్పించిన చరణ్
- నిరాశపరిచిన శంకర్
Movie Name: Game Changer
Release Date: 2025-01-10
Cast: Ram Charan, Kiara Advani, Anjali, Samuthirakani, S J Surya, Srikanth, Sunil, Jayaram
Director: Shankar
Music: Thaman
Banner: Sri Venkateshwara Creations
Review By: Madhu
Game Changer Rating: 2.50 out of 5
Trailer